ప్రేమించలేదని యువతి దారుణంగా నరికి చంపి, ఆపై..

నవతెలంగాణ – అమరావతి: తనను ప్రేమించలేదని ఓ యువతిని నడి రోడ్డు మీద దారుణంగా నరికి చంపిన ఘటన ఏలూరులో వెలుగు చూసింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. సత్రంపాడు ఎంఆర్‌సీ కాలనీలో నివాసముంటున్న జక్కుల రామారావుకు ఇద్దరు భార్యలు, రెండో భార్య రాజ్యలక్ష్మి, రామారావులకు ఏకైక కుమార్తె రత్నాగ్రేస్ అలియాస్ స్వీటీ (23) డిగ్రీ పూర్తి చేసింది. స్థానికంగా ఉన్న ఓ ప్రైవేటు పాఠశాలలో టీచర్ గా పనిచేస్తోంది.  రత్నాగ్రేస్ డిగ్రీ చదువుతున్నప్పుడు ముసునూరుకు చెందిన కట్టుబోయిన ఏసురత్నం పరిచయమయ్యాడు. ఆ తరువాత తనను ప్రేమించాలంటూ అతడు యువతి వెంటపడటం మొదలుపెట్టాడు. 2023లో వీరి చదువు పూర్తయ్యింది. ఆ తరువాత కూడా ఏసురత్నం అప్పుడప్పుడూ ఆమె వెంటపడి తనను ప్రేమించాలంటూ వేధించేవాడు. కొన్ని రోజుల క్రితం ఆమె ఈ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో, వారు ఏసురత్నం తల్లిదండ్రులకు విషయాన్ని తెలియజేయడంతో అతడిని మందలించారు.  మరోవైపు, ఈ నెల 26న రత్నాగ్రేస్ కు నిశ్చితార్థమైంది. జూన్ 16న వివాహం నిశ్చయమైంది. ఈ విషయం తెలిసిన ఏసురత్నం తను పనిచేసే స్కూలు దగ్గరకు వెళ్ళాడు. ఆమె  స్కూలు పక్కనే ఉన్న బ్యాంకు వద్దకు డబ్బులు డ్రా చేసేందుకు వచ్చింది. అప్పుడు ఏసురత్నం తనను పెళ్లి చేసుకోవాలని, లేకపోతే చంపేస్తానని బెదిరించాడు. తనకు పెళ్లి నిశ్చయమైందని రత్నాగ్రేస్ చెప్పడంతో ఆగ్రహంతో ఊగిపోయిన అతడు తన బ్యాగులోని కత్తిని తీసి.. తనను చంపమంటూ ఆమె చేతికిచ్చాడు. దీంతో ఆమె అతడిని వారించింది.  ఇంతలో ఏసురత్నం ఒక్కసారిగా ఆమె మెడపై విచక్షణా రహితంగా నరికాడు. దీంతో, ఆమె తీవ్ర రక్తస్రావమై అక్కడికక్కడే మృతి చెందింది. ఆ తరువాత ఏసురత్నం కూడా తన గొంతు కోసుకున్నాడు. తీవ్ర రక్తస్రావమై అతడూ స్పృహ కోల్పోయాడు. అటుగా వెళుతున్న పోలీసులు వారిని గుర్తించి ఆసుపత్రికి తరలించారు. ఏసురత్నం పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉంది.

Spread the love