దారుణం..నలుగురు పిల్లలను కాల్వలో తోసి చంపేసిన తల్లి..

నవతెలంగాణ-హైదరాబాద్ : ఓ తల్లి తన నలుగురు పిల్లలను కాల్వలోకి విసిరేసి హతమార్చింది. ఈ హృదయ విదారక ఘటన నాగర్‌కర్నూలు జిల్లా బిజినేపల్లి మండలంలో చోటు చేసుకుంది. బిజినేపల్లి మండలం మంగనూరు గ్రామానికి చెందిన శరబంద, వసూరతండాకు చెందిన లలిత ఎనిమిదేండ్ల క్రితం ప్రేమించి పెండ్లి చేసుకున్నారు. వీరికి మహాలక్ష్మి(5), సాత్విక (4), మంజుల (3), మారుకొండయ్య (ఏడు నెలలు) సంతానం ఉన్నారు. కాగా, పదిరోజుల క్రితం దంపతుల మధ్య వాగ్వాదం జరిగింది. ఈ గొడవ ముదరడంతో భర్త శరబందపై శనివారం బిజినేపల్లి పోలీసు స్టేషన్‌లో లలిత ఫిర్యాదు చేసింది. అనంతరం స్టేషన్‌ నుంచి బయటకొచ్చిన లలిత నలుగురు పిల్లలతో కలిసి బిజినేపల్లి మండల కేంద్రానికి సమీపంలోని ఎంజీకేఎల్‌ఐ కాల్వ వద్దకు వెళ్లింది. అక్కడికి వెళ్లిన తర్వాత పిల్లలను ఆ కాల్వలో విసిరేసింది. ఇది గమనించిన స్థానికులు వెంటనే కాల్వలోకి దూకి పిల్లల కోసం గాలింపు చేపట్టారు. కానీ లాభం లేకపోయింది. ముగ్గురు చిన్నారులు మహాలక్ష్మీ, సాత్విక, మంజుల మృతదేహలు లభ్యమయ్యారు. ఏడు నెలల పిల్లాడి ఆచూకీ ఇంకా దొరకలేదు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Spread the love