నవతెలంగాణ-నిజామాబాద్: నిజామాబాద్ ప్రాంతంలో పసుపు బోర్డు ఏర్పాటు అంశం మరోసారి తెరపైకి వచ్చింది. సుగంధ ద్రవ్యాల బోర్డు పరిధిలోకే వచ్చే పసుపు పంటకు ప్రత్యేకంగా బోర్డు ఏర్పాటు చేయాలనే డిమాండ్ చాలా ఏళ్లుగా ఉంది. బీజేపీ గత ఎన్నికల సందర్భంలో హామీ ఇచ్చింది. కానీ, ఆ తర్వాత లోక్‌సభలో రాష్ట్రానికి చెందిన ఎంపీలు ఈ అంశాన్ని ప్రస్తావించగా.. అలాంటి ప్రతిపాదనేదీ లేదని కేంద్ర ప్రభుత్వం సమాధానమిచ్చింది. నిజామాబాద్ ప్రాంతంలో స్పైస్‌బోర్డు ఎక్స్‌టెన్షన్ సెంటర్ ఏర్పాటుతో పసుపు రైతులకు సేవలు అందుబాటులోకి తెచ్చినట్లు బీజేపీ నేతలు చెప్పుకొచ్చారు. కానీ, తాజాగా పసుపు బోర్డు ఏర్పాటుకు కేంద్రం అంగీకారం తెలిపినట్లు ప్రచారం తెరపైకి వచ్చింది. ఈ నెల 17న ప్రకటన చేయటంతోపాటు ప్రత్యేక పార్లమెంటు సమావేశాల్లో దీనికి సంబంధించి బిల్లు పెట్టే అవకాశం ఉందని.. ప్రకటన నేపథ్యంలో ప్రధాని మోడీ, కేంద్ర మంత్రి అమిత్‌షాలలో ఒకరు నిజామాబాద్‌లో పర్యటించే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ విషయాన్ని ధ్రువీకరించుకునేందుకు ఎంపీ అర్వింద్‌ను ఫోన్లో సంప్రదించేందుకు ప్రయత్నించగా.. అందుబాటులోకి రాలేదు.