– వట్టి జానయ్య కేసు విచారణలో సుప్రీం వ్యాఖ్యలు
– నాలుగు వారాల్లో అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశం
– సుప్రీంకోర్టు ముందుకు హాజరైన తెలంగాణ డీజీపీ
వతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
క్రిమినల్ కేసుల్లో తెలంగాణ నుంచి సరైన సహకారం అందడం లేదని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. వట్టి జానయ్య దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణలో భాగంగా ఈ మేరకు అభిప్రాయపడింది. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో తనపై ఒకే సారి తెలంగాణ పోలీసులు పెద్ద సంఖ్యలో కేసులు నమోదు చేయడాన్ని సవాల్ చేస్తూ సూర్యాపేటకు చెందిన బీఆర్‌ఎస్ మాజీ నేత వట్టి జానయ్య గతేడాది సెప్టెంబర్ 20న సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఇందుకు సంబంధించి ఆరు స్పెషల్ లీవ్ పిటిషన్లు(ఎస్‌ఎల్పీ) దాఖలు చేశారు. తెలంగాణ ప్రభుత్వం (గత బీఆర్‌ఎస్ సర్కార్) తనపై ఒకేసారి అక్రమాస్తులు, నేరపూరిత బెదిరింపులు, దొంగతనం, దోపిడీ కేసులకు సంబంధించి పదుల సంఖ్యలో కేసులు నమోదు చేసిందని పేర్కొన్నారు. గత విచారణ సందర్భంగా ప్రాసిక్యూషన్, ప్రభుత్వ న్యాయవాది మధ్య సంబంధం లేనట్టు స్పష్టంగా కనిపిస్తుందని వ్యాఖ్యనించింది. తాము లేవనెత్తిన అంశాలకు రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాది సమాధానం చెప్పలేకపోతున్నందున కోర్టు ముందు హాజరుకావాలని డీజీపీకి నోటీసులు ఇచ్చింది.
దీంతో శుక్రవారం విచారణ సందర్బంగా రాష్ట్ర డీజీపీ వర్చువల్ మోడ్‌లో కోర్టు ముందు హాజరయ్యారు. ‘క్రిమినల్ కేసులో మీ రాష్ట్రం నుంచి సరైన సహాయం అందడం లేదు. ఇది ప్రతిసారి కనిపిస్తోంది. జానయ్య కేసుల్లో ప్రభుత్వ తరపు న్యాయవాది వాదనల్లో అసమానతలకు ఎవరు బాధ్యులు. తప్పు ఎవరిది? మీ దర్యాప్తు చేస్తోన్న అధికారులదా? రాష్ట్ర ప్రభుత్వానిదా? వీరిపై ఎలాంటి చర్యలు తీసుకున్నారు’ అని డీజీపీని ప్రశ్నించింది. ఇందుకు డీజీపీ జితేందర్ బదులిస్తూ మరోసారి ఇలాంటి పొరపాట్లు జరగనీవబోమని కోర్టును అభ్యర్థించారు.
‘ఇలాంటి వాటికి మళ్లీ అవకాశం ఇవ్వం. పొరపాట్లు జరగకుండా చూస్తాం. సంబంధిత అధికారులపై తప్పకుండా చర్యలు తీసుకుంటాం. చర్యలను జవాబుదారీగా తీసుకుంటాం’ అని తెలిపారు. ప్రస్తుత జానయ్య కేసులో తీసుకున్న చర్యలపై సరైన వివరణ లేదని కోర్టు అసంతృప్తిని వ్యక్తం చేసింది. ఈ అసమానతలపై నాలుగు వారాల్లో అఫిడవిట్ దాఖలు చేయాలని ధర్మాసనం స్పష్టం చేసింది. తదుపరి విచారణను వచ్చే నెలకు వాయిదా వేసింది.