అవి మోడీ సమన్లు

– ఈడీ, సీబీఐ, ఐటీ తోలుబొమ్మలు
– బీజేపీలో చేరితే పునీతులా?
– రాజకీయ దురుద్దేశ్యంతోనే ప్రతిపక్షాలపై దాడులు
– ఎమ్మెల్సీ కవితనూ అలాగే బెదిరిస్తున్నారు
– బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్‌
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
ఎమ్మెల్సీ కవితకు వచ్చింది ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) సమన్లు కాదనీ, అవి మోడీ సమన్లని భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్‌) వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, రాష్ట్ర మంత్రి కే తారకరామారావు ఎద్దేవా చేశారు. కేవలం రాజకీయ దురుద్దేశ్యంతోనే ప్రతిపక్షనాయకులపై నరేంద్రమోడీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం కేంద్ర దర్యాప్తు సంస్థలతో దాడులు చేయిస్తున్నదని విమర్శించారు. ఎమ్మెల్సీ కవిత న్యాయపోరాటానికి బీఆర్‌ఎస్‌ పూర్తి అండగా ఉంటుందని స్పష్టం చేశారు. ఇలాంటి బెదిరింపులకు బీఆర్‌ఎస్‌ నేతలు ఎవరూ భయపడబోరని తేల్చిచెప్పారు. గురువారంనాడాయన హైదరాబాద్‌లోని బీఆర్‌ఎస్‌ జాతీయ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఎమ్మెల్యేలకు ఎర కేసు విచారణలో బీజేపీ జాతీయ నేత బీఎల్‌ సంతోష్‌ ఎందుకు ముఖం చాటేశారని ప్రశ్నించారు. ఎన్ని అవినీతి ఆరోపణలు వచ్చినా, బీజేపీలో చేరగానే పునీతులు ఎలా అవుతున్నారంటూ సీఎమ్‌ రమేష్‌, సుజనాచౌదరి తదితరుల కేసుల విచారణను ప్రస్తావించారు. కర్ణాటకలో అవినీతి డబ్బు కట్టలతో బీజేపీ ఎమ్మెల్యే కొడుకు పట్టుబడినా ఎందుకు చర్యలు తీసుకోలేకపోతున్నారన్నారు. అదానీ వ్యవహారంతో ఎల్‌ఐసీ, ఎస్‌బీఐ వంటి సంస్థలు వేలకోట్లు నష్టపోతే ప్రధాని నరేంద్రమోడీ ఎందుకు స్పందించరని ప్రశ్నించారు. బీఆర్‌ఎస్‌కు చెందిన 12 మంది ప్రజాప్రతినిధులపై మోడీ నేతృత్వంలోని ఈడీ, సీబీఐ, ఐటీ శాఖలు దాడులు చేశాయని చెప్పారు. డబుల్‌ ఇంజిన్‌ సర్కార్‌ అంటే ఒకటి మోడీ.. మరొకటి అదానీ అని ఎద్దేవా చేశారు. మోడీ, ఈడీ దాడుల్ని ప్రజాకోర్టులో ఎదుర్కొంటామన్నారు. దేశంలో బీజేపీ నేతలపై నమోదు చేసిన కేసులను ఈడీ, సీబీఐ, ఐటీ శాఖలు చూపించగలవా? అని ప్రశ్నించారు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ప్రతిపక్షాలపై కేసులతో, ప్రజలపై ధరలతో దాడి చేస్తున్నదనీ, పారిశ్రామిక వేత్త గౌతమ్‌ అదానీ, మోడీ చీకటి స్నేహం గురించి అందరికీ తెలుసన్నారు. ముంద్రా పోర్టులో రూ.21వేల కోట్ల డ్రగ్స్‌ దొరికినా అదానీపై ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. అదానీపై శ్రీలంక చేసిన ఆరోపణల్లో నిజం లేదని ప్రజలకు ఎందుకు చెప్పలేకపోతున్నారన్నారు. మోడీకి బినామీగా అదానీ చేస్తున్న వ్యాపారాలకు మోడీ మార్కెటింగ్‌ ఏజెంట్‌గా పనిచేస్తున్నారని ఆరోపించారు. బీబీసీ వంటి అంతర్జాతీయ మీడియా సంస్థల మీద దాడులు చేయడం ద్వారా తమకు అనుకూలంగా లేకుంటే జరిగే పరిణామాలపై హెచ్చరికలు జారీ చేశారని చెప్పారు. మోడీ తొమ్మిదేండ్లలో ప్రతిపక్షాలపై 5,422 కేసులు పెట్టించారనీ, వాటిలో కేవలం 23 కేసుల్లో మాత్రమే తీర్పు వచ్చిందని తెలిపారు.
మీడియాను మాఫియా నడిపిస్తోంది
మాఫియాను నడిపించినట్టే మీడియానూ నడిపిస్తున్నారని కే తారకరామారావు అన్నారు. జర్నలిస్టులు, మీడియా సంస్థలంటే తమకు గౌరవం ఉందనీ, కానీ మీడియా యాజమాన్యాల గొంతు నులిమి పట్టుకుని ఈడీ, సీబీఐ కేసులు పెడుతుంటే వారు మాత్రం ఏం చేస్తారన్నారు. మద్య నిషేధం ఉన్న గుజరాత్‌లో లిక్కర్‌ తాగి 42 మంది చనిపోతే ఎన్ని పత్రికలు రాసాయని ఓ మీడియా సంస్థను ఉద్దేశించి అడిగారు. ”మీరు ఏం మాట్లాడుతారో, ఏం చూపెడుతారో, ఏం డ్రామాలో చేస్తారో తెలుసు. మిమ్మల్ని ఎప్పుడు బ్యాన్‌ చేయాలో కూడా మాకు తెలుసు” అని ఆ సంస్థ ప్రతినిధిని ఉద్దేశించి అన్నారు. రాష్ట్రంలో బీజేపీ మౌత్‌ పీసెస్‌గా ఉన్న చిల్లర సంస్థలను కచ్చితంగా ప్రజల ముందు ఎండగడుతామని హెచ్చరించారు.

Spread the love