విలీన దినోత్సవం రోజు రాష్ట్రానికి అమిత్ షా వస్తున్నారు. పైగా దీనిని విమోచన దినోత్సవం అంటున్నారు. నిజాం పాలనలో ఉన్న హైదరాబాద్ రాజ్యం స్వతంత్ర భారతదేశంలో విలీనమైన ఘట్టం గురించి వీరికి మాట్లాడే అర్హత ఉన్నదా? వాస్తవంగా ఏం జరిగింది?
1946లో ప్రారంభమైన తెలంగాణ సాయుధరైతాంగ పోరాటం జరుగుతున్న కాలంలోనే భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చింది. తర్వాత సంవత్సరానికి హైదరాబాద్ రాజ్యం కూడా భారతదేశంలో విలీనం అయ్యింది. కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో, పుచ్చలపల్లి సుందరయ్య నాయకత్వంలో సాగిన ఈ పోరాటం ద్వారా పేదలకు పది లక్షల ఎకరాల భూమి పంచారు. ఈ పోరాట ఫలితంగానే హైదరాబాద్ రాజ్యం భారతదేశంలో విలీనం కాక తప్పని పరిస్థితి ఏర్పడింది. అంతిమంగా, ఈ పోరాట ఫలితంగా భూమి సమస్య దేశం ఎజెండా మీదకు వచ్చింది. భూసంస్కరణల ఆవశ్యకత గుర్తించక తప్పని పరిస్థితి ఏర్పడింది. కులమతాలకు, ప్రాంతీయ భేదాలకు అతీతంగా సాగిన మహత్తర పోరాటమిది. వెట్టిచాకిరీని ప్రతిఘటించిన పోరాటం, మూడువేల గ్రామరాజ్యాలు ఏర్పాటు చేసి, మహిళలను నిర్ణయంలో భాగస్వాములను చేసింది. విడాకులతో సహా మహిళల హక్కులు గుర్తించారు. తెలుగు భాష అభివృద్ధి కోసం పోరాడారు. ఆర్థిక, సాంస్కృతిక, సామాజిక రంగాలలో జరిగిన పోరాటమది. తెలంగాణ రైతాంగం పోరుబాటలో ఉండగా, ఆంధ్రప్రాంతంలోని సరిహద్దు జిల్లాల నుంచి ప్రజలు విరాళాలు పంపారు. కమ్యూనిస్టు కార్యకర్తలు స్వయంగా తెలంగాణకు తరలివచ్చి పోరాటంలో పాల్గొన్నారు. నాయకులకు, దళాలకు రక్షణ కల్పించారు. ఈ ప్రయత్నాలలో తీవ్ర నిర్బంధాలకు గురయ్యారు. భూమికోసం, భుక్తి కోసం, దోపిడీ నుంచి విముక్తి కోసం సాగిన ఈ మహౌద్యమంలో ఆర్యసమాజ్ వెతికినా కనిపించదు. పైగా భూస్వాముల పంచన జేరింది. ఆర్‌ఎస్‌ఎస్ ఛాయలే కనిపించవు. ఎర్రజెండా నాయకత్వంలో సాగిన ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఈ పోరాటం గురించి ఇప్పుడు ఆర్‌ఎస్‌ఎస్, దాని ముద్దుబిడ్డ బీజేపీ వక్రభాష్యం చెబుతున్నది.
