ఓపీఎస్‌ పునరుద్ధరణకు ఎలాంటి ప్రతిపాదన లేదు

– కేంద్ర మంత్రి పంకజ్‌ చౌదరి
– 92,365 కేంద్రీయ విద్యాలయాలు, నవోదయాల్లో టీచింగ్‌, నాన్‌ టీచింగ్‌ పోస్టులు ఖాళీలు
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
ఉద్యోగులు, ఉపాధ్యాయులకు సంబంధించి పాత పెన్షన్‌ స్కీమ్‌ (ఓపీఎస్‌) పునరుద్ధరణ కోసం కేంద్ర ప్రభుత్వ పరిశీలనలో ఎలాంటి ప్రతిపాదన లేదని కేంద్ర ఆర్థిక సహాయ మంత్రి పంకజ్‌ చౌదరి తెలిపారు. ఒక ప్రశ్నగా ఆయన లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు. దేశంలోని కేంద్రీయ విద్యాలయాలు, నవోదయ విద్యాలయాల్లో 92,365 టీచింగ్‌, నాన్‌ టీచింగ్‌ పోస్టులు ఖాళీగా ఉన్నాయని కేంద్ర విద్యా శాఖ సహాయ మంత్రి జయంత్‌ చౌదరి లోక్‌సభలో ఓ ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. 2024 మార్చి 31 నాటికి కేంద్రీయ విద్యాలయాల్లో 6,653, నవోదయ విద్యాలయల్లో 4,675 టీచింగ్‌ పోస్టులు ఖాళీగా ఉన్నాయని తెలిపారు. 2024 మార్చి 31 నాటికి కేంద్రీయ విద్యాలయాల్లో 56,783, నవోదయ విద్యాలయల్లో 24,254 నాన్‌ టీచింగ్‌ పోస్టులు ఖాళీగా ఉన్నాయని అన్నారు.
సెంట్రల్‌ యూనివర్శిటీల్లో 2,648 టీచింగ్‌, 4,340 నాన్‌ టీచింగ్‌ పోస్టులు ఖాళీ
సెంట్రల్‌ యూనివర్శిటీల్లో 2,648 టీచింగ్‌, 4,340 నాన్‌ టీచింగ్‌ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ మేరకు కేంద్ర విద్యాశాఖ సహాయ మంత్రి సుకాంత మజుందార్‌ లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. 2024 ఏప్రిల్‌ 1 నాటికి ఎస్‌సీ 736, ఎస్‌టి 466, ఓబీసీ 1,446 మొత్తం 2,648 రిజర్వ్‌ టీచింగ్‌ పోస్టులు ఖాళీగా ఉన్నాయని తెలిపారు. అలాగే 2024 ఏప్రిల్‌ 1 నాటికి ఎస్‌సీ 1,466, ఎస్‌టి 914, ఓబీసీ 1,960 మొత్తం 4,340 రిజర్వ్‌ నాన్‌ టీచింగ్‌ పోస్టులు ఖాళీగా ఉన్నాయని తెలిపారు.
వ్యవసాయ పరికరాలపై జీఎస్టీ తగ్గించాలనే వినతిపై నిర్ణయం తీసుకోని కౌన్సిల్‌
వ్యవసాయ పరికరాలపై జీఎస్టీ రేటు తగ్గించాలనే వినతిపై జీఎస్టీ కౌన్సిల్‌ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని కేంద్ర ఆర్థిక సహాయ మంత్రి పంకజ్‌ చౌదరి తెలిపారు. రైతులు ఉపయోగించే ట్రాక్టర్లు, యంత్రాలు, ఇతర పరికరాలపై జీఎస్టీ రేటు తగ్గించాలని వినతి అందందని లోక్‌సభలో ఒక ప్రశ్నకు ఆయన లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. అయితే జీఎస్టీ కౌన్సిల్‌ ప్రతిపాదనల మేరకే జీఎస్టీ రేటు మినహాయింపు ఉంటుందని తెలిపారు.
బీహార్‌కు ప్రత్యేక హౌదా కుదరదు
బీహార్‌కు ప్రత్యేక హౌదా ఇవ్వడం కుదరదని కేంద్ర ప్రభుత్వ తేల్చిచెప్పింది. సోమవారం లోక్‌సభలో కేంద్ర ఆర్థిక సహాయ మంత్రి పంకజ్‌ చౌదరి ఒక ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. ప్రణాళిక సహాయం కోసం ప్రత్యేక హౌదా గతంలో నేషనల్‌ డెవలప్‌మెంట్‌ కౌన్సిల్‌ (ఎన్‌డీసీ)తో కొన్ని రాష్ట్రాలకు మంజూరు చేశారని తెలిపారు. కొండలు, కష్టతరమైన భూభాగం, తక్కువ జనాభా సాంద్రత, గిరిజన జనాభాలో గణనీయమైన వాటా, పొరుగు దేశాలతో సరిహద్దు రాష్ట్రాలు, ఆర్థిక, అవస్థాపన వెనుకబాటుతనం, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ క్షీణత వంటి ఐదు అంశాలు ఆధారంగా ప్రత్యేక హౌదా ఇస్తారని తెలిపారు. రాష్ట్రాల పరిస్థితిని సమగ్రంగా పరిశీలించి ఈ నిర్ణయం తీసుకుంటారని అన్నారు. ప్రత్యేక హౌదా కోసం బీహార్‌ అభ్యర్థనను ఇంటర్‌-మినిస్టీరియల్‌ గ్రూప్‌ (ఐఏజీ) పరిగణించిందని, ఇది 2012 మార్చి 30న తన నివేదికను సమర్పించిందని తెలిపారు. బీహార్‌కు ప్రత్యేక హౌదా అంశమే లేదని అన్నారు.

Spread the love