ఫిషరీస్‌, వ్యవసాయంపై కుదరని ఏకాభిప్రాయం

అబుదాబి: ఆహార భద్రతకు సంబంధించిన కీలకమైన వ్యవసాయం, ఫిషరీస్‌ వంటి అంశాలపై ఎలాంటి ఒప్పందం లేకుండానే డబ్ల్యుటిఓ 13వ మంత్రిత్వ స్థాయి చర్చలు ముగిశాయి. ఆహార నిల్వలపై ప్రభుత్వ నియంత్రణ ఉండరాదని సంపన్న దేశాలు వాదించగా, వర్థమాన దేశాలు దీనిని వ్యతిరేకించాయి. దీనిపై ముమ్మర చర్చలు జరిగినప్పటికీ ఏకాభిప్రాయాన్ని సాధించడంలో సమావేశం విఫలమైంది. అలాగే మత్స్య పరిశ్రమ సబ్సిడీలపై కోత పెట్టాలన్న ధనిక దేశాల డిమాండ్‌కు తీవ్ర ప్రతిఘటన ఎదురైంది. మితిమీరిన చేపల వేటకు దారితీస్తున్న సమస్యలకు ఇది ఎలాంటి పరిష్కారం చూపలేకపోయింది. మరో రెండేళ్లపాటు ఇ కామర్స్‌ వాణిజ్యంపై దిగుమతి సుంకాలపై మారటోరియాన్ని పొడిగించేందుకు సభ్య దేశాలు అంగీకరించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఫిబ్రవరి 26న ప్రారంభమైన ఈ సమావేశాలు 29తో ముగియాల్సి వుంది, అయితే, ఫిషరీస్‌, వ్యవసాయం వంటి అంశాల్లో ఎలాగైనా ఒప్పందం కుదుర్చుకోవాలన్న దాంతో చర్చలను ఒక రోజు పొడిగించారు. దీంతో శుక్రవారం కూడా చర్చలు కొనసాగాయి. అయినా ఫలితం లేకపోయింది. ఆహార భద్రతకు సంబంధించిన అంశంపై ఉమ్మడి ప్రాతిపదికను కుదుర్చుకోవడంలో సభ్యదేశాలు విఫలమయ్యాయి. పేద రైతులు, మత్స్యకారుల ప్రయోజనాలను పరిరక్షణకు సంబంధించిన అంశాలపై జి-33 గ్రూపుతో కలసి భారత్‌ చేసిన వాదనను సంపన్న దేశాలు పట్టించుకోలేదు. వర్థమాన దేశాల ఎగుమతులపై ఎలాంటి ఆంక్షలు వుండరాదని బ్రెజిల్‌ వాదించింది. ప్రపంచ వ్యాపితంగా 80 కోట్ల మంది ప్రజల జీవనోపాధికి సంబంధించిన ఆహార భద్రత సమస్యకు శాశ్విత పరిష్కారం చూపడంలో 166 దేశాలతో కూడిన డబ్ల్యుటివో విఫలమైంది.

 

Spread the love