కండ్ల కలక అంటువ్యాధి పై అవగాహన కల్గి ఉండాలి..

నవతెలంగాణ- డిచ్ పల్లి.
కండ్ల కలక అంటువ్యాధి పై విద్యార్థులు, అధ్యాపకులు అవగాహన కల్గి ఉండాలని వై శంకర్ అన్నారు.మంగళవారం ఇందల్ వాయి మండల కేంద్రంలోని తిర్మన్ పల్లి గ్రామంలోని కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాల, కళాశాలలో కండ్ల కలక అంటువ్యాధి పై అవగాహన కార్యక్రమాన్ని మండల ఆరోగ్య విస్తరణ అధికారి వై.శంకర్ నిర్వహించారు. ఈ సందర్భంగా వైశంకర్ మాట్లాడుతూ కండ్ల కలక అంటువ్యాధి అని ,ఇది వైరస్ లేదా బ్యాక్టీరియా వలన వస్తుందని ఇది వచ్చిన పిల్లలను పూర్తిస్థాయిలో ఐసోలేషన్ గదిలో విడిగా ఉంచాలని తెలిపారు. కళ్ళ కలక వచ్చిన పిల్లలు  కండ్లు రుద్దడం చేయవద్దన్నారు.ఈ లక్షణాలు ఉన్నవారికి కండ్లు ఎర్రబడడం కళ్ళల్లో ఊసులు రావడం జరుగుతుందని, దీనికి వైద్యాధికారి సంప్రదించి సరియైన కంటి చుక్కలను తీసుకోవాలని, సరైన మందులు వేసుకోవాలని తెలిపారు. ఎక్కువ మందికి ఇది విస్తరించినట్లయితే ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఇందల్వాయిలో సమాచారం అందించాలని తెలిపారు.  ఒకవేళ కళ్ళ కలక వచ్చిన విద్యార్థులను ఆరోగ్యంగా ఉన్న విద్యార్థులు తాకితే వెంటనే చేతులు శుభ్రంగా కడుక్కోవాలని వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ వర్ష, అధ్యాపకులు పాల్గొన్నారు.
Spread the love