బ్రిటిష్ ఇండియాలో స్వాతంత్య్రోద్యమం జరుగుతున్న కాలంలోనే కాశ్మీరీ రైతాంగం కూడా రాజు హరిసింగ్ రాజ్యం మీద తిరుగుబాటు చేసారు. భూమికోసం, ప్రజాస్వామ్యం కోసం పోరాడారు. భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చిన సమయంలో జమ్ముకాశ్మీర్ రాజు స్వతంత్ర రాజ్యంగానే ఉండాలనుకున్నాడు. కానీ పాకిస్థాన్ దాడి చేసింది. కాశ్మీర్ రైతాంగం ఒకవైపు రాజ్యంమీద పోరాడుతూనే, పాక్ సైన్యాలను కూడా ఎదిరించారు. కశ్మీరీలు ముస్లింలు. అయినా పాకిస్థాన్ లాంటి మతరాజ్యంలో చేరడానికి నిరాకరించారు. ప్రజాస్వామ్యం కోరుకున్నారు. ఇటు ప్రజల తిరుగుబాటు, అటు పాకిస్థాన్ దాడితో ఉక్కిరిబిక్కిరి అయిన రాజు హరిసింగ్, జమ్ము కాశ్మీర్‌ను ఇండియాలో విలీనం చేయడానికి నిర్ణయించుకున్నాడు. ఆమేరకు పాకిస్థాన్‌ను ఎదుర్కొనే బాధ్యత ఇండియా తీసుకున్నది. భారతదేశం సెక్యులర్ దేశంగా ఉంటుందన్న హామీతో ఇండియాలో కలవడానికి సిద్ధపడ్డారు. 1947 అక్టోబర్‌లో ఇండియన్ యూనియన్ ప్రభుత్వానికీ, జమ్ము కాశ్మీర్ రాజుకూ ఒప్పందం కుదిరింది. ఇలాంటి సమయంలో కూడా, ప్రజాపరిషత్, ఆర్‌ఎస్‌ఎస్, జమ్ముకాశ్మీర్ స్వతంత్ర రాజ్యంగానే ఉండాలని రాజుకు సూచించింది. అప్పుడు వీరికి అఖండ భారత్ గుర్తుకు రాలేదు. అసలు భారత స్వాతంత్య్రోద్యమంతో ఆర్‌ఎస్‌ఎస్‌కు అణువంత సంబంధం కూడా లేదు. స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొని భారత యువత, తమ విలువైన యవ్వన జీవితాన్ని వృధా చేసుకోవద్దని, ఆనాటి ఆర్‌ఎస్‌ఎస్ అధినేత గోల్వాల్కర్, బహిరంగంగానే ప్రకటించారు. వీరి సైద్ధాంతిక గురువు వినాయక్ దామోదర్ సావర్కర్, తనను జైలునుంచి విడుదల చేస్తే, బ్రిటిష్ పాలకులకే ఉపయోగమని వేడుకుని బయటపడ్డారు. స్వాతంత్య్రోద్యమం ఉవ్వెత్తున సాగుతున్న కాలంలో కాంగ్రెసు నాయకులు ప్రాంతీయ ప్రభుత్వాలకు రాజీనామా చేసి నిరసన తెలిపారు. కానీ సావర్కర్ బ్రిటిష్ పాలకులకు సంఘీభావం తెలిపారు. ఇలాంటి ఆర్‌ఎస్‌ఎస్, వీరి రాజకీయ విభాగమైన బీజేపీలు ఇప్పుడు దేశభక్తి గురించి మాట్లాడుతున్నాయి. క్విట్ ఇండియా ఉద్యమ సమయంలో కూడా ఇక్కడ ఆర్‌ఎస్‌ఎస్‌తో తమకేమీ ప్రమాదం లేదనీ, స్వాతంత్య్రం కోసం కమ్యూనిస్టులు ప్రజలను రెచ్చగొడుతున్నారని పోలీసు అధికారులు బ్రిటిష్ పాలకులకు రిపోర్టు పంపారు. బ్రిటిష్ వ్యతిరేక పోరాటంతోగానీ, భూస్వాములు, జమీందార్ల దోపిడీ వ్యతిరేక పోరాటంతో గానీ, రాచరికాల మీద సాగిన తిరుగుబాట్లతోగానీ ఏ సంబంధమూ లేని వీరు ఇప్పుడు భారతదేశం గురించీ, దేశభక్తి గురించీ, తెలంగాణ విలీనం గురించీ మాట్లాడుతున్నారు.
