ఒకప్పటి భరతఖండంలో షోడస మహా జనపదాలు ఉండేవి. అంటే పదహారు రాజ్యాలు ఉండేవి. జనపదం అంటే రాజ్యం. అంగరాజ్యం, కోసల రాజ్యం, మల్ల రాజ్యం, లిచవి రాజ్యం (వజ్జి) మొదలైనవి. వీటిలో వాయువ్య భరత ఖండాన్ని పర్షియన్లు జయించారు. సింధూ ప్రాంతంలోని కాంభోజ, గాంధార రాజ్యాలను కూడా జయించారు. ఈ రెండూ ప్రస్థుతం పాకిస్థాన్‌లో భాగమైపొయ్యాయి. అయితే అప్పటి ఆ పర్షియన్లు పాలించింది సాధారణ శకానికి ముందు 600-334 BCE మధ్య కాలం. వీరికి ‘స’ పలకనందు వల్ల, ‘స’ పలకాల్సి వచ్చినప్పుడు ‘హ’పలికేవారు. అందుకే సింధూను హిందూ అన్నారు. సింధూ ప్రాంతాన్ని హిందూ దేశమన్నారు. మనోభావాలు దెబ్బతీసుకోకుండా ఇక్కడ, అందరూ ఒక విషయం తెలుసుకోవాలి. పార్శీ, ఉరుదూ, అరబిక్ డిక్షనరీల ప్రకారం – ఆ భాషలలో హిందూ అంటే దొంగ / బానిస / నల్లనివాడు వంటి అర్థాలు రాసిపెట్టుకున్నారు. ఏమైనా హిందూ అనేది ఒక మతానికి సంబంధించిన పదమే కాదు – అది ఒక ప్రాంతానికి సంబంధించిన పదం. ముందుగా ఆ విషయం గుర్తుంచుకోవాలి! ఇక ‘హిందుత్వం’ అనేది కూడా బుద్ధుని తర్వాత కాలంలో క్రమంగా రూపుదిద్దుకున్నది. అందువల్ల బుద్ధుడు హిందువు అని చెప్పుకోవడం పచ్చి అబద్దం అవుతుంది. ఒకవేళ ఎవరైనా అలా అనుకుంటే, వారికి చారిత్రక అవగాహన లేదనుకోవాలి. లేదా తెలిసి ఉన్నా బుద్ధుణ్ణి తమలో కలుపుకోవడానికి కుట్ర పూరితంగా అలా అంటున్నారేమోనని… అనుకోవాల్సి వస్తుంది.
భారతదేశాన్ని మొదటగా జయించి ఆక్రమించిన విదేశీ రాజులు పర్షియన్లు, ఇరానియన్లు. సైరస్ మరయూ అతని మనుమడు డేవియన్ – ఇది సాధారణ శకానికి ముందు 600 BCE! ఇక బుద్ధుడు పుట్టేనాటికి – అంటే సాధారణ శకానికి ముందు 563BCE నాటికి మన దేశంలోనే కాదు, చైనా ఈజిప్టు, మొసపొటేమియాలలో కూడా ఎక్కడా ‘హిందూ మతం’ అనేది లేదు. వేదాలలో, స్మృతులలో, ఇతిహాసాలలో, పురాణాలలో ఎక్కడా ‘హిందూ’ అనే మాటే / శబ్దమే వినిపించదు. బుద్ధుడు క్షత్రియుడా కాదా అన్నది స్పష్టంగా తెలియదు. అయితే శాక్య తెగకు చెందిన వాడన్నది స్పష్టం. గతంలో తెగలకు, తండాలకు, గణాలకూ అలాగే కొన్ని రాజ్యాలకు రాజులైనంత మాత్రాన, వారు క్షత్రియులు కావల్సిన అవసరం లేదు. తర్వాత కాలంలోని అశోకుడు ఆ తర్వాతి కాలంలో శివాజీ వంటివారు ఎంతోమంది రాజ్యాలు ఏలారే గాని, వారంతా క్షత్రియులు కారన్నది మనకు తెలుసు.
