– మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి వెల్లడి
నవతెలంగాణ- వరంగల్ ప్రాంతీయ ప్రతినిధి
కొత్త రేషన్‌కార్డులకు ఎలాంటి రికమండేషన్‌లు ఉండబోవని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. వరంగల్‌లో ఉమ్మడి జిల్లా మంత్రులు సీతక్క, కొండా సురేఖ, అధికారులతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. గత ప్రభుత్వం ఒకటి రెండు కార్డులు ఇచ్చి చేతులు దులుపుకుందన్నారు. తమ ప్రభుత్వం అర్హులైన అందరికీ రేషన్ కార్డులు ఇస్తుందన్నారు. రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలతో పాటు అభివద్ధిని సంక్షేమాన్ని సమ ప్రాధాన్యతనిస్తున్నట్టు పేర్కొన్నారు. పేదోడి కలను నెరవేర్చాలని ప్రభుత్వం చిత్తశుద్ధితో అభివద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేస్తుందన్నారు. జనవరి 26న గణతంత్ర దినోత్సవ సందర్భంగా పేదవాడి ప్రతి ఇంటికి ఇందిరమ్మ ప్రభుత్వ ఫలాలను అందించాలని రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తుందన్నారు. గత ప్రభుత్వంలో మాదిరిగా కాకుండా ఎన్నో ఆర్థికపరమైన ఇబ్బందులు ఉన్నప్పటికీ రైతును రాజు చేయాలని ఉద్దేశంతో 12 వేల రూపాయలను రైతు భరోసా కింద అందించనున్నట్టు తెలిపారు. అర్హులైన ప్రతి రైతుకు రైతు భరోసాను అందిస్తామన్నారు. ప్రతి గ్రామంలో అధికారులు గ్రామ సభ పెట్టి నాలుగు పథకాలకు అర్హులైన లబ్ధిదారులను ఎంపిక చేస్తారన్నారు. 12 వేల రూపాయలను వ్యవసాయ రైతు కూలీలకు అందిస్తుందన్నారు. ఇందిరమ్మ ఇండ్లు, రైతు భరోసా, రేషన్ కార్డులు అందించడం అనేది నిరంతరం ప్రక్రియ అని అన్నారు. వీటి విషయంలో ఎలాంటి అపోహలు అవసరం లేదన్నారు.