పిల్లల విషయంలో ఇవి తప్పనిసరి..

These are mandatory for children.పిల్లల చదువు, ఆరోగ్యం, వస్త్రధారణ విషయంలో ఏ లోటు రాకుండా చూసుకుంటాం. ఆహారపు అలవాట్లు, కుటుంబ పద్ధతులతో పాటు, కుటుంబంలోని మనుషుల మధ్య ఉండే అనుబంధాల విషయంలో జాగ్రత్త తీసుకుంటాం. అయితే స్కూల్‌కి వెళ్తున్న పిల్లల్లో తన తోటి పిల్లల ప్రభావం కూడా పడుతూ ఉంటుంది. అలాంటి వాటిల్లో కొన్ని విషయాలు చూసీ చూడనట్టుగా వదిలేస్తాం. అవే వారు ఎదిగాక వారి వ్యక్తిత్వాన్ని శాసిస్తాయి. తర్వాత వాటిని మార్చాలన్నా వినే స్థాయిలో పిల్లలు ఉండరు. అందుకే పిల్లల్లో మంచి గుణాలు అలవర్చడానికి పసితనం నుండే మంచి లక్షణాలు అలవడేలా జాగ్రత్త పడాలి. దాని కోసం కొన్ని నియమాలను కచ్చితంగా పెట్టాల్సిందే అంటున్నారు పిల్లల నిపుణులు. అవేంటో తెలుసుకుందాం…
ప్లీజ్‌, థాంక్స్‌ : పిల్లలకు ఏదైనా పని చెప్పాలనుకున్నప్పుడు ప్లీజ్‌ అనడం, ఆ పని చేశాక థాంక్స్‌ చెప్పడం మరిచిపోకండి. ఆటోమేటిక్‌గా వాళ్ళకూ అలవాటవుతుంది. వాళ్ళు కూడా థాంక్స్‌ గాని ప్లీజ్‌ గానీ చెప్పినప్పుడు మీరు హ్యాప్పీగా ఫీల్‌ అవుతారన్న విషయం వారికి అర్థమయ్యేలా ప్రవర్తించండి.
భోజనం చేసేటప్పుడు : భోజనం చేసేటప్పుడు ఎలా మసలుకోవాలో పిల్లలకు వారు సొంతంగా తినడం మొదలు పెట్టినప్పటి నుండే చెప్పాలి. కొందరు పిల్లలు నోరు తెరిచి పెట్టి తింటుంటారు. తిన్న ప్రతీసారి ప్లేట్‌ చుట్టూరా అన్నం పడేయడం, అన్నం తింటున్న చేతితోనే గ్లాసుల్ని పట్టుకోవడం చేస్తుంటారు. అలాగని అంత చిన్న వయసు నుండే వాళ్ళు అన్ని పద్ధతులు నేర్చుకోవడం కుదరదు, కానీ అలా చేయడం కరెక్ట్‌ కాదన్న విషయాన్ని మాత్రం వారికి తెలియజేయాలి.
పార్టీలకు వెళ్ళినప్పుడు : పిల్లలు ఏదైనా బర్త్‌డే పార్టీకి వెళ్ళినప్పుడు అక్కడ ఎలా మసలుకోవాలో చెప్పి పంపించండి. ఫ్రెండ్స్‌తో ఎలా ఉండాలి, వారి పేరెంట్స్‌తో ఎలా ఉండాలి, తినేటప్పుడు తోటివారితో ఎలా మసలుకోవాలి ఒకటికి రెండు సార్లు చెప్పండి. ముఖ్యంగా పిల్లలు, స్వీట్స్‌, చాక్లెట్స్‌ విషయంలో అవగాహన లేకుండా ప్రవర్తిస్తుంటారు. వాళ్ళు వెళ్ళేది ఫ్రెండ్‌ పార్టీకి కాబట్టి అలా ప్రవర్తించకూడదని చెప్పి పంపించండి.
చులకన చేయడం : పిల్లల్లో సర్వ సాధారణంగా ఉండే అలవాటు. తోటివారిని వారి పేర్లతో కాకుండా ఫన్నీగా ఉండే పేర్లతో పిలుస్తుంటారు. క్లాస్‌ మేట్స్‌, ఫ్రెండ్స్‌నే కాదు ఒక్కోసారి టీచర్స్‌ని కూడా చులకన చేస్తుంటారు. ఇలాంటి అలవాట్లను మొగ్గలోనే తుంచేయాలి, వీలయితే ఎవరినైతే వారు కించపరుస్తున్నారో వారిలో ఉన్న గొప్పను పిల్లలకు అర్థమయ్యేలా చెప్పాలి, ఎదుటి వారిని కించపరిస్తే మనం లోకువైపోతామన్న విషయం వారికి తెలియజేయాలి.

Spread the love