రైతాంగ సాయుధ పోరాటానికి మతం రంగు పులుముతున్నారు. ముస్లింలనుంచి హిందువులకు విమోచనగా ప్రచారం చేస్తున్నారు. ప్రజల మీద ప్రత్యక్షంగా దోపిడీ, దౌర్జన్యాలు సాగించిన జమీందార్లు, జాగీర్‌దార్లు హిందువులే. వీరికి అండగా నిలిచింది నిజాం ప్రభుత్వం. భూమి కోసం కేసు వేసిన బందగిని భూస్వామి హత్య చేయించాడు. భూస్వామికి అండగా నిలిచిన నిజాం పోలీసులు ముస్లింలు. హత్యకు గురైన రైతు, బందగి ముస్లిం. ఇక్కడ భూమిసమస్య తప్ప హిందూ ముస్లిం సమస్య లేదు. హైదరాబాద్ నగరంలో, నిజాం రాజ్యం మీద పోరాటం తప్పదని కామ్రేడ్స్ అసోసియేషన్ ప్రారంభించినవారిలో ఆలం ఖుంద్మిరి, మఖ్దుం మొహియుద్దీన్, రాజ్‌బహదూర్ గౌర్ ముఖ్యులు. నిజాం నిరంకుశ పాలనను ఎండగడుతూ వార్తలు రాసిన ఉర్దూ పాత్రికేయుడు షోయబుల్లాఖాన్‌ను నరికి చంపిన దుర్మార్గులు రజాకార్లు. ఐలమ్మ పండించిన పంటను దోచుకుని రావాలని జమీందార్ రామచంద్రారెడ్డి, తన గూండాలను పంపాడు. ఐలమ్మకు అండగా భీమిరెడ్డి నర్సింహారెడ్డి నాయకత్వంలో ఒక బృందం రంగంలోకి దిగింది. గూండాలను తరిమి, ఐలమ్మకు పంట దక్కేటట్టు చేసింది. జమీందారు మీద సాధించిన ఈ విజయం వార్త అనేక గ్రామాలకు పాకింది. రైతాంగం ప్రదర్శనలు చేసారు. ఈ స్ఫూర్తితోనే దొడ్డి కొమురయ్య కూడా ప్రదర్శనలో పాల్గొన్నాడు. కానీ జమీందార్లకు మద్దతుగా నిజాం సైనికులు, రజాకార్లు దాడి చేసి దొడ్డి కొమురయ్యను పొట్టనబెట్టుకున్నారు. ఇక్కడ మతసమస్య ఎక్కుడున్నది? అసలు రజాకార్ సంస్థకు అధ్యక్షుడు ఖాసిం రజ్వీ కాగా, ఉపాధ్యక్షుడు విసునూరు దేశముఖ్ రామచంద్రారెడ్డి కదా! ఏ గ్రామం పోయినా, రజాకార్ మూకలకు అడ్డాలు ఈ దొరల గడీలే కదా! హైదరాబాద్ నగరంలో కార్మిక పోరాటాలు కూడా జరిగాయి. పోలీసు కాల్పులను ఎదిరిస్తూ నిజాం పోలీసులను తరిమికొట్టారు. మఖ్దుం మొహియుద్దీన్, రాజ్‌బహద్దూర్ గౌర్, కెఎల్ మహేంద్ర, అలీ అఖ్తర్, సత్యనారాయణరెడ్డి తదితర నాయకులే ఆనాటి పోరాటాల సారధులు. భూమికోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరీ నుంచి విముక్తి కోసం సాగిన ఈ మహత్తర రైతాంగ పోరాటానికి మతం రంగు పులమటం దుస్సాహసం.
ఇప్పుడు ఐలమ్మ పేరు చెప్పుకుంటున్న బీఆర్‌ఎస్ నేతలది కూడా, చెట్టుపేరు చెప్పి, కాయలు అమ్ముకునే ప్రయత్నమే. భూస్వామ్య వ్యతిరేక పోరాట వీరనారి ఐలమ్మ. ఆమె పేరు వాడుకుంటున్న బీఆర్‌ఎస్ పాలకులకు వ్యవసాయ కార్మికులు, కౌలురైతులంటే గిట్టదు. అస్సైన్డ్ భూములు నిర్దాక్షిణ్యంగా గుంజుకుంటున్నారు. రెవిన్యూ రికార్డుల నుంచి ‘కాస్తు’ కాలమ్ తొలగించి, దశాబ్దాలుగా దున్నుకుంటున్న పేదరైతులను భూములనుంచి దూరం చేసారు.
