దేశద్వీపకల్పానికి అఖండజ్యోతిని
వెలిగిస్తావ్ అనుకున్నాం కదా
తమ్ముడు ఓ సారి లే
సుప్తావస్థలో ఉన్న వ్యవస్థ వెన్ను విరిచి
నిటారుగా నిలబెట్టడం
నీ భుజాల మీద పని కదా
తమ్ముడు ఓ సారి లే
ప్రశ్నించడం ప్రాథమిక హక్కు అయినప్పుడు
జీవితాన్ని జవాబు లేకుండా
జేబులో వేసుకుని తిరుగుతావెందుకు
తమ్ముడు ఓసారి లే
కడలి తీరాలలో కలల్ని అతికించి
ఏ మందు సీసాలో ఖననం అవుతావెందుకు
ఊపిరి అసలు ఉద్దేశాన్ని పక్కకు పెట్టి
ఏ ధూమపానపు పాన్పులు ఆవిరవుతావెందుకు
మత్తు సంకెళ్లు వేసే మాదకద్రవ్యాల లో
చిత్తు కాగితంలా నలిగిపోతావెందుకు
తులతూ ,ఊగుతూ
రుదిరం ఏ రహదారికో అర్పిస్తావెందుకు
నీకు తెలుస్తుందా
నిషెక్కిన నిస్సహాయత దేహం మీద
అంధకారం వ్యసనంగా అల్లుకుంటూపోతే
ఆర్థిక వ్యవస్థలు అంతస్తులు కట్టుకుంటున్నాయని
తాగితే పోతావ్ అని రాసి కూడా
అమ్మడం మానేయ లేదు అంటే అర్థం ఏమిటో తెలుసుకో
తాగితే పోతావ్ అని తెలిసి కూడా
తాగుతున్నావ్ అంటే తప్పు ఎవరిదో కనుక్కో
చేతి గడియారపు ముల్లులు కొనల్లో
జీవితం అర్థరహితంగా వెలాడకముందే
తాగుబోతు ట్యాగ్ నిన్ను హత్తుకోకముందే
తమ్ముడు ఓసారి లే…
పి.సుష్మ
నారాయణపేట, 9959705519
(యాంటీ డ్రగ్స్ డే సందర్భంగా)