పోరాడారు..సాధించారు..

Fought..Achieved..– 30 నెలల పాటు ఫీల్డ్‌ అసిస్టెంట్ల అలుపెరుగని పోరు
–  ప్రతిపక్షాలు, ట్రేడ్‌ యూనియన్ల మద్దతుతో ముందుకు
–  బిచ్చమెత్తి సర్కారు కండ్లు తెరిపించిన వైనం
–  పంచాయతీరాజ్‌ కమిషనరేట్‌ వద్ద మెరుపు ధర్నా
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
రాష్ట్రంలో ఉపాధి హామీ ఫీల్డు అసిస్టెంట్లు రెండున్నరేండ్ల పాటు అలుపెరుగని పోరాటం సాగించారు. ఆ పార్టీ..ఈపార్టీ అనే తేడా లేకుండా చట్టసభల్లో అనివార్యంగా సభ్యులందరి నోటా ‘అయ్యో పాపం..ఫీల్డ్‌ అసిస్టెంట్లకు అన్యాయం జరిగింది..’ అనిపించేలా సర్కారుపై ఒత్తిడి పెంచారు. అంతిమంగా ఉద్యోగంలో నుంచి తీసేసిన సర్కారే విధిలేక విధుల్లోకి తీసుకునేదాకా తమ పోరాట పటిమను ప్రదర్శించారు. అంతిమంగా విజయం సాధించారు. ‘పోరాడితే పోయేదేమీ లేదు..బానిస సంకెళ్లు తప్ప’ అన్న కారల్‌ మార్క్స్‌ పిలుపునకు సాకారతను చేకూర్చారు.
రాష్ట్రంలో 7,500 మందికిపైగా ఫీల్డు అసిస్టెంట్లున్నారు. వారంతా రెక్కాడితేగానీ డొక్కాడని కుటుంబాల నుంచి వచ్చినవారే. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ సామాజిక తరగతులకు చెందినవారే నూటికి 95 శాతానికిపైగా ఉన్నారు. ఉపాధి హామీ చట్టాన్ని క్షేత్రస్థాయిలో క్రమపద్ధతిలో అమలు చేయించడంలో కీలకపాత్ర వారిదే. అలాంటి వారిపై సర్కారు కన్నుపడింది. కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌లో కోతలు విధించడం, సకాలంలో కూలీలకు వేతనాలు చెల్లించకుండా ఇబ్బందిపెట్టడం, మరోవైపు కనీస సౌకర్యాలు కల్పించకపోవడం, కూలీరేట్లను పెంచకపోవడం లాంటి అనేక కారణాలతో కొంత మేర ఉపాధి పనులకు కూలీలు క్రమంగా దూరమవుతున్న పరిస్థితి గ్రామాల్లో నెలకొంది. దీంతో రాష్ట్రానికి మెటీరియల్‌ కాంపోనెంట్‌ కింద వచ్చే నిధులు తగ్గడం మొదలైంది. కూలీలు వెనుకపట్టు పట్టడానికి కారణం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలే అని స్పష్టమవుతున్నది. క్షేత్రస్థాయిలోనేమో ఫీల్డు అసిస్టెంట్లు సరిగా పనిచేయకపోవడం వల్లనే కూలీల సంఖ్య తగ్గుతుందనే ప్రచారాన్ని సర్కారు మొదలుపెట్టింది. ఓ సర్క్యూలర్‌ తీసుకొచ్చి కూలీల హాజరును బట్టి ఫీల్డు అసిస్టెంట్లను గ్రేడ్ల వారీగా విభజించి జీతాలిస్తామని మెలికపెట్టి కూర్చున్నది. దీంతో ఫీల్డు అసిస్టెంట్లు ఆగ్రహానికి గురయ్యారు. దీర్ఘకాలికంగా ఉన్న సమస్యలను పరిష్కరించాలనీ, సర్క్యూలర్‌ను ఎత్తేయాలని డిమాండ్‌ చేస్తూ 2020లో సమ్మెలోకి వెళ్లారు. అదే ఏడాది కరోనా నేపథ్యంలో వారు సమ్మె నుంచి వెనక్కి తగ్గారు. కానీ, రాష్ట్ర సర్కారు మాత్రం తనకు వ్యతిరేకంగా సమ్మె చేశారనే నెపంతో వారిని పీకిపారేసింది. దీంతో 30 నెలల పాటు ఫీల్డు అసిస్టెంట్లు తీవ్ర మానసిక ఆందోళనకు గురయ్యారు. 90మందికిపైగా తనువు చాలించారు. దీంతో పోరాడితే పోయేదేమీ లేదు బానిస సంకెళ్లు అన్నట్టుగా ఎఫ్‌ఏలు పెద్ద ఎత్తున పోరాటబాటపట్టారు. దాన్ని తొక్కిపెట్టేందుకు టీఆర్‌ఎస్‌కేవీ నాయకత్వం న్యాయం జరిగేలా చూస్తామని దగ్గరకు తీసుకుని కాలంవెళ్లబుచ్చింది. దీన్ని గమనించిన మెజార్టీ ఫీల్డు అసిస్టెంట్లు సీఐటీయూ వద్దకు చేరారు. ఆ తర్వాత సీఐటీయూ, జేఏసీ ఆధ్వర్యంలో తమ ఉద్యమాన్ని దశలవారీగా చేపట్టారు. సర్పంచి, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఎమ్మెల్యే, మంత్రులు, సీఎంలకు వినతిపత్రాల ద్వారా మొరపెట్టుకున్నారు. ఖమ్మం జిల్లాలో ఓ మహిళా ఫీల్డు అసిస్టెంట్‌ పల్లా రాజేశ్వర్‌రెడ్డి దగ్గర చీర చాపి అడుక్కోవడం అప్పట్లో పెద్ద చర్చనీయాంశం అయింది. హుజురాబాద్‌ ఉప ఎన్నికలో నామినేషన్లు సైతం వేశారు. ప్రతిపక్ష పార్టీలు కూడా వారి డిమాండ్‌లో న్యాయాన్ని గుర్తించి వారి పోరాటానికి మద్దతు తెలిపారు. సీఐటీయూ, జేఏసీ ఆధ్వర్యంలో ఫీల్డు అసిస్టెంట్లు హైదరాబాద్‌లో రెండు,మూడుసార్లు మెరుపు ధర్నాలు చేశారు. వారి సమస్యలను శాసనసభ, మండలిలో సీతక్క, అలుగుబెల్లి నర్సిరెడ్డి, జీవన్‌రెడ్డిలు లేవనెత్తారు. క్వశ్చన్‌ అవర్‌లోనూ అధికార, ప్రతిపక్ష పార్టీల సభ్యులు వారి సమస్యను పరిష్కరించాలని గళమెత్తారు. ఓవైపు రాష్ట్రంలో ఎన్నికలు దగ్గర పడుతుండటం, మరోవైపు రోజురోజుకీ వారి పోరాటం మరింత బలపడుతుండటంతో రాష్ట్ర ప్రభుత్వం అనివార్యంగా దిగివచ్చింది. సమ్మెలు చేస్తే ఉద్యోగాలను తొలిస్తానని బెదిరించిన సీఎం కేసీఆరే దగ్గరకు తీసి ఉద్యోగాల్లోకి తీసుకుంటున్నామని ప్రకటించారు. దీంతో 30 నెలల పాటు నిర్విరామంగా మొక్కవోని దీక్షతో ఫీల్డు అసిస్టెంట్లు సాధించిన పోరాటం విజయం సాధించింది.

Spread the love