– రాష్ట్రపతికి వీరశైవ లింగాయత్, లింగ బలిజ నేతలు విజ్ఞప్తి
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
తెలంగాణలోని వీరశైవ లింగాయత్, లింగ బలిజలను ఓబీసీ జాబితాలో చేర్చేలా కేంద్రానికి ఆదేశాలు ఇవ్వాలని వీరశైవ లింగాయత్, లింగ బలిజ నేతలు రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకి విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర వీరశైవ లింగాయత్, లింగ బలిజ సంఘం అధ్యక్షులు వెన్న ఈశ్వరప్ప నేతృత్వంలో బృందం శుక్రవారం రాష్ట్రపతి ద్రౌపది మర్మును కలిసి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో వీరశైవ లింగాయతులు, లింగ బలిజలు జీవన విధానాలను, స్థితిగతులను ముర్ముకు వివరించారు. 2009లో వీరశైవ లింగాయత్ లను, లింగ బలిజలను రాష్ట్ర ప్రభుత్వం వెనుకబడి తరగతులలో చేర్చిందని తెలిపారు. కానీ 14 ఏళ్లు గడచినప్పటికీ కేంద్ర ఓబీసీ జాబితాలో చేర్చలేదని వివరించారు. దీంతో విద్యా, ఉద్యోగ, ఉపాధి అవకాశాల్లో ఆయా వర్గాలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని తెలిపారు. కాగా ఈ నెల 5 వ తేదిన నేషనల్ బీసీ కమిషన్ కేంద్ర ప్రభుత్వ, రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో, అన్ని కుల సంఘాలతో చర్చలు జరిపి… వీరశైవ లింగాయత్, లింగ బలిజలను కేంద్ర ఓబీసీ జాబితాలో చేర్చేందుకు ప్రతిపాదనలు పంపిస్తామని తెలిపిందన్నారు. తమ విజ్ఞప్తులపై రాష్ట్రపతి సానుకూలంగా స్పందించినట్లు మీడియాకు వెల్లడించారు.