– అక్టోబర్ 25-27 తేదీల్లో ఎన్‌పీఆర్‌డీ రాష్ట్ర నాలుగో మహాసభలు
– హాజరుకానున్న 350 మంది ప్రతినిధులు : ఎన్‌పీఆర్‌డీ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు కె.వెంకట్, ఎం.అడివయ్య
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
వికలాంగుల సంక్షేమం, అభివృద్ధి కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక పాలసీని తీసుకురావాలని ఎన్‌పీఆర్‌డీ రాష్ట్ర అధ్యక్షులు కె.వెంకట్, కార్యదర్శి ఎం. అడివయ్య డిమాండ్ చేశారు. హైదరాబాద్‌లో అక్టోబర్ 25,26,27 తేదీల్లో వికలాంగుల హక్కుల జాతీయ వేదిక(ఎన్‌పీఆర్‌డీ) రాష్ట్ర నాలుగో మహాసభలు నిర్వహించనున్నట్టు ప్రకటించారు. బుధవారం హైదరాబాద్‌లోని ఆ సంఘం రాష్ట్ర కార్యాలయంలో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..మహాసభలో 33జిల్లాల నుంచి 350 మంది ప్రతినిధులు హాజరవుతారని తెలిపారు. మహాసభలను పురస్కరించుకుని అక్టోబర్ 20-24 తేదీల్లో ప్రతి ఊరిలోనూ సంఘం జెండాలను ఆవిష్కరించాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా సెమినార్లు నిర్వహిస్తామని తెలిపారు. మహాసభలో వికలాంగులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. నేటికీ సమాజంలో వికలాంగుల పట్ల వివక్ష కొనసాగుతున్నదన్నారు. తమ కోసం ఉన్న చట్టాలు కూడా సక్రమంగా అమలు కావడం లేదని వాపోయారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీ ఎన్నికల్లో వికలాంగులకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేశారు. పింఛన్ పెంపు కోసం వికలాంగులు ఎదురుచూస్తున్నారన్నారు. వికలాంగుల విద్య కోసం ప్రత్యేక విద్య పాలసీ అమలు చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో ఎన్‌పీఆర్‌డీ కేంద్ర కమిటీ సభ్యులు ఆర్.వెంకటేష్, జె.రాజు, రాష్ట్ర ఆఫీస్ బేరర్లు బి.స్వామి, అరిఫా, ఉపేందర్, గణేష్, రాష్ట్ర కమిటీ సభ్యులు ఎ.లింగన్న, వి.వెంకన్న, ఎ.భుజంగరెడ్డి, ఎస్.ప్రకాష్, పి.చందు, శశికళ, నగేష్, లలిత, షాహిన్ బేగం, తదితరులు పాల్గొన్నారు.