– సీఎం హామీ ప్రకారం కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలి
– అమలుకు నోచుకోని పీఆర్సీ కమిటీ సిఫారసులు
– కేర్‌టేకర్, నైట్‌డ్యూటీలతో మానసిక ఒత్తిడి
– కేజీబీవీ, యూఆర్ఎస్ ఉద్యోగుల ఆందోళన
గురుకులాలతో సమానంగా ఫలితాలు సాధిస్తున్నా గుర్తింపు లేదు
రాష్ట్రంలో రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయాలు (కేజీబీవీ), అర్బన్ రెసిడెన్షియల్ స్కూళ్లు (యూఆర్ఎస్), సమగ్ర శిక్షలోని ఉద్యోగులు పనిచేస్తున్నారు. అయినా వారికి ఉద్యోగ భద్రత లేదు, కనీస వేతనం అమలు కావడం లేదు. సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం రెగ్యులర్ ఎంప్లాయీస్‌తో సమానంగా కేజీబీవీ, యూఆర్ఎస్ ఉద్యోగులందరికీ సమాన పనికి సమాన వేతనమివ్వాలి. కానీ రాష్ట్ర ప్రభుత్వం వారికి కనీస వేతనాన్నే అమలు చేయడం లేదు. 20 ఏండ్లుగా పనిచేస్తున్నా, గురుకులాలతో సమానంగా ఉత్తమ ఫలితాలను సాధిస్తున్నా శ్రమకు తగిన వేతనం రావడం లేదు. సరైన గుర్తింపు దక్కడం లేదు. మరోవైపు వేతన సవరణ కమిషన్ (పీఆర్సీ) కమిటీ సిఫారసులూ అమలుకు నోచుకోవడం లేదు. దీంతో వారు మనోవేదనకు గురవుతున్నారు. హాస్టల్ నిర్వహణ కోసం కేర్‌టేకర్, సీఆర్టీలకు నైట్‌డ్యూటీలు వేయడంతో ఆందోళన చెందుతున్నారు.
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
సమాన పనికి సమాన వేతనమివ్వాలనీ, ఎస్వోను ప్రిన్సిపాల్‌గా, పీజీసీఆర్టీలను జేఎల్స్‌గా, సీఆర్టీలను స్కూల్ అసిస్టెంట్లుగా, పీఈటీలను పీడీలుగా గుర్తించి ఆ పోస్టు బేసిక్‌పేను చెల్లించాలనీ, పీఆర్సీ సిఫారసు ప్రకారం కేజీబీవీ కాంట్రాక్టు ఉద్యోగులకు ఏటా రూ.వెయ్యి ఇంక్రిమెంట్ ఇవ్వాలనీ, రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా కేజీబీవీ, యూఆర్ఎస్ కాంట్రాక్టు ఉద్యోగులకు సీఎల్ వినియోగానికి అర్హత కల్పించాలనీ, నెలకు రెండు సీఎల్స్ అనే పరిమితిని ఎత్తేయాలనీ, గురుకులాల పద్ధతిలో నిర్వహిస్తున్నందున వారికి వసతి కల్పించాలనీ, ముఖ్యమంత్రి ఇచ్చిన హామీకి అనుగుణంగా కేజీబీవీ కాంట్రాక్టు ఉద్యోగులందర్నీ రెగ్యులరైజ్ చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఆయా డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (టీఎస్‌యూటీఎఫ్) ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని చలో ఎస్పీడీ కార్యాలయ కార్యక్రమాన్ని నిర్వహించారు. వేలాది మంది ఉద్యోగులు జోరువానలోనూ పాఠశాల విద్యాశాఖ సంచాలకుల కార్యాలయాన్ని దిగ్బంధించారు.
