– బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య హోరాహోరీ పోరు
– నరేందర్, కొండా సురేఖ మధ్యే పోటీ
– 15 విడతలు ఎన్నికలు జరగ్గా.. 8 సార్లు కాంగ్రెస్ విన్
వరంగల్ తూర్పు నియోజకవర్గంలో అత్యంత వేగంగా సమీకరణలు మారుతున్నాయి. బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులను ఆయా పార్టీలు ఇప్పటికే ప్రకటించాయి. నియోజకవర్గంలో ఇప్పటి వరకు 15సార్లు ఎన్నికలు జరగ్గా ఎనిమిది సార్లు కాంగ్రెస్, మూడు సార్లు టీడీపీ, రెండు సార్లు బీఆర్ఎస్, రెండు సార్లు ఇండిపెండెంట్లు గెలిచారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి మాజీ మంత్రి కొండా సురేఖ, బీఆర్ఎస్ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్, బీజేపీ నుంచి ఎర్రబెల్లి ప్రదీప్‌రావు పోటీ చేస్తున్నారు. ఇప్పటికే అభ్యర్థులు ప్రచారాన్ని ముమ్మరం చేశారు. 2018 ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలోకి దిగిన నన్నపనేని నరేందర్ తన సమీప కాంగ్రెస్ ప్రత్యర్థి వద్దిరాజు రవిచంద్రపై 28వేల782 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. 2014 ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన కొండా సురేఖ, కాంగ్రెస్ అభ్యర్థి బస్వరాజ్ సారయ్యపై 55వేల 85 ఓట్ల భారీ మెజార్టీతో గెలిచారు. ఈసారి మూడు పార్టీల మధ్య పోటీ ఉన్నా నరేందర్, కొండా సురేఖ మధ్యే గట్టి పోటీ ఉండబోతుంది. ‘తూర్పు’ కోటపై జెండా పాతాలని ఎవరికివారే గట్టి ప్రయత్నాల్లో ఉన్నారు.
నవతెలంగాణ-వరంగల్ ప్రాంతీయ ప్రతినిధి
వరంగల్ తూర్పు నియోజకవర్గంలో ఇప్పటి వరకు 6సార్లు బీసీ నేతలే ఎమ్మెల్యేలుగా ఎన్నికవుతూ వచ్చారు. తాజా ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి నన్నపనేని నరేందర్, కాంగ్రెస్ అభ్యర్థి కొండా సురేఖ మధ్యే హోరాహోరీ పోరు ఉంటుందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. బీజేపీ అభ్యర్థి ఎర్రబెల్లి ప్రదీప్‌రావు రంగంలో ఉన్నా పోటీ ముఖాముఖిగానే ఉంటుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 2014 నుంచి 2018 నాటికి బీఆర్ఎస్ మెజార్టీ సగానికి సగం తగ్గడం గమనార్హం. కాంగ్రెస్‌కు కంచుకోటగా ఉన్న ‘తూర్పు’ నియోజకవర్గంలో ఈసారి కాంగ్రెస్ జెండా పాతడానికి రంగం సిద్ధం చేసింది. అభివృద్ధి పేరిట బీఆర్ఎస్ అభ్యర్థి నరేందర్ ఇప్పటికే ప్రచారంలో వున్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కొండా సురేఖ తన ప్రచారాన్ని ముమ్మరం చేయాల్సి ఉంది.
2014లో ఇక్కడ ఎమ్మెల్యేగా భారీ మెజార్టీతో విజయం సాధించిన కొండా సురేఖకు రాష్ట్ర మంత్రివర్గంలో ప్రాతినిధ్యం దక్కకపోవడంతో బీఆర్ఎస్కు దూరమై చివరకు కాంగ్రెస్‌లో చేరారు. నాటి నుంచి ‘తూర్పు’ నియోజకవర్గానికి దూరమై 2018లో పరకాల నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. తిరిగి ఈ ఎన్నికల్లో మళ్లీ ‘తూర్పు’కు వచ్చి పోటీ చేస్తున్నారు. పాత పరిచయాలున్నా, కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో ఉత్తేజం నింపి ఎన్నికల్లో విజయం సాధించడానికి పావులు కదపాల్సి వుంది. ఎమ్మెల్యేపై, బీఆర్ఎస్ పార్టీపై వున్న వ్యతిరేకత కాంగ్రెస్ పార్టీకి కలిసొచ్చే అవకాశం కనిపిస్తుంది.
‘నన్నపనేని’పై అసంతృప్తి
బీఆర్ఎస్ అభ్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్‌పై నియోజకవర్గంలో అసంతృప్తి ఉంది. ‘నన్నపనేని’ వ్యక్తిగత వ్యవహారశైలి మీద బీఆర్ఎస్ శ్రేణుల్లోనే వ్యతిరేకత వుంది.
‘నన్నపనేని’ని వ్యతిరేకిస్తున్న నేతలు, కార్పొరేటర్లను తమవైపు తిప్పుకోవడానికి కాంగ్రెస్ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఈ నియోజకవర్గంలో శాసనమండలి డిప్యూటీ చైర్మెన్ డాక్టర్ బండా ప్రకాశ్, మేయర్ గుండు సుధారాణి, ఎమ్మెల్సీ బస్వరాజ్ సారయ్య వున్నా వారితో ఎమ్మెల్యేకు సమన్వయం లేదనేది బహిరంగ రహస్యమే. సొంత పార్టీ నేతలు, కార్పొరేటర్లపైనే ‘నన్నపనేని’ కేసులు పెట్టించి వేధింపులకు గురిచేశారన్న ఆరోపణలున్నాయి. ఈ క్రమంలో పలువురు కార్పొరేటర్లు ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా సమావేశాలు నిర్వహించుకొని, భవిష్యత్ రాజకీయాలపై నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. ఈ పరిణామాలను కాంగ్రెస్ పార్టీ తనకు అనుకూలంగా మలచుకునేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నట్టు తెలిసింది.