– అనేక పల్లెలకు రోడ్లు కరువు వాగులు వంకలు దాటి గూటికి..
– ప్రాణాలు పణంగా పెట్టి ప్రయాణం
– అత్యవసర పరిస్థితిలో ఆస్పత్రులకూ వెళ్లలేని స్థితి
– సమయానికి చేరక ప్రాణం కోల్పోతున్న గిరిజనం
– ఏండ్లు గడుస్తున్నా ఏజెన్సీలో కనిపించని పురోగతి
ఏజెన్సీ గ్రామాలకు రోడ్డు సౌకర్యం కల్పించాలి
అనేక ఆదివాసీ గిరిజన గ్రామాలకు సరైన రోడ్డు సదుపాయం లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. వర్షాకాలంలో ఆస్పత్రికి వెళ్లాలంటే తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఐటీడీఏకు ప్రభుత్వం నుంచి రూ.కోట్లాది నిధులు బడ్జెట్ వస్తున్నా మారుమూల పల్లెలకు సదుపాయాలు కల్పించడం లేదు. ఎలాంటి అభివృద్ధి ఫలాలు ఆదివాసులకు అందడం లేదు. పాలకులు, అధికారులు దృష్టిసారించి దారి లేని పల్లెలకు రోడ్డు సౌకర్యం కల్పించాలి.
పూసం సచిన్, టీఏజీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
నవతెలంగాణ-
ఆదిలాబాద్ ప్రాంతీయ ప్రతినిధి
గాదిగూడ మండలంలోని కొత్తపెల్లి నుంచి మారేగావ్, కునికాసా, కుండి, పిప్రి తదితర గ్రామాలకు వెళ్లేందుకు రోడ్డు సౌకర్యం లేదు. ప్రతి ఏటా వర్షాకాలంలో వాగులు దాటేందుకు జనం ఇబ్బందులు పడుతున్నారు. సమయానికి ఆస్పత్రులకు చేరుకోలేక పలువురు గర్భిణులు మృతిచెందిన సంఘటనలున్నాయి.
ఉట్నూర్ మండలం బీర్సాయిపేట నుంచి అల్లంపల్లి గ్రామాల మధ్యలో అటవీ ప్రాంతంలో ధర్మాజీపేటకు వెళ్లే దారి ఇది. దట్టమైన అడవి గుండా వెళ్లే ఈ మార్గం సక్రమంగా లేకపోవడంతో అటువైపు గ్రామాల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వర్షాకాలంలో ఈ మట్టి రోడ్డు బురదమయంగా కావడంతో బయటి ప్రాంతాలకు వెళ్లలేని పరిస్థితి ఉంటుంది.
నేరడిగొండ మండలానికి 20కి.మీ దూరంలో ఉన్న పీచర వరకు సరైన దారి లేదు. ఈ దారి మధ్యలో సుమారు 8గ్రామాల వరకు ఉంటాయి. మొరం రోడ్డు మాత్రమే ఉండటం.. దట్టమైన అడవి గుండా ప్రయాణం చేయాల్సి రావడంతో అటు వైపున వెళ్లేందుకు అవస్థలు పడుతున్నారు. వర్షాకాలంలో పలుచోట్ల మొరం రోడ్డు తెగిపోవడంతో రాకపోకలు నిలిపోతాయి. ప్రతి ఏటా వర్షాకాలంలో వివిధ గ్రామాల ప్రజలు దారి లేక ఇబ్బందులు పడుతున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అనేక పల్లెలు ఇప్పటికీ కనీస రోడ్డు సౌకర్యం లేక ఇబ్బందులు పడుతున్నా పాలకులు, అధికారులు పట్టించుకోవడం లేదు.
దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 75ఏండ్లు గడిచినా ఇప్పటికీ మారుమూల ప్రజలు కనీస సౌకర్యాలకు నోచుకోవడం లేదు. అడవుల జిల్లాగా పేరుగాంచిన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పరిస్థితి మరింత దయనీయంగా ఉంది. ఇప్పటికీ అనేక గ్రామాలకు సులభతర మార్గాలు లేవు. ఒక ఊరి నుంచి మరో పల్లెకు వెళ్లాలంటే కాలినడకనే దిక్కు. మట్టి రోడ్లు, రాళ్లరప్పల మధ్య కొన్ని కిలోమీటర్ల దూరం వెళితే కానీ వాహన సౌకర్యం లభించని పరిస్థితి. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత కొన్ని పల్లెలకు రోడ్లువేసి దారి సౌకర్యం కల్పించినప్పటికీ ఇంకా అనేక పల్లెలు దారి సౌకర్యం కోసం ఎదురుచూస్తున్నాయి. సంక్షేమం మాట చెబుతున్న పాలకులు మౌలిక వసతులపై మాత్రం దృష్టిసారించడం లేదనే విమర్శలున్నాయి.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో గతంలో 866గ్రామ పంచాయతీలు ఉండగా రాష్ట్ర ఆవిర్భావ అనంతరం పంచాయతీల సంఖ్య గణనీయంగా పెరిగింది. ప్రస్తుతం 2వేల గ్రామాలకు పైగా ఉండగా ఇందులో అధికంగా ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నాయి. ఇప్పటికీ అనేక పల్లెలు అటవీ ప్రాంతంలో ఉండటంతో వాటికి కనీస రోడ్డు సౌకర్యం లేదు. అనేక గ్రామాలు పంచాయతీలుగా రూపాంతరం చెందినా దారి సౌకర్యాలు మాత్రం మెరుగుపడటం లేదు. ఇప్పటికీ ఆ గ్రామాల ప్రజలు మండల కేంద్రాలు, పట్టణ ప్రాంతాలకు నిత్యావసర సరకుల కోసం వెళ్లాలంటే కాలిబాటనే అనుసరిస్తున్నారు. రాళ్లురప్పలు దాటుతూ..కొండలు ఎక్కి..దిగుతూ గమ్య స్థానాలకు చేరుకుంటున్నారు. ఆయా గ్రామాలకు రోడ్డు లేకపోవడంతో వాహనాలు వెళ్లలేని పరిస్థితి ఉండటం కారణంగా కాలిబాటతోనే ఆయా ప్రాంతాలకు వెళ్తున్నారు. ఇటీవల ప్రభుత్వం ఏజెన్సీ ప్రాంతంలో రోడ్ల నిర్మాణానికి రూ.394కోట్లు మంజూరు చేస్తామని ప్రకటన చేసింది. కానీ ఇందులో ఎలాంటి పురోగతీ కనిపించడం లేదు.
వర్షాకాలంలో చాలా దుర్బరం..!
వర్షాకాలం వచ్చిదంటే ఏజెన్సీ ప్రాంతవాసుల్లో భయం మొదలవుతుంది. ఆయా గ్రామాలకు వెళ్లాలంటే కనీసం రోడ్డు సౌకర్యం లేకపోవడం..మధ్యలో ఉధృతంగా ప్రవహిస్తున్న వాగులు, వంకలు దాటడం వారికి కత్తిమీది సాములా మారుతుంది. ప్రతి ఏటా వాగుల్లో కొట్టుకుపోయి మృతి చెందుతున్న ఘటనలు ఉన్నాయి. ముఖ్యంగా మట్టి రోడ్లు, రాళ్లురప్పలు ఉండటంతో అంబులెన్సులు కూడా చాలా గ్రామాలకు వెళ్లలేని పరిస్థితి. దీంతో రోడ్డు సౌకర్యం ఉన్న ప్రాంతాల వరకు వచ్చి ఆగిపోతుంటాయి. ఈ క్రమంలో గర్భిణులు, అత్యవసర చికిత్స కోసం ఆస్పత్రులకు వెళ్లేవారికి అవస్థలు తప్పడం లేదు. సరైన సమయానికి వైద్యం అందక పలువురు ప్రాణం కోల్పోయిన సందర్భాలున్నాయి. వైద్య బృందాలు సైతం అక్కడికి వెళ్లాలంటే ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వాగులు పొంగిపొర్లి ప్రవహిస్తున్న సమయంలో గర్భిణులను మంచంపై మోసుకొస్తూ వాగులు దాటించాల్సి ఉంటుంది. వరదలు వస్తే అనేక గ్రామాలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోవడం ఇక్కడ సాధారణం.