ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల పరిష్కారంలో వివక్ష తగదు

– జాతీయ ఎస్సీ కమిషన్‌ వైస్‌చైర్మెన్‌ అరుణ్‌ హల్దార్‌
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల పరిష్కారంలో ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారులు తగిన శ్రద్ధ చూపటం లేదనీ, ఇలా వివక్ష చూపటం తగదని జాతీయ ఎస్సీ కమిషన్‌ వైస్‌చైర్మెన్‌ అరుణ్‌ హల్దార్‌ అన్నారు. సోమవారం హైదరాబాద్‌లోని దిల్‌కుష్‌ గెస్ట్‌హౌస్‌లో విలేకర్ల సమావేశాన్ని నిర్వహించారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల పరిష్కారం, వివిధ సంక్షేమ కార్యక్రమాల అమలు తీరుపై ఆయన సమీక్షించారు. పలువురు బాధితుల నుంచి వినతి పత్రాలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వాలకు మనుసునుండాల్నేగానీ..కేసుల్ని తక్షణం పరిష్కారం చేయొచ్చన్నారు. వివక్షకు తావులేకుండా న్యాయం వైపే మొగ్గుచూపాలని అధికారులకు సూచించారు. ఎస్సీ, ఎస్టీలకు వ్యతిరేకంగా ఉద్యోగులు ప్రవర్తిస్తే వారి ఉద్యోగానికే ముప్పు వాటిల్లుతుందని హెచ్చరించారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల పరిష్కారంలో సుప్రీం కోర్టు నిర్దేశించిన మార్గదర్శకాలను తూచా తప్పకుండా పాటించాలన్నారు. ఫిర్యాదులు నమోదైన వెంటనే వాస్తవాలను క్షుణ్ణంగా విశ్లేషించి బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. దళితులపై దాడులు, ఇతర ఘటనలు జరిగిన సమయంలో జిల్లా యంత్రాంగం ఆయా ప్రాంతాలకు వెళ్లి తక్షణమే స్పందిస్తే చాలా కేసులు అక్కడికక్కడే పరిష్కారవుతాయన్నారు. తమిళనాడు రాష్ట్రం సత్వరమే ఈ కేసులను చట్టబద్దంగా పరిష్కారం చేస్తున్నదని గుర్తుచేశారు.

Spread the love