కాంగ్రెసు, సర్దార్ పటేల్ పాత్ర కూడా కొత్త తరాలకు తెలియాలి. 1947 అక్టోబరులో జమ్ముకాశ్మీర్ రాజ్యాన్ని భారతదేశంలో విలీనం చేస్తూ నెహ్రూ-పటేల్ ప్రభుత్వం ఒప్పందం చేసుకున్నది. అప్పుడు సర్దార్ పటేల్ హౌం మంత్రి. సరిగ్గా నెలరోజుల తర్వాత, ఇదే ఇండియన్ యూనియన్ ప్రభుత్వం, నవంబరు 1947లో, నిజాం రాజుతో యాథాతథ ఒప్పందం చేసుకున్నది. అంటే, నిజాం రాజ్యాన్ని కూడా స్వతంత్రదేశంగా గుర్తించింది. ఒకరి సార్వభౌమాధికారాన్ని మరొకరు గౌరవించాలని సంతకాలు చేసింది. విలీనానికి అంగీకరించిన జమ్ము కాశ్మీర్ రాజ్యాన్ని కలుపుకున్నారు. స్వతంత్ర దేశంగానే ఉంటామని ప్రకటించిన నిజాంతో యథాతథ ఒప్పందం చేసుకున్నారు. స్వాతంత్య్రం వచ్చిన సమయంలో రాజుల పాలనలో ఉన్న రాజ్యాలు ఇండియా లేదా పాకిస్తాన్‌లో విలీనం కావడానికీ, లేదా స్వతంత్ర దేశాలుగా కొనసాగడానికీ స్వేచ్ఛనిచ్చారు. బ్రిటిష్ పాలకులతో జరిగిన ఒప్పందం అది. రైతాంగ పోరాటం ఉధృతమైంది. నిజాం రాజు నిలువలేని పరిస్థితి ఏర్పడింది. ఏమాత్రం ఆలస్యం జరిగినా నిజాం రాచరికం కుప్పగూలి ఎర్రజెండా అధీనంలోకి వచ్చే పరిస్థితి ఏర్పడ్డది. అదే జరిగితే పరిణామాలు ఎట్లా ఉంటాయో నెహ్రూ-పటేల్‌కు తెలుసు. ఇలాంటి పరిస్థితులలోనే 1948 సెప్టెంబరు 13న యూనియన్ సైన్యాలు తెలంగాణలో అడుగుపెట్టాయి. నిజాం రాజు పెద్దగా ప్రతిఘటించలేదు. ఐదవరోజుకల్లా నిజాం రాజు, హైదరాబాద్ రాజ్యాన్ని ఇండియన్ యూనియన్‌లో విలీనం చేయడానికి అంగీకరించాడు. ఇదీ చరిత్ర. సర్దార్ పటేల్ సాహసంతో, నిజాం ప్రభుత్వాన్ని లొగదీసుకున్నారని నమ్మబలుకుతున్నారు. అదే నిజమైతే నిరంకుశ నిజాం రాజును ఎందుకు జైలులో పెట్టలేదు? పైగా ఆ నరహంతకుడినే, తెలంగాణ ప్రజలనెత్తిన రాజప్రముఖ్ పేరుతో కూర్చోబెట్టారు. నరహంతకుడు, రజాకార్ నేత ఖాసీం రజ్వీని ఎందుకు ఉరితీయలేదు? సకల సౌకర్యాలతో పాకిస్థాన్‌కు ఎందుకు అప్పగించారు? అంతేనా? రాజు ఆస్తిని జప్తు చేయకపోగా, నిజాం కుటుంబానికి రాజభరణం పేరుతో పరిహారం ముట్టజెప్పారు. యూనియన్ సైన్యాలు రాచరికం నిరంకుశత్వాన్ని అంతం చేసి ప్రజాస్వామ్యాన్ని నెలకొల్పుతాయనీ, రైతాంగం హక్కులను గౌరవిస్తాయనీ నమ్మిన రైతులు మోసపోయారు. సైన్యం రైతాంగం మీద విరుచుకుపడ్డది. నిజాం పాలనలో, రైతాంగ తిరుగుబాటుతో భయపడి హైదరాబాద్ పారిపోయిన జమీందార్లు, యూనియన్ సైన్యాల అండతో ఖద్దరు బట్టలూ, తెల్లటోపీలతో, కాంగ్రెస్ అవతారంలో గ్రామాలలో అడుగుబెట్టారు. యూనియన్ సైన్యాల నిజరూపం రైతులకు అర్ధమైంది.
ఈ మహత్తర పోరాట వారసులు కమ్యూనిస్టులు. ఇప్పటికీ ప్రజల కోసం పోరాడుతున్నది కమ్యూనిస్టులే కదా! ఇప్పుడు ప్రజల సమస్యలు పరిష్కరించటంలో మోడీ ప్రభుత్వం విఫలమైంది. అందుకే మతపరమైన విభజనతో, భావోద్వేగాలు రెచ్చగొట్టి, ప్రజల దృష్టి మరలించాలని ప్రయత్నిస్తున్నది. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటానికి మతం రంగు పులిమేది కూడా అందుకే. తెలంగాణ ప్రజలు, ప్రజాస్వామ్యవాదులు అప్రమత్తంగా ఉండాలి.
ఎస్. వీరయ్య