గౌతముడి తండ్రి శుద్దోధనుడు. ఈయన శాక్య తెగకు చెందినవాడు. ఈ తెగ రోహిణీ నది ఒడ్డున ఉండేది. రోహిణీ నదికి ఆవలివైపు ‘కొలియ’ తెగ ఉండేది. ఇంతకు ముందు చెప్పినట్టు షోడస మహా జనపదాలైన పదహారు రాజ్యాలు మాత్రమే కాకుండా, అప్పట్లో ఇంకా చిన్న చిన్న జనపదాలు కూడా ఉండేవి. వీటిని గణాలు అని అనేవారు. ఒక్కో గణానికి ఒక్కో గణనాయకుడు (గణపతి) ఉండేవాడు. గణం అంటే రాజ్యం. గణనాయకుడు అంటే రాజు. ఆ కాలంలో శాక్య, కొలియ తెగలుండేవి. వారి రాజ్యాలు వేరు వేరుగా ఉండేవి. రోహిణీ నదీ జలాల విషయమై శాక్యులకు, కొలియలకూ మధ్య జరగబోయే యుద్ధాన్ని వ్యతిరేకించినందుకు ‘సంఘ’ నిర్ణయాన్ని అనుసరించి, గౌతముడు దేశాన్ని వదిలి వెళ్ళాల్సి వచ్చింది. బుద్ధుడు దేశాన్ని / రాజ్యాన్ని వదిలిపోవడానికి కారణం ఆనాటి తెగల మధ్య ఘర్షణేనని కోశాంబి, డా.బిఆర్. అంబేద్కర్ వంటి ప్రముఖులు, విజ్ఞులు అభిప్రాయపడ్డారు.
సాధారణ శకానికి ముందు బుద్ధుడు పుట్టేనాటికి (600-300BCE) మన భూభాగంలో ఉన్న మతాలు రెండు రకాలు. 1. వైదిక మతం 2. అవైదిక మతం. వైదిక మతాన్ని వేద సంప్రదాయం ORTHODOX అని అన్నారు. ఆ వైదిక మతాలన్నీ సాంప్రదాయేతర మతాలు. ఇవి సుమారుగా అరవై రెండు ఉండేవి. ఇవన్నీ బ్రాహ్మణ వ్యవస్థకి వ్యతిరేకంగా ఉండేవి. ఉదాహరణకు అజివిక, చార్వాక, లోకాయత వంటివి. ఈ అవైదిక మతస్థుల్ని ”శ్రమణులు” అన్నారు. ఇక వైదిక మతం బ్రాహ్మణీయ భావజాలంతో ఉండి, వర్ణ వ్యవస్థను స్థిరపరిచింది. రుగ్వేదంలోని పురుషసూక్తంలో వర్ణవ్యవస్థ గురించిన ప్రస్థావన మొదటిసారి కనిపిస్తుంది. కానీ, కులవ్యవస్థ గురించి, పంచముల గురించి ఇందులో వివరాలు కనిపించవు. అయితే అవి తర్వాతి కాలంలో వచ్చిన మనుస్మృతి. నారద స్మృతులలో వివరంగా ఉన్నాయి.
వైదిక, అవైదిక మతాలు ఇలా వ్యాపించి ఉన్న దశలో శ్రమణుడైన బుద్ధుడు పుట్టి పెరిగాడు. వైదిక మతంలోని అసమానతలను నిరసించాడు. పశుబలిని, జీవ హింసను తీవ్రంగా దుయ్యబట్టాడు. ఇవన్నీ వైదిక-వేద-సంప్రదాయ -బ్రాహ్మణీయ మతానికి వ్యతిరేకం! బుద్ధుడు ప్రారంభించిన ఈ పనులే ఉద్యమ రూపం దాల్చి ‘బౌద్ధం’ అయ్యింది. అంతేగాని, బుద్ధుడు ఏ మతాన్ని స్థాపించలేదు. ఆయన శ్రమణుడు, నాస్తికుడు గనక, ప్రతి విషయాన్నీ తనదైన ఆలోచనా విధానంతో విశ్లేషించి, తన అనుచరులకు బోధించేవాడు. అంతే – తనని తాను దేవదూతగా గానీ, దేవుడిగా గానీ ప్రకటించుకోలేదు. సమ సమాజమే లక్ష్యంగా, ఒక ఉద్యమం చేపట్టిన సంఘ సంస్కర్త మాత్రమే! బుద్ధుడి మార్గాన్ని అనుసరించిన ఆయన అనుయాయులు బౌద్ధులుగా గుర్తింపబడ్డారు.
