డీసీసీబీ ఏటీఎంలలో చోరీ

– నాలుగు చోట్ల రూ.10.60 లక్షల అపహరణ
– ఖమ్మం, తల్లాడ, పెనుబల్లి, వైరాలో తస్కరణ
– సీసీ టీవీ ఫుటేజీలకు చిక్కిన నిందితులు
– రాజస్థాన్‌, బీహార్‌ అడ్రస్‌లతో ఆధారాలు
నవతెలంగాణ-ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (డీసీసీబీ) ఖమ్మం జిల్లాలోని నాలుగు బ్రాంచీల పరిధిలోని ఏటీఎంలలో వరుసగా చోరీలు జరుగుతున్నాయి. గుర్తు తెలియని వ్యక్తులు పలు రకాల ఏటీఎం కార్డులు ఉపయోగించి ఈ చోరీకి పాల్పడుతున్నట్టు ఆధారాలు లభ్యమయ్యాయి. ఖమ్మం, వైరా, తల్లాడ, పెనుబల్లి ఏటీఎంలలో మొత్తం రూ.10.60 లక్షలు అపహరణకు గురైనట్టు బ్యాంక్‌ అధికారులు గుర్తించి శుక్రవారం ఆయా పోలీస్‌ స్టేషన్‌లలో ఫిర్యాదు చేశారు. చోరీకి పాల్పడిన వారి ఫొటోలు ఏటీఎంలలోని సీసీ కెమెరాలకు చిక్కాయి. ఉపయోగించిన ఏటీఎం కార్డుల ఆధారంగా నిందితులు రాజస్థాన్‌, బీహార్‌ రాష్ట్రాలకు చెందిన వారీగా పోలీసులు గుర్తించారు. నలుగురు వ్యక్తులు ఓ ముఠాగా ఏర్పడి ఈ చోరీలకు పాల్పడుతున్నట్టు భావిస్తున్నారు. ఈనెల 1వ తేదీ నుంచి మొదలైన ఈ చోరీల పరంపర గురువారం రాత్రి వరకు కొనసాగింది. అయితే, బ్యాంక్‌ అధికారులు గుర్తించడం ఆలస్యమైంది. ఏటీఎంలో నగదు తీసుకెళ్లకుండా అకౌంట్‌ టూ అకౌంట్‌ ట్రాన్స్‌ఫÛర్‌ చేసినట్టు తెలుస్తోంది. దీనివల్ల ఏటీఎంలో నగదు తగ్గకపోవడంతో బ్యాంక్‌ అధికారులు గుర్తించడం ఆలస్యమైంది.
11 డెబిట్‌ కార్డల సహాయంతో..
మొత్తం నలుగురు నిందితులు 11 డెబిట్‌ కార్డుల సహాయంతో ఒక్కొక్క చోట 20 నుంచి 30 సార్లకు పైగా నగదును తమ అకౌంట్లలోకి ట్రాన్స్‌ఫర్‌ చేసినట్టుగా పోలీసులు గుర్తించారు. పెనుబల్లిలో డీసీసీబీ ఏటీఎంకి సమీపంలో ఉన్న ఆగ్రోస్‌ పురుగుల మందు దుకాణంలోనూ చోరీ జరిగింది. రూ.1.50 లక్షలు మాయం అయింది. ఇది కూడా ఈ ముఠా పనేనని అనుమానిస్తున్నారు. ఆయా అకౌంట్లోకి ట్రాన్స్‌ఫర్‌ అయిన నగదును తిరిగి బ్యాంకు అకౌంట్‌లోకి రప్పించేందుకు బ్యాంక్‌ సిబ్బంది చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. తల్లాడలో ఒకటో తేదీ రాత్రి రూ.2.80 లక్షలు అపహరణకు గురికాగా, నాలుగో తేదీ బ్యాంకు సిబ్బంది గుర్తించారు. పై అధికారులకు విషయం తెలియజేశారు. వారి సూచన మేరకు బ్యాంక్‌ మేనేజర్‌ రమ్యశ్రీ గురువారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఖమ్మంలో 6వ తేదీ నగదు అపహరణ జరిగింది. డీసీసీబీ ప్రధాన బ్రాంచ్‌ ఏటీఎం నుంచి రూ.2.30 లక్షలు చోరీకి గురైన విషయాన్ని సిబ్బంది గుర్తించి శుక్రవారం ఖమ్మం త్రీటౌన్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సిఐ సత్యనారాయణ కేసు దర్యాప్తు చేస్తున్నారు. పెనుబల్లి డీసీసీబీ ఏటీఎం నుంచి రూ.2 లక్షలు ఆరో తేదీ రాత్రి 9 గంటల సమయాన అపహరణకు గురైనట్టు సీసీటీవీ ఫుటేజ్‌ల ద్వారా తెలుస్తోంది. బ్యాంక్‌ మేనేజర్‌ శుక్రవారం ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. దీనికి నాలుగు రోజుల ముందు స్థానిక ఆగ్రోస్‌ పురుగుమందుల షాప్‌లోనూ ఇదే ముఠా చోరీకి పాల్పడినట్టు తెలుస్తోంది. వైరాలోని డీసీసీబీ ఎటిఎం నుంచి రూ.3 లక్షలకు పైగా నగదు అపహరణ జరిగినట్టు పోలీస్‌ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. గతంలో తిరుమల పాలెం మండల కేంద్రంలోని శాఖలో కొద్ది రోజుల వ్యవధిలో రెండు పర్యాయాలు చోరీలు జరిగాయి. ఆ ఘటనలను మరవకముందే డీసీసీబీ ఏటీఎంలలో నగదు చోరీకి గురవడం చర్చనీయాంశంగా మారింది.
నగదు ఉన్నట్టు చూపిస్తోంది.. అందుకే గుర్తించటం ఆలస్యం
వీరబాబు, సీఈవో, డీసీసీబీ, ఖమ్మం
ఏటీఎంలో నగదు ఉన్నట్టు చూపిస్తుండటంతో చోరీలను గుర్తించడం ఆలస్యమైంది. నిందితులు సీసీటీవీ ఫుటేజ్‌లకు చిక్కారు. ఆ ఫొటోలు, వారి అకౌంట్‌ వివరాల ఆధారంగా పోలీస్‌ స్టేషన్‌లలో ఫిర్యాదు చేశాం. నలుగురు ఈ దొంగతనాలకు పాల్పడినట్టు తెలుస్తోంది. వారి అకౌంట్లకు బదిలీ అయిన నగదును వెనక్కి రప్పించేందుకు ప్రయత్నం చేశాం. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వివరాలు అన్నీ ఉన్నాయి కాబట్టి దొంగలు పట్టు పడతారన్న విశ్వాసంతో ఉన్నాం.

Spread the love