సొంతూళ్లకు ఓటర్లు… హైదరాబాద్ లో భారీ ట్రాఫిక్ జామ్

నవతెలంగాణ హైదరాబాద్‌: రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒకే రోజు ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఏపీలో ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఆ రాష్ట్ర ఓటర్లు స్వస్థలాలకు తరలి వెళ్తున్నారు. ఉద్యోగ, ఉపాధి రీత్యా హైదరాబాద్‌లో స్థిరపడిన వారంతా ఆంధ్రప్రదేశ్ కు బయల్దేరడంతో రోడ్లన్నీ రద్దీగా మారాయి. సొంత వాహనాల్లో వెళ్లేవారితో హైదరాబాద్‌- విజయవాడ హైవేపై పలుచోట్ల ట్రాఫిక్‌జామ్‌ అవుతోంది. వారాంతం కావడం, పోలింగ్‌కు కేవలం రెండు రోజులే మిగిలి ఉండటంతో శనివారం తెల్లవారుజాము నుంచే హైవేపై భారీ రద్దీ నెలకొంది. ఆయా వాహనాలు విజయవాడ మీదుగా రాజమహేంద్రవరం, విశాఖపట్నం వైపు వెళ్తున్నాయి. పెద్ద సంఖ్యలో వాహనాలు రోడ్డుపైకి చేరుకోవడంతో పలుచోట్ల నెమ్మదిగా ముందుకు సాగుతున్నాయి. దీంతో హైదరాబాద్‌ శివారు హయత్‌నగర్‌ నుంచి అబ్దుల్లాపూర్‌మెట్‌ వరకు ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలుగుతోంది. చౌటుప్పల్‌, పంతంగి టోల్‌ప్లాజాల వద్ద వాహనాలు బారులు తీరాయి.

Spread the love