ప్రగతి మైదానంలో జరుగుతున్న పనులపై విచారణ జరిపించాలి

– లక్షల రూపాయల ప్రజాధనం వృథా
– బీఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కామేష్‌
నవతెలంగాణ-కొత్తగూడెం
అభివృద్ధి పేరుతో కొత్తగూడెం నియోజకవర్గంలో కోట్ల రూపాయల నిధులు పక్కదారి పడుతున్నాయని, అందుకు ప్రగతి మైదానంలో జరుగుతున్న పనులే నిదర్శనమని బీఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యెర్రా కామేష్‌ ఆరోపించారు. మున్సిపల్‌ పరిధిలోని ప్రగతి మైదానంలో జరుగుతున్న పనులను మంగళవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా కామేష్‌ మాట్లాడుతూ సింథటిక్‌ ట్రాక్‌ పేరుతో గత కొన్ని నెలలుగా ఇక్కడ పనులు జరుగుతున్నాయని అన్నారు. సర్వాంగ సుందరంగా ఉన్న ప్రగతి మైదానంపై ఎమ్మెల్యే వనమాకు, మున్సిపల్‌ పాలక పక్షానికి కళ్ళు కుట్టినట్టు ఉందని ఆరోపించారు. ఉదయం, సాయంత్రం పూట వాకర్స్‌, క్రీడాకారులతో కలకలలాడే ప్రగతి మైదానం రూపురేఖలు లేకుండా పోయిందని అన్నారు. మున్సిపాలిటీకి గ్రౌండ్‌ ఉండాలని ఉద్దేశంతో ఏర్పాటు చేసిన ప్రగతి మైదానంలో అభివృద్ధి పనుల పేరిట ఎక్కడికక్కడ గుంతలు తవ్వేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రౌండ్‌ చుట్టూ నాసిరకవు మెటీరియల్‌ వాడుతూ పనులన్నీ లోపభూఇష్ఠంగా జరుగుతున్నాయని ఆరోపించారు. ప్రగతి మైదానంలో అభివృద్ధి పనుల కోసం కేటాయించిన నిధులు ఎన్ని…? కాంట్రాక్టర్‌ ఎవరు…? ఎన్ని రోజుల్లో పనులు పూర్తవుతాయని..? ప్రశ్నించారు. ఈ మొత్తం తతంగంపై కలెక్టర్‌, అధికారులు దృష్టి సారించాలని డిమాండ్‌ చేశారు. నాణ్యతకు తిలోదకాలు ఇచ్చి ఇష్టారాజ్యాంగ నిర్మాణాలు చేపడుతూ కాలయాపన చేస్తున్న సదరు కాంట్రాక్టర్‌ను తక్షణమే బ్లాక్‌ లిస్టులో పెట్టాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా సలహాదారు గంధం మల్లికార్జున్‌ రావు, పట్టణ అధ్యక్షుడు వంగా రవిశంకర్‌, సందెలా సందీప్‌, తాటిపాముల హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Spread the love