– ఆశ్రమ పాఠశాలల్లో మెరుగుపడని సౌకర్యాలు
– పనిచేయని సోలార్ వాటర్ హీటర్లు, శుద్ధినీటి పరికరాలు
– అరకొర సౌకర్యాల మధ్యనే ‘గిరి’ చదువులు
– పర్యవేక్షణ మరిచిన ఐటీడీఏ అధికారులు
ఆదివాసీ గిరిజన పిల్లలు చదివే ఆశ్రమ పాఠశాలల్లో సంక్షేమం కొరవడుతోంది.. ఏండ్లు గడుస్తున్నా వసతుల మెరుగుదలలో తీరు మారడం లేదు. అరకొర సౌకర్యాల మధ్యనే చదువులు సాగించాల్సిన దుస్థితి నెలకొంది. ప్రతి పాఠశాలలోనూ శుద్ధనీటి పరికరాలు ఏడాది కాలంగా పనిచేయకపోయినా పట్టించుకున్న నాథులే లేరు. సోలార్ వాటర్ హీటర్లు పనిచేయక.. అలంకార ప్రాయంగా మారాయి. సౌకర్యాలపై అధికారులు, ఉపాధ్యాయులను అడగలేని ఆ పిల్లలు అరకొర వసతుల మధ్యనే చదువులు సాగిస్తున్నారు. ఐటీడీఏ అధికారుల పర్యవేక్షణ పూర్తిగా లోపించడం వల్లే సౌకర్యాలు కరువయ్యాయన్న విమర్శలొస్తున్నాయి. కొన్ని పాఠశాలల్లో మెనూ సక్రమంగా అమలు కావడం లేదు. ఫలితంగా విద్యార్థులకు పౌష్టికాహారం అందడం లేదు.
నవతెలంగాణ- ఆదిలాబాద్ ప్రాంతీయ ప్రతినిధి, తలమడుగు
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఆదివాసీ గిరిజనులు అధికంగా ఉన్నాయి. వీరి సంక్షేమం, అభివృద్ధి కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ(ఐటీడీఏ) ఏర్పాటు చేసింది. ప్రతి ఏటా రూ.కోట్లాది నిధులు అందజేస్తోంది. ఆశ్రమ పాఠశాలలు సైతం ఐటీడీఏ పరిధిలోనే కొనసాగుతున్నాయి. జిల్లాలో ఒకటి, రెండు తరగతుల కోసం ఆశ్రమ ప్రాథమిక పాఠశాలలు ఏర్పాటు చేయగా.. మూడో తరగతి నుంచి వసతితో కూడిన ఆశ్రమ పాఠశాలలను నెలకొల్పింది. ప్రస్తుతం 133 ఆశ్రమ పాఠశాలలు ఉండగా.. వీటిలో 33,071మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ఇంత మంది పిల్లలు చదువుకుంటున్న ఈ పాఠశాలల్లో పూర్తిస్థాయి సౌకర్యాల కల్పన పట్ల అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. ప్రభుత్వం నుంచి నిధులు సకాలంలో రాకపోవడం.. వచ్చిన సమయంలో అధికారులు మౌలిక వసతులు మెరుగుపర్చకపోవడం మూలంగా విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇటీవల జిల్లాలో పర్యటించిన రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్ ఉట్నూర్‌లోని ఓ ఆశ్రమ పాఠశాలను సందర్శించగా.. అక్కడ వసతులు సక్రమంగా లేకపోవడంతో అసంతృప్తి వ్యక్తం చేశారు.
ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలం పూనగూడ ఆశ్రమ పాఠశాలలో 240మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ఇక్కడ శుద్ధనీటి పరికరం మరమ్మతులకు గురై సుమారు ఏడాది గడిచినా బాగు చేయించడం లేదు. విద్యార్థులు భగీరథ నీటితో పాటు పాఠశాల ఆవరణలో ఉండే బోరు నీటిని తాగాల్సిన దుస్థితి నెలకొంది. సోలార్ వాటర్ హీటర్ కూడా పనిచేయడం లేదు. దీంతో విద్యార్థులు రోజూ చన్నీటితోనే స్నానం చేయాల్సి వస్తోంది. సిరికొండ మండలంలోని రాయిగూడ ఆశ్రమ పాఠశాలలో మరుగుదొడ్డి తలుపులు విరిగిపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరుగుదొడ్లతో పాటు పరిసరాలు సైతం అపరిశుభ్రంగా ఉన్నాయి. నెలలు గడస్తున్నా సమస్య పరిష్కారం కావడం లేదు.
భగీరథ నీరు.. చన్నీటితోనే స్నానం..!
మనిషికి అనేక వ్యాధులకు కలుషిత నీరే కారణమని వైద్యులు చెబుతుంటారు. కానీ గిరి విద్యార్థులు మాత్రం వాటికి నోచుకోవడం లేదు. ప్రభుత్వం ఆశ్రమ పాఠశాలల్లో రూ.లక్షలు వెచ్చించి శుద్ధనీటి పరికరాలు అందుబాటులో ఉంచినా.. అవి పనిచేయకపోతే మరమ్మతులు చేయించడం లేదు. ఈ పరికరాలు బిగించిన కంపెనీ కూడా పట్టించుకోవడం లేదు. దీంతో విద్యార్థులు భగీరథ నీటితో పాటు స్థానికంగా ఉండే బోరునీటిని తాగాల్సి వస్తోంది. మరోపక్క ఈ పాఠశాలల్లో విద్యార్థుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన సోలార్ వాటర్ హీటర్లు పనిచేయడం లేదు. వేడి నీటి పరికరాలు పనిచేయకపోవడం మూలంగా చన్నీటితోనే స్నానం చేయాల్సి వస్తోందని విద్యార్థులు చెబుతున్నారు. మరోపక్క కొన్ని పాఠశాలల్లో మెనూ సైతం సక్రమంగా పాటించడం లేదనే ఆరోపణలున్నాయి. నిరంతరం పర్యవేక్షణ చేపట్టి పాఠశాలల్లో స్థితిగతులు తెలుసుకోవాల్సిన అధికారులు నెలల తరబడి అటువైపు కన్నెత్తి చూడటం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.