నవతెలంగాణ – హైదరాబాద్ : ఓ యువకుడు (వినోద్) ప్రేమ పేరిట ఏడాదిగా వేధిస్తుండటంతో మనోవేదనకు గురైన యువతి తండ్రి రైలు కింద పడి బలవన్మరణానికి పాల్పడ్డారు. గద్వాల రైల్వే పోలీసుస్టేషన్ పరిధిలో బుధవారం ఈ ఘటన చోటు చేసుకుంది. రైల్వే హెడ్ కానిస్టేబుల్ అశోక్ తెలిపిన వివరాల ప్రకారం.. గద్వాలకి చెందిన యువతి తండ్రి(34) హమాలీ పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. ఆయన కుమార్తె ఓ పాఠశాలలో చదువుతుండగా పట్టణానికి చెందిన వినోద్ ప్రేమ పేరిట తరచూ వేధిస్తుండటంతో ఆమెను చదువు మాన్పించారు. ప్రవర్తన మార్చుకోవాలని కుటుంబ సభ్యులు, బంధువులతో కలిసి పలుమార్లు ఆయన వినోద్‌ను హెచ్చరించారు. అయినా మారకపోగా యువతికి వేధింపులు ఎక్కువ కావడంతో కలత చెంది గద్వాల మండలం వెంకంపేట శివారులో రైలు కింద పడి బలవన్మరణం చెందాడు. కేసు నమోదు చేశామని, నిందితుడు పరారీలో ఉన్నాడని అశోక్ చెప్పారు.