ఇంటి స్థలం ఇచ్చేందుకు ఆపసోపాలు బడాపారిశ్రామిక వేతలకు వేల ఎకరాలు దారాదత్తం
ఇంటి స్థలం ఇవ్వకుంటే ప్రభుత్వ భూములను ఆక్రమిస్తాం రేషన్ కార్డులకూ తప్పని వెతలు
కేవీపీఎస్ రాష్ట్ర మాజీ అధ్యక్షులు కాడిగళ్ల భాస్కర్ తెలంగాణ ప్రజా సంఘా పోరాట వేదిక ధర్నా
తహసీల్దార్‌కు పలు వినతిపత్రం అందజేత
నవతెలంగాణ-రంగారెడ్డి ప్రతినిధి
కటిక దరిద్రంలో బతుకున్న పేదలకు సీఎం కేసీఆర్ పాలనలో నిలువ నీడ, ఉండటానికి జాగ కరువైందని కేవీపీఎస్ రాష్ట్ర మాజీ అధ్యక్షులు కాడిగళ్ల భాస్కర్ ఆందోళన వ్యక్తం చేశారు. ఇంటి స్థలం ఇచ్చేందుకు ప్రభుత్వం ఆప సోపాలు పడుతోందని విమర్శించారు. కానీ బడా పారిశ్రామిక వేతలకు వేల ఎకరాలు దారాదత్తం చేస్తుందని దుయ్యబట్టారు. శుక్రవారం ప్రజా సమస్యలు పరిష్క రించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ ప్రజా సంఘాల పోరాట వేదిక ఆధ్వర్యంలో ఇబ్రహీంపట్నం తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. ఈ ధర్నాకు పేదలు వందలాదిగా తరలివచ్చారు. వివిధ డిమాండ్లతో కూడిన వినతిపత్రం తహసీల్దార్‌కు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అర్హులైన పేద లకు ఇంటి స్థలం ఇవ్వకుంటే ప్రభు త్వ భూములను ఆక్రమిస్తామని హెచ్చరించారు. ఇప్పటికే చాలా మంది వితంతు, వికలాం గులు పింఛన్ కోసం దర ఖాస్తు చేసుకుని ఎదురు చూస్తున్నారని అన్నారు. తెలంగాణ వచ్చి పదేండ్లు గడుస్తున్నా, నూతన రేషన్ కార్డులు జారీ లేకుండా పోయిం దన్నారు. రేషన్ కార్డులో పేర్లు నమోదు కాకపోవడంతో రేషన్ బియ్యం అందడం లేదన్నారు.ఇండ్లు, ఇంటి స్థలాలు లేక ఒకే ఇంట్లోనే నాలుగైదు కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఇంటి స్థలం లేని పేదలను గుర్తించి వారందరికీ ఇంటి స్థలం ఇవ్వాలని డిమాండ్ చేశారు. పేదలకు ఇంటి స్థలం ఇచ్చేందుకు ప్రభుత్వం మనసొప్పడం లేదనీ, బడా పారిశ్రామిక వేతలకు మాత్రం వేలాది ఎకరాలను దారాదత్తం చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంటి స్థలమున్న వారికి ఇంటి నిర్మాణం కోసం రూ.5లక్షలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. రామోజీ ఫిలిం సిటీ, దండుమైలారంలో 2007లో ఇంటి పట్టాలు ఇచ్చిన వారందరికీ స్థలం చూపించాలన్నారు. ఉపాధిహామీలో పని చేసిన కూలీలకు 2022 ఏప్రిల్ నుంచి డిసెంబర్ వరకు పెండింగ్ డబ్బులు వెంటనే విడుదల చేయాలని కోరారు. నెర్రపల్లి, తులేకలాన్, కప్పపహాడ్, పోల్కంపల్లి గ్రామాల్లోని భూ సమస్యలు వెంటనే పరిష్కరించాలన్నారు. ఇబ్రహీంపట్నం, ఆది భట్ల మున్సిపాలిటీల పరిధిలో ఇంటి స్థలాలు లేని పేదలకు ఇంటి స్థలాలు చూయించి, ఇల్లు కట్టించాలన్నారు. స్థానిక పరిశ్రమలో స్థానిక యువతకు ఉద్యోగాలు కల్పించాలన్నారు. ప్రజా సమస్యలు పరిష్కరించకపోతే భవిష్యత్తులో పెద్ద ఎత్తున పోరాటాలు ఉధృతం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కేవీపీఎస్ జిల్లా అధ్యక్షులు సామెల్, సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు జగదీష్, స్వప్న, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు జంగయ్య, ఐద్వా జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు విజయమ్మ, సుమలత, సీఐటీయూ జిల్లా నాయకులు ఎల్లేశ, బుగ్గరాములు, తులసిగారి నరసింహ, రైతు సంఘం మండల కార్యదర్శి ముసలయ్య, వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి గణేష్, మండల నాయకులు వెంకటేష్, శంకర్, వీరేష్, యాదగిరి, రమేష్, లింగస్వామి, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా నాయకులు చరణ్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.