– మోడీ, షా అందుకే జోక్యం చేసుకోలేదు
– మణిపూర్ హింసపై ఆ రాష్ట్ర మాజీ సీఎం ఇబోబి సింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు
న్యూఢిల్లీ : ఈశాన్య రాష్ట్రం మణిపూర్ హింస విషయంలో ప్రధాని మోడీ, కేంద్ర హౌం మంత్రి అమిత్ షాలపై ఆ రాష్ట్ర మాజీ సీఎం, కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఇబోబి సింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మోడీ, షా లకు రహస్య ఎజెండా ఉన్నదనీ, ఈ కారణంగానే వారు మణిపూర్ హింసపై జోక్యం చేసుకోలేదని చెప్పారు. దీంతో ఇబోబి సింగ్ వ్యాఖ్యలు రాజకీయంగా చర్చనీయాంశమయ్యాయి. ఒక ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ‘ఒకవేళ మణిపూర్ భారత్‌లో భాగం అనుకుంటే, అక్కడ సమస్య ఉంటే.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ బాధ్యత వహించాలి. జాతి హింసను వారు వెంటనే ఎందుకు ఆపలేదు. రహస్య అజెండా ఏమైనా ఉన్నదా?’ అని ఆయన ప్రశ్నించారు. ప్రముఖ రాజకీయ నాయకుడైన ఇబోబి సింగ్.. మణిపూర్ ముఖ్యమంత్రిగా 2002 నుంచి 2017 మధ్య పని చేశారు.
మణిపూర్‌లో హింసపై ప్రధాని మోడీ మౌనాన్ని ఇబోబి సింగ్ ప్రశ్నిస్తున్నారు. హింసపై రాష్ట్రంలో కాంగ్రెస్‌తో పాటు పది ప్రతిపక్ష పార్టీల నాయకుల బృందంతో మోడీని కలవడానికి ఆయన యత్నించారు. కానీ మోడీ మాత్రం ప్రతినిధి బృందం అభ్యర్థనను పరిగణలోకి తీసుకోకుండానే అమెరికా పర్యటనకు వెళ్లిన విషయం విదితమే. ‘ఆయన (మోడీ) ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రతి ఒక్కరూ ప్రశ్నిస్తున్నారు. 50 రోజులలో ఆయన ఏమీ మాట్లాడలేదు. సమస్యపై కలిసి మాట్లాడేందుకు ఎమ్మెల్యేలు, రాజకీయ పార్టీ సభ్యుల అభ్యర్థనను వినేందుకు ఆయన పది, పదిహేను నిమిషాలు కూడా కేటాయించలేదు. నేనే వారం పాటు ఎదురు చూశాను’ అని ఇబోబి సింగ్ అన్నారు.
ఎస్టీ హౌదాను కల్పించే అంశంపై మెయిటీ సామాజిక వర్గం డిమాండ్ చేస్తుండగా, కుకీ తెగ దీనిని వ్యతిరేకిస్తున్నది. ఈ విషయంపై గతనెల 3 నుంచి రాష్ట్రంలో అల్లర్లు కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ అల్లర్లలో రాష్ట్రంలో దాదాపు వంది మంది మరణించారు. 300 మందికి పైగా గాయాలపాలయ్యారు. 50 వేల మందికి పైగా ప్రజలు తమ ఇండ్లను విడిచి పెట్టాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి.