వంతెన లేదు.. వాగు దాటలేరు

There is no bridge.. cannot cross the stream– దశాబ్దాలుగా గిరిజనుల ఇబ్బందులు వర్షాకాలంలో తరుచూ రాకపోకలకు అంతరాయం
– నిధులు మంజూరైనా పనులకు నోచుకోని వైనం
నవతెలంగాణ-జన్నారం
వర్షాకాలం వచ్చిందంటే ఆ గ్రామాల ప్రజల్లో ఆందోళన మొదల వుతుంది. వరదలు రావడం.. వాగులు పొంగిపొర్లడంతో ఆయా గ్రామాలకు రాకపోకలు నిలిచిపోతాయి. అత్యవసర మైనా వెళ్లలేని పరిస్థితి. మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలోని గిరి పల్లెల బాధలు ఇవి. ప్రతి ఏటా వర్షాకాలం వచ్చిందంటే గిరిజనులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. లోతొర్రె గోండుగూడ, రోటిగూడ వాగులపై వంతెనలు లేక అవస్థలు పడుతున్నారు. ఈ గ్రామాలకు వెళ్లాలంటే వాగు దాటితే తప్ప వెళ్లలేని పరిస్ధితి. గతంలో ఓ రైతు ఎడ్లబండితో వాగును దాటుతుండగా ఉధృతి పెరిగి ఎండ్లబండితో పాటు రెండు ఎద్దులూ కొట్టుకుపోయాయి. ప్రాణాపాయ స్థితిలో రైతు బయటపడ్డాడు. ఇలా ప్రతిసారి అనేక ప్రమాదాలు చోటు చేసుకుంటు న్నాయి. గత ప్రభుత్వం నిధులు మంజూరు చేసినప్పటికీ పనులు చేపట్టడంలో నిర్లక్ష్యం జరుగుతోంది. ఫలితంగా ఈ ఏడాది కూడా గిరిజనులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ ప్రభుత్వ మైనా ప్రత్యేక చొరవ చూపి మూడు వాగులపై వంతెనలు నిర్మించాలని ఆయా గ్రామాల
ప్రజలు కోరుతున్నారు.
నిలిచిపోయిన పనులు..
మండలంలోని లోతొర్రె గ్రామానికి వెళ్లే ప్రధాన రహదారిపై వంతెన నిర్మాణానికి గత ప్రభుత్వం యుద్ధప్రతిపాదికన డీఎంఎఫ్టీ నిధుల కింద రూ.10 లక్షలు, నిధుల నుంచి రూ. 20 లక్షలు మంజూరు చూశారు. టెండరు ప్రక్రియ పూర్తయినప్పటికీ సదరు గుత్తేదారు నిధులు సరిపోవనే కారణంగా చేతులెత్తేశాడు. దాంతో పనులు చేపట్టేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. మరోమారు టెండరు వేసేందుకు ప్రభుత్వం ముందుకు వచ్చిన సమయంలోనే ఎన్నికల కోడ్‌ వచ్చింది. గోండుగూడ- జన్నారం మధ్య ఉన్న వాగుపై వంతెన నిర్మాణానికి రూ.2 కోట్ల నిధులకు ప్రతిపాదనలు పంపగా ఎస్డీఎసీఎఫ్‌(ట్రైబల్‌) నిధులు మంజూరు చేశారు. కాగా ఇంకా టెండరు వేయలేదు. అలాగే, రోటిగూడ గ్రామానికి వెళ్లే ప్రధాన రహదారిపై మహ్మదాబాద్‌-రోటిగూడ గ్రామాల మధ్యలో ఉన్న బండోరా వాగుపై ట్రైబల్‌ నిధులు రూ.2 కోట్లు మంజూరు అయినా ఇంకా టెండరు ప్రక్రియకు నోచుకోలేదు.

త్వరలోనే పనులు చేపడతాం : సుబ్బారెడ్డి, పంచాయతీరాజ్‌ ఇన్‌చార్జి జేఈ

లోతొర్రె, గోండుగూడ, రోటిగూడ వాగులపై వంతెనల నిర్మాణానికి ప్రభుత్వం నిధులు మంజూరు చేసినా టెండర్లకు ఎన్నికల కోడ్‌ అడ్డు రావడంతో పసులు నిలిచిపోయాయి. ఈ మూడు వాగులపై వంతెనల నిర్మాణానికి ప్రతిపాదనలు ఇప్పటికే పంపించాం. త్వరలోనే వంతెనల నిర్మాణం చేపడతాం.

వంతెనల నిర్మాణం చేపట్టాలి: ఎర్ర చంద్రశేఖర్‌, మాజీ జడ్పీటీసీ, జన్నారం
మండలంలోని లోతొర్రె, గోండుగూడ, రోడిగూడ గ్రామాల ప్రజలకు వాగులపై వంతెన లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వర్షాకాలంలో వాగులు దాటలేక ప్రజలు నరకయాతన పడుతున్నారు. వంతెనల నిర్మాణం టెండరు ప్రక్రియ త్వరగా పూర్తి చేసి నిర్మాణాలు మొదలు పెట్టాలి. ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి త్వరగా పనులు పూర్తి చేయాలి.
వర్షాకాలం వస్తే నరకయాతనే : శంకర్‌ నాయక్‌, లోతొర్రె మాజీ ఉపసర్పంచ్‌
వర్షాకాలం వస్తే లోతొర్రె గ్రామ ప్రజల పరిస్థితి దయనీయంగా మారుతుంది. అత్యవసర పరిస్థితులు ఉంటే వాగు దాటి వెళ్లాల్సిందే. భారీ వర్షాలకు వాగు ఉప్పొంగి ప్రవహించడంతో వాగు దాటడం నరకప్రాయంగా మారుతోంది. పలుమార్లు వాగులో పడి ఇబ్బందులు పడ్డ పరిస్థితిలూ ఉన్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం దృష్టి సారించి వాగుపై వంతెన త్వరగా నిర్మించాలి.

వాగులు ఉప్పొంగితే.. దిగ్బంధనమే..
జన్నారం మండలంలోని లోతొర్రె గ్రామం, గోండుగూడ, రోటిగూడ గ్రామాలతో పాటు పలు ఇతర గ్రామాలకు సైతం వాగులపై వంతెనలు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. లోతోర్రె, దేవుని గూడ గ్రామాలకి మధ్యలో ఉన్న వాగుతో సహా, వర్షాకాలం వచ్చిందంటే కవ్వాల్‌టైగర్‌ జోన్‌లోని వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తాయి. దాంతో రోజుల తరబడి లోతొర్రె, చిన్న లోతొర్రే గ్రామాల ప్రజలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోతాయి. రోజుల తరబడి బిక్కుబిక్కుమంటూ జీవనం వెళ్లదీసే పరిస్థితి నెలకొంటుంది. ఆరోగ్యం, ఆత్యవసర సమయంలో ఇబ్బందులు తలెత్తితే ప్రమాదకరంగా వాగు దాటి వెళ్లాల్సి వస్తోంది. జన్నారం పంచాయతీలోని గోండుగూడ వాగు వర్షాలకు ఏటా ఉప్పొంగి ప్రవహిస్తుంది. రోటిగూడ గ్రామానికి వెళ్లే దారిలో ఉన్న బండోరా వాగు కూడా వర్షాలకు ఉప్పొంగి రాకపోకలు నిలిచి పోతుంటాయి.

Spread the love