కనీస వేతనం ఇచ్చేదాకా కదిలేది లేదంటూ ఉదయం 11 నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు అక్కడే బైఠాయించారు. అనంతరం 29 సమస్యలను పరిష్కరించాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణను ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి, టీఎస్ యూటీఎఫ్ అధ్యక్షులు కె జంగయ్య, ఉపాధ్యక్షులు సిహెచ్ దుర్గాభవాని, రాష్ట్ర కార్యదర్శి వి శాంతికుమారి కలిసి వినతి పత్రం సమర్పించారు. అయితే వీలైనంత త్వరగా చర్చలకు ఆహ్వానిస్తామంటూ అధికారులు సానుకూలంగా స్పందిం చారు. రెండు వారాల్లో సమస్యలను పరిష్కరించక పోతే భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తామని హెచ్చరించారు.
న్యాయమైన సమస్యలను సత్వరమే పరిష్కరించాలి : కె జంగయ్య, టీఎస్‌యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు
కేజీబీవీ, యూఆర్ఎస్, సమగ్ర శిక్షలో పనిచేస్తున్న ఉద్యోగుల న్యాయమైన సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం సత్వరమే పరిష్కరించాలి. ఆరోగ్యకార్డులను ఇచ్చి నగదు రహిత వైద్యం అందించాలి. అర్ధాంతరంగా మరణించిన కేజీబీవీ, యూఆర్ఎస్ ఉద్యోగుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా చెల్లించాలి. పార్ట్‌టైం కంప్యూటర్ ఇన్స్ట్రక్టర్లు, ఒకేషనల్ ట్రైనర్లకు పూర్తికాలం పనిచేస్తున్నందున సీఆర్టీలుగా మార్చి బేసిక్ పే ఇవ్వాలి.
మంత్రులు, అధికారులకు విన్నవించినా ఫలితం లేదు : చావ రవి, టీఎస్‌యూటీఎఫ్ ప్రధాన కార్యదర్శి
సమస్యలను పరిష్కరించాలని కోరుతూ మంత్రులు, అధికారులకు పలుమార్లు వినతిపత్రాలు ఇచ్చినా, ఆందోళనలు చేసినా ఫలితం లేదు. అందుకే డీఎస్ఈని ముట్టడించాల్సిన పరిస్థితి అనివార్యమైంది. మోడల్ స్కూల్ హాస్టల్ నిర్వహణ అదనపు బాధ్యతల నుంచి ఎస్ఓలను తప్పించాలి. విద్యార్థుల పర్ క్యాపిటాను గురుకులాలతో సమానంగా పెంచాలి. బాలికలకు కాస్మోటిక్ చార్జీలు, శాని టరీ కిట్లను అందించాలి. జూనియర్ కళాశాలలకు అదనపు సిబ్బందిని, అదనపు నిధులను కేటాయించాలి. యూఆర్ ఎస్‌లలో తొమ్మిది, పది తరగతులను ప్రారంభించాలి. వాటికి స్వంత భవనాలు నిర్మించాలి. యూఆర్‌ఎస్‌లలోని మహిళా ఉద్యోగులకూ 180 రోజుల ప్రసూతి సెలవు లివ్వాలి. కేజీబీవీ, యూఆర్ఎస్ ఉద్యోగుల బదిలీలు నిర్వహించాలి.
ఉద్యోగ భద్రత కల్పించాలి
కేజీబీవీ, యూఆర్ ఎస్, సమగ్ర శిక్ష ఉద్యోగు లకు కనీస వేతనమివ్వాలి. వారికి ఉద్యోగ భద్రత కల్పించాలి. వారి సర్వీసు లను రెగ్యులరైజ్ చేయాలి. శాసనమండలిలో ఈ అంశాలను పలుసార్లు ప్రస్తావించినా పరిష్కరించకపోవడం ఆందోళనకరం. రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరి విడనాడి సమస్యల పరిష్కారం కోసం తగిన చర్యలు తీసుకోవాలి.
ఎమ్మెల్సీ నర్సిరెడ్డి