బుద్ధునికి ఇద్దరు గురువులున్నారు. మొదటివారు రుద్రక. రెండవవారు అలారక లామా. వీరి వద్ద రెండేళ్ళపాటు బుద్ధుడు వేద విద్యను అభ్యసించాడు. ఆలోచించి, అందులో ఏమీలేదనీ, అవి ఉట్టి మూర్ఖపు రాతలనీ నిర్ణయించుకున్నాడు. వాటిని అక్కడే వదిలేసి, స్వయంగా తన అన్వేషణను తీవ్రతరం చేశాడు. ఆ క్రమంలోనే ‘తధాగతు’డయ్యాడు… తధాగతుడంటే ఉన్నది ఉన్నట్టుగా స్వీకరించి, నడుచుకునేవాడు. ఉన్న వాస్తవాల ప్రకారం అంటే నిజాల ప్రకారం నడుచుకునేవాడు. విషయం తెలుసుకోకుండానే బుద్ధుడు వైదిక ధర్మం పట్ల విముఖుడు కాలేదు. క్షుణ్ణంగా తెలుసుకున్న తర్వాతే – అందులో ఏమీలేదన్న నిర్ధారణకు వచ్చాడు. అందులోని అమానవీయమైన అంశాలకు చలించిపోయి తిరస్కరించాడు. ఈ లోకాన్ని, లోకరీతిని అందులోని బాధల్ని, వేదనల్ని అవగాహన చేసుకుని ఆలోచించి, తనలో తను మధనపడి, తపించి, తపించి తెలుసుకున్న విషయాలు తన అనుచరులకు బోధించాడు. బయట ప్రపంచంలో ఉన్న విషయాలకు బుద్ధుడు చెప్పే విషయాలు భిన్నంగా ఉంటూనే, నిజానికి దగ్గరగా ఉన్నందువల్ల ఆయన్ని ‘జ్ఞానోదయమైన వాడిగా’ ఈ ప్రపంచం గుర్తించింది. అందులో మహిమలూ, మాయలూ ఏవీ లేవు.
పరిసరాల్ని, ప్రకృతిని, ఆకాశాన్ని అరణ్యంలోని చిన్నా పెద్దా జీవుల్నీ – వాటి ప్రవృత్తిని నిశితంగా పరిశీలించడం – సమాజంలో అప్పటికి ఉన్న రీతి రివాజును అర్థం చేసుకుని, ఏది మంచి ఏది చెడ్డ అని అవలోకించుకుని తనలోకి తాను ప్రయాణించి, ప్రతి విషయాన్ని విశ్లేషించుకుని, చివరగా ఆయన తీసుకున్న నిర్ణయమే – జ్ఞానోదయం! జ్ఞానోదయమంటే ఆలోచనల పరిపక్వత. నిగూఢమైన అంశాల్ని సరళంగా అర్థం చేసుకోగల నిపుణత. సాధించుకున్న జ్ఞానాన్ని మళ్ళీ అంతే సులభంగా ప్రజల భాషలో ప్రజలకు అందించాలన్న తహతహతో కూడిన నైపుణ్యం. ఎప్పటికప్పుడు కొత్త ఉత్సాహంతో, కొత్త ఉత్తేజంతో, నిబద్దతతో దేశమంతా తిరుగుతూ బోధన చేయాలన్న సంకల్పం. ఆయనలోని ఇన్ని లక్షణాల వల్ల ఈ దేశం, ప్రపంచానికి కొత్త విలువలు చూపగలిగింది. కొత్త జ్ఞానం అందించగలిగింది. బౌద్ధం – శాంతి, అహింస, సత్యాన్వేషణల మార్గాన్ని బోధించగలిగింది. అప్పటికి ఇవన్నీ ప్రపంచానికి కొత్తవి. బుద్ధుడు తన ఆలోచనల తీవ్రతలోంచి సాధించిన జ్ఞానం – సార్థకమైంది. ప్రపంచ జనావళి ఆలోచనా స్థాయిని అనూహ్యంగా పెంచగలిగింది.
