అక్కడ ఇవ్వలే.. ఇక్కడ డైలాగులు

ఓట్ల కోసమే బీజేపీ, కాంగ్రెసోళ్లు వస్తుండ్రు : ఐటీ, పురపాలక, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌
నవతెలంగాణ- ములుగు
కాంగ్రెస్‌, పార్టీకి ఛత్తీస్‌గఢ్‌లో ఇంటింటికీ నల్లా నీరిచ్చే మొఖం లేదు కానీ.. తెలంగాణలో మాత్రం పెద్దపెద్ద డైలాగులు కొడుతున్నారని, ఎలక్షన్లు రాగానే కాంగ్రెస్‌, బీజేపోళ్లు వివిధ హామీలతో వస్తున్నారని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఐటీ, పురపాలక, పరిశ్రమలశాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు అన్నారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా బుధవారం ములుగు జిల్లా కేంద్రంలో నిర్వహించిన సాగునీటి దినోత్సవ వేడుకల్లో కేటీఆర్‌ పాల్గొన్నారు. అంతకు ముందు రూ.133 కోట్లతో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన, రూ.120 కోట్ల విలువైన సబ్సిడీ పథకాలు, ఆస్తులు పంపిణీ చేశారు. రూ.65 కోట్లతో నిర్మించే సమీకృత కలెక్టరేట్‌ భవనానికి, రూ.38 కోట్ల 50లక్షలతో నిర్మించే జిల్లా పోలీస్‌ కార్యాలయానికి, రూ.10 కోట్ల 40 లక్షలతో నిర్మించే ప్రభుత్వ కార్యాలయ భవనాలకు, రూ. కోటీ 25లక్షలతో నిర్మించే బస్‌ స్టాండ్‌కు, రూ.50 లక్షలతో సేవాలాల్‌ భవన నిర్మాణానికి, రూ.30 లక్షలతో డిజిటల్‌ లైబ్రరీ భవనానికి, రూ.కోటితో శ్మశానవాటిక నిర్మాణానికి, రూ.15 లక్షలతో సమాచార పౌర సంబంధాల శాఖ సమావేశ మందిర నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. రూ.12కోట్ల 50లక్షలతో జిల్లాలో నిర్మించిన 5 మార్డెన్‌ పోలీస్‌ స్టేషన్లను, రూ.2 కోట్లతో నిర్మించిన సీసీ రోడ్లను ప్రారంభించారు.
ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ.. ప్రొఫెసర్‌ జయశంకర్‌లాంటి మేధావుల సహకారం, సారథ్యంలో తెలంగాణ ప్రజలను చైతన్యవంతం చేసి ఎత్తిన జెండా దించకుండా పోరాటం చేసి నాడు దాశరథి అన్న ‘నా తెలంగాణ కోటి రతనాల వీణ’ మాత్రమే కాదు.. కోటిన్నర ఎకరాల మాగాణి అని రుజువు చేసిన మహానాయకుడు కేసీఆర్‌ అని అన్నారు. ముఖ్యమంత్రి సారథ్యంలో ఇవాళ సాగునీటి దినోత్సవ సంబురాలు జరుపుకుంటున్నామని, ఇక్కడికి హెలికాప్టర్‌లో హౌం మంత్రి మహమ్మద్‌ అలీ, డీజీపీ అంజని కుమార్‌, రాష్ట్ర రైతుబంధు అధ్యక్షులు, ఎమ్మెల్సీ పల్లె రాజేశ్వర్‌ రెడ్డి, ఎమ్మెల్సీ శ్రీనివాస్‌ రెడ్డిలతో వచ్చిన సమయంలో అంతా చూసుకుంటూ వచ్చామని తెలిపారు. ఎక్కడ చూసినా చెరువులు నిండుకుండల్లా కనిపిస్తున్నయన్నారు. ఒకప్పుడు ఎండకాలం వచ్చిందంటే సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, ఎంపీపీలు ఊళ్లకు వెళ్లాలంటే భయపడేవారన్నారు. నాడు కాంగ్రెస్‌ పాలనలో, సమైక్య రాష్ట్ర పాలనలో ఎంతో గోస ఉండేదో అందరూ గుర్తు చేసుకోవాలన్నారు. నేడు ఆ గోస రాష్ట్రంలో లేదన్నారు. కాంగ్రెస్‌ అధికారంలో ఉన్న సమయంలో తాగునీటి కటకట ఉండేదన్నారు. ప్రజా పక్షపాతి సీఎం కేసీఆర్‌ను ప్రజలు ఆశీర్వదించాలని కోరారు. కార్యక్రమంలో మంత్రులు మహమూద్‌ అలీ, ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్‌, మహబూబాబాద్‌ ఎంపీ మాలోత్‌ కవిత, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌ రెడ్డి, శ్రీనివాస్‌ రెడ్డి, ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌ రెడ్డి, రాష్ట్ర జల వనరుల అభివృద్ధి సంస్థ చైర్మెన్‌ ప్రకాష్‌, మాజీ ఎంపీ సీతారాం నాయక్‌, జిల్లా కలెక్టర్‌ కృష్ణ ఆదిత్య, అదనపు కలెక్టర్‌ ఇలా త్రిపాఠి, జడ్పీ చైర్మెన్‌ కుసుమ జగదీష్‌, వైస్‌ చైర్మెన్‌ బడే నాగజ్యోతి, జడ్పీటీసీలు, ఎంపీపీలు, ఎంపీటీసీలు, సర్పంచులు తదితరులు పాల్గొన్నారు.

Spread the love