వచ్చే ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ ఉండదు

There will be no BRS in the next election– తప్పు చేసినందుకే కేటీఆర్‌ జైలుకు పోతానంటుండు
– మూసీ ప్రక్షాళన అవసరమో..కాదో కిషన్‌రెడ్డి చెప్పాలి
– 19న మహిళా శక్తి సభను విజయవంతం చేయాలి
– హన్మకొండలో టీపీసీసీ అధ్యక్షులు బొమ్మ మహేశ్‌కుమార్‌ గౌడ్‌
నవతెలంగాణ-వరంగల్‌ ప్రాంతీయ ప్రతినిధి
”బీఆర్‌ఎస్‌ పదేండ్ల పాలనలో అభివృద్ధికి, కాంగ్రెస్‌ పాలనలో తొమ్మిది నెలల అభివృద్ధిపై మేం చర్చకు సిద్ధంగా ఉన్నాం.. తప్పు చేయడం వల్లే బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ జైలుకు పోతానంటున్నారు” అని టీపీసీసీ అధ్యక్షులు బొమ్మ మహేశ్‌కుమార్‌ గౌడ్‌ అన్నారు. శనివారం హన్మకొండలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. 2014లో తెలంగాణ ఉద్యమంలో భాగంగా ఇచ్చిన అనేక హామీలను కేసీఆర్‌ అమలు చేయలేకపోయారన్నారు. రూ.8.50 లక్షల కోట్ల అప్పులు చేసి పోయారన్నారు. నీళ్లు, నిధులు, భూముల పేరిట దోపిడీ చేశారని ఆరోపించారు. అందుకే రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్‌ పార్టీని గెలిపించారని చెప్పారు. ఇచ్చిన హామీలలో భాగంగా కాంగ్రెస్‌ పార్టీ ఆరు గ్యారంటీలను అమలు చేస్తోందన్నారు. రేవంత్‌రెడ్డి సీఎం అయ్యాక పేదలకు అభివృద్ధి ఫలాలు అందాలన్న రాహుల్‌గాంధీ ఆలోచనను క్షేత్రస్థాయిలో అమలు చేయడానికి కృషి చేస్తున్నారన్నారు. దేశంలోనే మొదటిసారి తెలంగాణలో కులగణన జరుగుతోందని చెప్పారు.వచ్చే ఎన్నికల నాటికి రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌ పార్టీ వుండదని మహేశ్‌కుమార్‌ అన్నారు. ఇప్పటికే ప్రతిపక్ష నేత కేసీఆర్‌ ఫాంహౌజ్‌కే పరిమితమయ్యారన్నారు. ఓ వైపు బీఆర్‌ఎస్‌ పార్టీ సోషల్‌ మీడియా వేదికగా కాంగ్రెస్‌ ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తోందన్నారు. మరోవైపు బీజేపీ కుల, మతాలతో ప్రజల మధ్య వైషమ్యాలు సృష్టించి రాజకీయాలు చేస్తోందని విమర్శించారు.
9 నెలల్లో 48 వేల ఉద్యోగాలు
పదేండ్లలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం 50 వేల ఉద్యోగాలిస్తే.. కాంగ్రెస్‌ ప్రభుత్వం 9 నెలల్లోనే 48 వేల ఉద్యోగాలిచ్చిందని తెలిపారు. తమ ప్రభుత్వం చేసిన అభివృద్ధిని వివరించడానికే వరంగల్‌ నగరంలో ఈనెల 19న భారీ బహిరంగ సభ నిర్వహించబోతున్నట్టు తెలిపారు. మూసీ ప్రక్షాళన అవసరమా? లేదా అనేది కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి సమాధానం చెప్పాలని అన్నారు. హైదరాబాద్‌ సురక్షిత నగరంగా, మంచి వాతావరణం వుండేలా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. నార్సింగ్‌లో తన ఇంట్లో ఫస్ట్‌ ఫ్లోర్‌ వరకు వరద వస్తోందని తెలిపారు. అందువల్ల సురక్షిత నగరంగా భావి తరాలకు అందించడానికే మూసీ ప్రక్షాళనతోపాటు హైడ్రాను అమలు చేస్తున్నామన్నారు.
తప్పు చేసినందుకే..
కేటీఆర్‌ తప్పు చేసినందుకే జైలుకు పోతానంటున్నారని మహేశ్‌కుమార్‌ చెప్పారు. విచారణలో ఆయన చేసిన అక్రమాలు బహిర్గతమయ్యాయని, అందుకే జైలుకు పోవడానికి సిద్ధపడ్డట్టు మాట్లాడుతు న్నారని అన్నారు. ధరణి వల్ల తన గ్రామంలోనే తన భూములే మాయమయ్యాయని చెప్పారు. బీఆర్‌ఎస్‌ అధికారంలో వున్నప్పుడే ఫార్మాసిటీకి 15 వేల ఎకరాలు కేటాయించారని తెలిపారు. వరంగల్‌ను రెండో నగరంగా అభివృద్ధి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ఎయిర్‌పోర్ట్‌, కోచ్‌ ఫ్యాక్టరీ త్వరలోనే రానున్నాయన్నారు.
19న ప్రజాపాలన విజయోత్సవ సభను విజయవంతం చేయాలి
ఇందిరాగాంధీ జయంతిని పురస్కరించుకొని ఈనెల 19న హన్మకొండలోని ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కాలేజీ మైదానంలో ఏర్పాటు చేసిన ప్రజాపాలన విజయోత్సవ బహిరంగసభను విజయవంతం చేయాలని మహేశ్‌కుమార్‌ గౌడ్‌ పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో మంత్రులు శ్రీధర్‌బాబు, కొండా సురేఖ,పొన్నం ప్రభాకర్‌, ప్రభుత్వ సలహదారులు వేం నరేందర్‌రెడ్డి, విప్‌ రాంచంద్రనాయక్‌, హన్మకొండ డీసీసీ అధ్యక్షులు, వరంగల్‌ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి, ఎంపి బలరాంనాయక్‌, ఎమ్మెల్సీ బస్వరాజ్‌ సారయ్య, ఎమ్మెల్యేలు రేవూరి ప్రకాశ్‌రెడ్డి, కెఆర్‌ నాగరాజు, గండ్ర సత్యనారాయణ రావు, మేయర్‌ గుండు సుధారాణి, కుడా చైర్మెన్‌ ఇనగాల వెంకట్రాంరెడ్డి, గ్రంధాలయ సంస్థ చైర్మెన్‌ ఎండి రియాజ్‌, వక్ఫ్‌బోర్డ్‌ చైర్మెన్‌ బియాబాని, వరంగల్‌ డీసీసీబీ చైర్మెన్‌ మార్నేని రవీందర్‌రావు, డీసీసీ అధ్యక్షులు ఎర్రబెల్లి స్వర్ణ, మాజీ ఎమ్మెల్సీ పుల్లా పద్మావతి పాల్గొన్నారు.

Spread the love