నవతెలంగాణ – హైదరాబాద్: తెలంగాణ శాసనసభ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ ప్రభంజనం సృష్టించిన విషయం తెలిసిందే. 64 స్థానాలు+1 సీపీఐ స్థానంతో కలిసపి 65 సీట్లు గెలుచుకుంది. మరోవైపు ఈ ఎన్నికల్లో పలువురు అభ్యర్థులు హ్యాట్రిక్ విజయం సాధించారు. ఇంకొందరైతే డబుల్ హ్యాట్రిక్ కొట్టారు. ముఖ్యంగా హైదరాబాద్‌లో ఏకంగా 10 మంది అభ్యర్థులు హ్యాట్రిక్ గెలుపు సాధించారు. మరి వాళ్లెవరో ఓ లుక్కేద్దామా..? హైదరాబాద్‌లో హ్యాట్రిక్ విజయం సాధించిన 10 మందిలో ఏడుగురు బీఆర్ఎస్ నుంచే ఉండటం గమనార్హం. మంత్రి తలసాని 2014లో టీడీపీ, 2018, 2023లో బీఆర్ఎస్ నుంచి గెలిచి హ్యాట్రిక్ గెలుపు నమోదు చేసుకున్నారు. అయితే ఈయన 1994,1999, 2008లోనూ గెలవడంతో డబుల్ హ్యాట్రిక్ సాధించి హిస్టరీ క్రియేట్ చేశారు. మరోవైపు జూబ్లీహిల్స్‌లో బీఆర్ఎస్ అభ్యర్థి గోపీనాథ్ 2014లో టీడీపీ, 2018లో బీఆర్ఎస్ నుంచి గెలుపొందారు. ఇప్పుడు హ్యాట్రిక్ సాధించారు. శేరిలింగంపల్లిలో మంచి ఆధిక్యం దక్కించుకున్న అరికెపూడి గాంధీ 2014లో టీడీపీ, 2018, 2023ల్లో బీఆర్ఎస్ నుంచి గెలిచారు. కుత్బుల్లాపూర్‌లో తాజాగా భారీ మెజార్టీతో సత్తా చాటిన వివేకానంద్, 2014లో టీడీపీ నుంచి , 2018లో బీఆర్ఎస్ నుంచి గెలిచి ఇప్పటి విజయంతో హ్యాట్రిక్ విన్ సాధించారు. సికింద్రాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థిగా పద్మారావుగౌడ్ తెలంగాణ వచ్చిన తర్వాత వరుసగా మూడుసార్లు గెల్చారు. 2004లో తొలిసారి ఎమ్మెల్యే అయ్యారు. కూకట్‌పల్లిలో మాధవరం కృష్ణారావు 2014లో టీడీపీ, 2018లో, ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి విజయం సాధించారు. పటాన్‌చెరు నుంచి బీఆర్ఎస్ అభ్యర్థి గూడెం మహిపాల్‌రెడ్డి 2014, 2018, 2023లో గెలిచారు. చేవెళ్ల ఎమ్మెల్యే కాలెయాదయ్య 2014లో కాంగ్రెస్ నుంచి, బీఆర్ఎస్ అభ్యర్థిగా 2018, 2023లో గెలుపొందారు ఎంఐఎం శాసనసభా పక్షనేత అక్బరుద్దీన్ ఒవైసీ 1999లో తొలిసారి గెలిచారు. ఆ తర్వాత 2004, 2009, 2014, 2018, 2023ల్లో తిరుగులేని ఆధిక్యం సాధించారు. కార్వాన్ నుంచి కౌసర్ మొహియుద్దీన్ ఎంఐఎం అభ్యర్థిగా మూడోసారి గెలుపొందారు. మరోవైపు గోషామహల్ నుంచి బీజేపీ అభ్యర్థి రాజాసింగ్ 2014, 2018, 2023ల్లో హ్యాట్రిక్ విన్ సాధించారు.