బుద్ధుని మరణానంతరం బౌద్ధంలో మార్పులు, చేర్పులూ జరిగాయి. బౌద్ధ భిక్కుల్లో వచ్చిన బేదాభిప్రాయాల వల్ల కొంత – వైదిక మత ప్రభావం వల్ల కొంత – బౌద్ధంలో మార్పులు జరిగాయి. హీనయాన, మహాయాన, వజ్రయానాలుగా విభజన జరిగింది. బుద్ధుడి కాలంలో ఆయన తన బోధనలు ఆనాటి ప్రజల భాష అయిన పాలి భాషలో చేసేవాడు. బుద్ధుడి అనంతరం పాలి, ప్రాకృత భాషలతో పాటు వైదిక మత ప్రభావం వల్ల బౌద్ధ ప్రచారంలో సంస్కృతం కూడా చేరింది. విగ్రహారాధన మొదలైంది. గుళ్ళూ, గోపురాలూ వెలిశాయి. బుద్ధుడి తర్వాతే బౌద్ధం – ఒక మతంగా మారింది. హీనయాన, మహాయాన, వజ్రయానాలు వేటికవి బలం పుంజుకుని విస్తరించాయి. తను ఒక దైవ స్వరూపుడవుతాడని గానీ, తన ఉపదేశాలన్నీ బౌద్ధమత సిద్ధాంతాలవుతాయని గానీ బుద్దుడు తన జీవిత కాలంలో ఊహించలేదు. తన బోధనల్ని సంస్కృతంలోకి అనువదిస్తామన్న పండితుల్ని బుద్ధుడు వారించాడు. అలాంటి పని చేయకండని తీవ్రంగా హెచ్చరించాడు కూడా! అయితే ఆయన మరణం తర్వాత, జరగాల్సినవి జరిగిపోయాయి.
ఒక రకంగా భారతదేశంలో విగ్రహారాధన, ఆలయాల నిర్మాణం మొదటిసారి బౌద్ధంతోనే ప్రారంభ మయ్యాయి. అదెలా జరిగిందంటే, బౌద్ధభిక్షువులు బుద్ధుని అస్థికలపై చైత్యాలు నిర్మించుకున్నారు. ఆ తర్వాత ఆ చైత్యాలను పవిత్ర ఆలయాలుగా భావించి – బుద్ధుణ్ణి దేవుడిగా పూజించడం మొదలు పెట్టారు. క్రమంగా లెక్కలేనన్ని బుద్ధ విగ్రహాలు అన్ని చోట్లా వ్యాపించాయి. ఆ తర్వాత, అశోకుడి కాలంలో బహిరంగ స్థలాలలో బౌద్ధ స్థూపాలు వెలిశాయి. వాటిమీద బుద్ధుడి జీవిత చరిత్ర, బౌద్ధజాతక కధల చిత్రాలు చెక్కుకున్నారు. ఆ రకంగా మన దేశంలో మొదటి ఆరామాలైనా, స్థూపాలైనా, శిల్పాలైనా అన్నీ బౌద్ధులు చెక్కినవే! బుద్ధుడి గోర్లు నిక్షిప్తం చేసిన చోటు – ‘నక్లవ్’ పట్టణం కాలక్రమంలో లక్నోగా మారింది. గుజరాత్ ప్రాంతానికి ఒకప్పటి పేరు బుద్దదేశ్. ముంబాయి ఒకప్పుడు బౌద్ధక్షేత్రమనడానికి చాలా ఆధారాలున్నాయి. పురాతన హిందూ దేవాలయాలు, హిందూ దేవతా విగ్రహాలు ఏవైనా – అవన్నీ నిస్సందేహంగా మార్పులు చేసుకున్న బౌద్ధారామాలు, బుద్ధుడి విగ్రహాలు మాత్రమేనన్నది – ప్రసిద్ధ చరిత్రకారులంతా ముక్తకంఠంతో చెప్పిన విషయం! ఇకపోతే.. బుద్ధుడు హిందువనడానికి ఒక్క ఆధారం కూడా లేదు. ఆయన హిందువే కానప్పుడు ఆయన్ని హిందూమతంలో చేర్చుకుని, దశావతారాల్లో భాగం చేసుకోవడం జనాన్ని మోసం చేయడం కాదా? సత్యాన్ని దాచిపెట్టి, వచ్చే తరాల వారి కళ్ళుగప్పడం కాదా? ఏమైనా, బుద్ధుడి విలువను, ప్రత్యేకతను ఆయనకు అలా ఉంచి, మహనీయుడిగా, పరిపూర్ణుడిగా గౌరవించుకోవడం, నమస్కరించుకోవడం విజ్ఞత అనిపించు కుంటుంది!
– వ్యాసకర్త: సుప్రసిద్ధ సాహితీవేత్త, జీవశాస్త్రవేత్త.
డాక్టర్ దేవరాజు మహారాజు