ప్రపంచం వేడెక్కుతోంది

The world is warming– రికార్డు స్థాయిలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు
– ప్రతికూల వాతావరణ పరిస్థితులే కారణం
– కరువు కాటకాలు, వరదలతో అల్లాడుతున్న మానవాళి
అత్యంత అధిక ఉష్ణోగ్రత కలిగిన సంవత్సరంగా 2024 రికార్డు సృష్టించబోతోంది. వచ్చే సంవత్సరం ప్రారంభంలో ప్రపంచ దేశాల్లో ఉష్ణోగ్రతలు పెరగబోతున్నాయి. ఆందోళన కలిగించే ఈ అంచనాలను యూరోపియన్‌ యూనియన్‌కు చెందిన కాపర్‌నికస్‌ క్లైమేట్‌ ఛేంజ్‌ సర్వీస్‌ (సీ3ఎస్‌) అందజేసింది. తీవ్రమైన కరువు కాటకాలు, వరదలు, వడగాల్పులతో వివిధ దేశాల్లో ప్రతికూల వాతావరణ పరిస్థితులు ఏర్పడిన నేపథ్యంలో సీ3ఎస్‌ ఈ అంచనాలు వేసింది.
న్యూఢిల్లీ: ఈ ఏడాది జనవరి-నవంబర్‌ మధ్యకాలంలో అంతర్జాతీయంగా ఉష్ణోగ్రతలు 1.5 సెల్సియస్‌ డిగ్రీలు పెరిగాయి. గత సంవత్సరం అనేక దేశాల్లో ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదయ్యాయి. ఈ ఏడాది ఉష్ణోగ్రతలు ఆ రికార్డును అధిగమించే అవకాశం ఉంది. నవంబరులో కూడా వాతావరణం వేడిగా ఉన్నదని సీ3ఎస్‌ తెలిపింది. అసాధారణ ఉష్ణోగ్రతలకు ఇది ఉదాహరణ. ఇటలీ, దక్షిణ అమెరికాలో కరువు విలయతాండవం చేసింది. నేపాల్‌, సూడాన్‌తో పాటు యూరప్‌లోని కొన్ని ప్రాంతాలను వరదలు ముంచెత్తాయి. మెక్సికో, మాలీ, సౌదీ అరేబియాలోని కొన్ని చోట్ల వీచిన తీవ్రమైన వడగాల్పులు వేలాది మందిని బలి తీసుకున్నాయి. అమెరికా, ఫిలిప్పీన్స్‌లో సంభవించిన తుపానులు విధ్వంసాన్ని సృష్టించాయి. మానవ ప్రేరేపిత వాతావరణ మార్పుల కారణంగానే ఇలాంటి విపత్తులు సంభవిస్తున్నాయి. కార్బన్‌ ఉద్గారాలను సున్నా స్థాయికి తీసుకురావాలని ప్రపంచ దేశాలు ప్రతినబూని నప్పటికీ ఈ ఏడాది సీఓ2 ఉద్గారాలు రికార్డు స్థాయికి చేరే అవకాశం ఉంది. భవిష్యత్తులో సంభవించే వాతావరణ మార్పుల ప్రభావాన్ని తగ్గించడానికి తక్షణ చర్యలు అవసరమని నిపుణులు సూచించారు.
లా నినా వృద్ధి చెందితే ఈ ఏడాది కంటే వచ్చే సంవత్సరం వాతావరణం కొంత చల్లగా ఉండవచ్చునని, అయితే ఇప్పటికీ ప్రమాదకరమైన వడగాల్పులు, తీవ్ర వాతావరణ పరిస్థితులను ఎదుర్కొంటూనే ఉన్నామని లండన్‌లోని ఇంపెరియల్‌ కళాశాల సీనియర్‌ అధ్యాపకుడు ఫ్రెడ్రిక్‌ ఒట్టో హెచ్చరించారు. వాతావరణ మార్పులను ఎదుర్కొనేందుకు ఐరాస ఇటీవల జరిపిన చర్చల సందర్భంగా 300 బిలియన్‌ డాలర్ల ఒప్పందం కుదిరింది. అయితే పెరుగుతున్న ఖర్చుల దృష్ట్యా ఇది ఏ మాత్రం సరిపోదని పేద దేశాలు పెదవి విరిచాయి.

Spread the love