– బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
బీఆర్‌ఎస్ నాయకులు ప్రజల కోసం, వారి తరఫున మాట్లాడితే తప్పేంటని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు. గురువారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో ఆయన మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. లగచర్ల ఘటనలో ప్రభుత్వం దారుణంగా భంగపడిందనీ, సీఎం ప్రాతినిథ్యం వహిస్తున్న నియోజకవర్గంలో జరిగిన ఘటన తో ఆయన పరువు పోయిందని చెప్పారు. లగచర్ల ఘటనలో 21 మందిని అరెస్టు చేసి ఎస్పీ కూర్చొని కొట్టించారని ఆరోపించారు. 52 మందిని అదుపులోకి తీసుకుని కాంగ్రెస్, బీజేపీకి చెందిన వారిని వదిలేశారని తెలిపారు. ప్రభుత్వం అరాచకం చేస్తుంటే ప్రొఫెసర్లు కోదండరాం, హరగోపాల్ ఎక్కడికి వెళ్లారు? పౌర హక్కుల, మానవ హక్కుల సంఘాల ఎక్కడికి పోయాయి? అని ప్రశ్నించారు.కలెక్టర్ దాడి జరగలేదని అన్నారని గుర్తు చేశారు. కలెక్టర్ జిల్లా మేజిస్ట్రేట్‌గా ఉంటారని తెలిపారు. సురేష్ బీఆర్‌ఎస్ పార్టీ నాయకుడు. ప్రజల తరపున మాట్లాడితే తప్పు ఏంటి…? మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి ప్రజల కోసం మాట్లాడితే తప్పేంటి…? అని ప్రశ్నించారు. వికారాబాద్ జిల్లా ఎస్పీ అతి చేస్తున్నారనీ, ఇలాగే చేస్తే నాలుగేండ్లలో తాము అధికారంలోకి వచ్చాక ఏపీలో ఐపీఎస్‌ల పరిస్థితి ఏమైందో అదే జరుగుతుందని హెచ్చరిం చారు. నేను పోలీసులకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదని మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి జడ్జికి లేఖ రాశారని తెలిపారు. పోలీసుల రిమాండ్ రిపోర్ట్ రేవంత్ రెడ్డి ఇచ్చిన రిపోర్ట్ అని విమర్శించారు. తీవ్రవాదులను అరెస్టు చేసినట్టు రైతులను అరెస్టు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు రేవంత్ రెడ్డి సైన్యంలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.
రైతుల కుటుంబ సభ్యులను తీసుకువెళ్లి జాతీయ మానవహక్కుల కమిషన్, జాతీయ మహిళా కమిషన్‌ను కలువనున్నట్టు తెలిపారు. ఫార్మా కంపెనీలన్నీ ఒకే దగ్గర ఉండాలని ఫార్మా సిటీ కోసం 14 వేల ఎకరాల భూములు సేకరించామని గుర్తుచేశారు. హైదరాబాద్ ఫార్మా సిటీ రద్దు అనీ, ఫోర్త్ సిటీ నిర్మిస్తామని సీఎం అంటున్నారని తెలిపారు. జీవితకాలంలో ఫోర్త్ సిటీని చూస్తామా…? అని ప్రశ్నించారు. ఫోర్త్ సిటీ దగ్గర రేవంత్ రెడ్డి భూములున్నా యని తెలిపారు. గతంలో ఫార్మా కంపెనీలు విషం అని రేవంత్ రెడ్డి, భట్టి విమర్శించారని గుర్తుచేశారు. ప్రస్తుతం తమ ప్రభుత్వం లేదనీ, సీఎం నియోజకవర్గంలో వేలు పెట్టి అధికారులను కొట్టించే శక్తి తమకు ఎక్కడుందని ప్రశ్నించారు. కొడంగల్ నియోజకవర్గంలో ఇంటెలిజెన్స్ పూర్తిగా విఫలమైందని విమర్శించారు.
ప్రభుత్వం నడపడం రేవంత్ రెడ్డికి రావడం లేదన్నారు. మూసీ పునరుజ్జీవం కోసం తాము ఎస్టీపీలు నిర్మించామని గుర్తు చేశారు. రూ.లక్షా 50 వేల కోట్లతో మూసీ పునరుజ్జీవం ఎందుకు…? అని ప్రశ్నించారు. ఎస్టీపీలు అన్ని పూర్తి చేసి కొండపోచమ్మ సాగర్ నుంచి మంచినీళ్లు తెచ్చి మూసీలో నింపాలని సూచించారు. ఢిల్లీకి డబ్బులు పంపించేందుకేనని మూసీ పునర్జీవమని ఆరోపించారు. తాను మాట్లాడితే జైల్లో పెడతానంటున్నారనీ, తాను ఫోన్ ట్యాపింగ్ చేయలేదనీ, ఫార్ములా ఈ రేస్‌లో అవినీతికి పాల్పడలేదని స్పష్టం చేశారు. సొంత నియోజకవర్గంలో ఏం జరుగుతుందో రేవంత్ రెడ్డికి తెలియదని ఎద్దేవా చేశారు. రేవంత్ రెడ్డి ఏం చేసుకుంటావో చేసుకోవాలని సవాల్ చేశారు. రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక కొడంగల్ నియోజకవర్గంలో భూముల రేట్లు పెరిగాయని తెలిపారు. రేవంత్ రెడ్డిని దింపి ఉత్తమ్ కుమార్ రెడ్డి, భట్టి, పొంగులేటి సీఎం కావాలని అనుకుంటున్నారని తెలిపారు. రేవంత్ రెడ్డి ఐదేండ్లు సీఎంగా ఉండాలన్నారు. ప్రజలు తమకు రెండు టర్మ్స్ అవకాశం ఇచ్చారని గుర్తు చేశారు. దేశంలో రెండు సార్లకంటే ఎక్కువగా సీఎం, ప్రధానమంత్రి పదవిలో ఉండకుండా చట్టం తేవాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు. తనకు అవకాశం వస్తే ఎన్నికల్లో సంస్కరణల్లో ఈ అంశాన్ని ప్రస్తావిస్తానని తెలిపారు.
న్యాయ సహాయం అందిస్తాం
లగచర్ల బాధితులకు న్యాయ సహాయం అందిస్తామనీ, రైతుల తరపున పోరాడుతామని కేటీఆర్ స్పష్టం చేశారు. గురువారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో కేటీఆర్‌ను లగచర్ల బాధితులు కలిశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ రైతులపై పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రయోగించి చిత్ర హింసలు పెట్టారని విమర్సించారు. ప్రభుత్వ దుర్మార్గాలపై పోరాటానికి ప్రజా సంఘాలు, మహిళా సంఘాలు, అన్ని పార్టీలు కలిసి రావాలని పిలుపునిచ్చారు. గర్భిణి జ్యోతికి వైద్యసాయం అందిస్తామని తెలిపారు. దాడి ఘటనను జాతీయ మానవ హక్కుల కమిషన్, రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ సుమోటాగా స్వీకరించి విచారించాలని విజ్ఞప్తి చేశారు.