జూన్ వచ్చేసింది. రెండో వారం కూడా దాటిపోతోంది. ఈ క్రమంలో ‘కేరళను తాకిన రుతు పవనాలు.. మరో రెండు రోజుల్లో విస్తారంగా వర్షాలు…’ అంటూ పేపర్లలో ఒకటే వార్తలు. టీవీలు, యూ ట్యూబుల్లో వీడియోల మీద వీడియోలు. మొన్నటిదాకా 46, 47 డిగ్రీల ఎండతో ఇస్సో.. అస్సో అనుకుంటూ వేడిమి, ఉక్కపోతతో సతమతమైపోయిన మనందరికీ ‘రుతు పవనాల రాక’ వార్త ఉపశమనం, అంతకు మించిన సంతోషం కలిగించేదే. హమ్మయ్య… ఈ ఏడాది ఎండల నుంచి బయటపడ్డాం, బతికి బట్టకట్టాం అనుకునే పెద్దవారు,వృద్ధులు సైతం లేకపోలేదు. వారందరూ ఇలా సంతోషపడుతున్న తరుణంలో… ఇద్దరు మాత్రం తెగ గుబులు, అంతకుమించిన ఆందోళన చెందుతున్నారు. వారెవరంటారా..? ఒకటి బడికి పోవాల్సిన బుడతలు.. రెండోది వారిని బడికి పంపాల్సిన తల్లిదండ్రులు. ‘మే నెల ఆసాంతం అమ్మమ్మ, నాయనమ్మ, తాతల ఇండ్ల దగ్గర, ప్రశాంతమైన పల్లెటూళ్లలో హాయిగా ఆటపాటలతో గడిపిన మాకు మళ్లీ ఈ బడి గోలేంట్రా బాబూ…’ అనుకూంటూ పోరలు బాధపడుతున్నారు. మళ్లీ టైలు, షూలు, పుస్తకాలు, బ్యాగులు అంటూ, రోజూ వాటిని మోసుకుంటూ పోయి పంజరంలో చిలకల్లా ఉండాల్సొస్తున్నందుకు భావి భారత పౌరులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వారి పరిస్థితి ఈ విధంగా ఉంటే… జూన్ వచ్చేసిందంటే పుస్తకాలు, బ్యాగుల కొనుగోలు, స్కూల్, ట్యూషన్ ఫీజుల మోత మోగిపోతోందంటూ తల్లిదండ్రులు గుబులు చెందుతున్నారు. వేల రూపాయలు, లక్షలకు లక్షలు ఫీజులు చెల్లించాల్సి రావటంతో… ఏం చేయాలో పాలు పోక వారు దిక్కులు చూస్తున్నారు.ఈ రకంగా జూన్ నెల ఇటు బుడతలకు, అటు తల్లిదండ్రులకు చుక్కలు చూపిస్తోంది. ఎంతలా అంటే మే నెలలో ఉండే మండు వేసవి కంటే ఎక్కువగా… -బి.వి.యన్.పద్మరాజు