పోటీ చేసి తీరుతా..

– ఖమ్మం జిల్లా సరిహద్దులో మాజీ మంత్రి తుమ్మలకి ఘనస్వాగతం
– వెయ్యికి పైగా కార్లు..మరో వెయ్యి బైక్‌లతో భారీ ర్యాలీ
– కాంగ్రెస్‌ వైపేనంటున్న అనుచరులు…
– జై తుమ్మల… జై కాంగ్రెస్‌ అంటూ నినాదాలు
నవతెలంగాణ-ఖమ్మం
ప్రాంతీయ ప్రతినిధి/ కూసుమంచి
బీఆర్‌ఎస్‌ టిక్కెట్ల కేటాయింపులో భంగపడ్డ మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హైదరాబాద్‌ నుంచి తొలిసారి శుక్రవారం ఖమ్మం జిల్లా పర్యటనకు వచ్చారు. ఆయనకు జిల్లా సరిహద్దు కూసుమంచి మండలం నాయకన్‌గూడెం వద్ద ఘనస్వాగతం లభించింది. వేలాదిగా తుమ్మల అభిమానులు తరలివచ్చారు. వెయ్యికి పైగా కార్లు, మరో వెయ్యికి పైగా బైక్‌లతో ర్యాలీగా పాలేరు, కూసుమంచి, ఖమ్మం రూరల్‌ మండలం మద్దులపల్లి, వరంగల్‌ క్రాస్‌ రోడ్డు మీదుగా ఖమ్మం, వైరా, తల్లాడ, సత్తుపల్లి, మీదుగా తుమ్మల స్వగ్రామం దమ్మపేట మండలం గండుగులపల్లి వరకు ర్యాలీ సాగింది. దారిపొడవునా కార్యకర్తలు ‘జై తుమ్మల…జై కాంగ్రెస్‌…ఖమ్మం జిల్లా తుమ్మల అడ్డా…’ అంటూ నినాదాలు చేశారు.
ఓపెన్‌ టాప్‌ జీపు పైనుంచి దారిపొడవునా తుమ్మల అభివాదం చేస్తూ ముందుకు కదిలారు. ఖమ్మంలో విలేకరుల సమావేశంలో తుమ్మల మాట్లాడారు. ఏ పార్టీ అనేది స్పష్టం చేయకపోయినా కచ్చితంగా పోటీ చేస్తానని అన్నారు. తనకు పదవి అహంకారం…అలంకారం..ఆధిపత్యం కోసం కాదన్నారు. ప్రజలకు సేవ చేసేందుకేనని అన్నారు. నాగలి దున్నుకునే తనను మంత్రిని చేసిన ఖమ్మం జిల్లా ప్రజలకు రుణపడి ఉంటానన్నారు. అభిమానుల కోసమే తప్ప తనకు పాలిటిక్స్‌తో పనిలేదన్నారు. చివరిసారి శాసనసభలో అడుగుపెట్టి రాజకీయాల నుంచి వైదొలుగుదామని అనుకున్నానని తెలిపారు. తన రాజకీయ లక్ష్యాన్ని దెబ్బతీసేందుకు కొందరు పరాన్నబుక్కులు అడ్డుపడొచ్చు…జిల్లా ప్రజలు తనను గుండెల్లో పెట్టుకుని గెలిపిస్తారని చెప్పారు. తనను తప్పించామని కొందరు తాత్కాలిక శునకానందం పొందొచ్చని విమర్శించారు. ‘నేను ఎన్నోసార్లు కిందపడ్డా…మళ్లీ మీ చేతులతో లేపి నన్ను ఎక్కడో నిలబెట్టారు..’ అని అభిమానులను ఉద్దేశించి మాట్లాడారు. గోదావరి జలాలతో జిల్లా ప్రజల పాదాలు కడిగాక తాను రాజకీయ జీవితం నుంచి వైదొలుగుతానని చెప్పారు. తుమ్మల వల్ల ఈ ఉభయజిల్లాల్లో ఏ ఒక్కరూ తలవంచుకోవాల్సిన పరిస్థితి రాదన్నారు.
కాంగ్రెస్‌ వైపేనంటున్న అనుచరులు… నేడో రేపో నిర్ణయం
తుమ్మల ప్రధాన అనుచరులు మాట్లాడుతూ ‘ఆయన కాంగ్రెస్‌లోకి వెళ్తారు…పాలేరు లేదా ఖమ్మం నుంచి పోటీ చేస్తారు…ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా మేము ఆయన వెంటే ఉంటాం’ అని ప్రకటించారు. తన వర్గీయులతో చర్చించిన తర్వాత శని లేదా ఆదివారాల్లో తుమ్మల నాగేశ్వరరావు తుది నిర్ణయం తీసుకుంటారని విశ్వసనీయ సమాచారం. ఇప్పటికే పీసీసీ అధ్యక్షులు రేవంత్‌రెడ్డి ఆయనకు టచ్‌లోకి వచ్చారనే వార్తలు వినిపిస్తున్నాయి. కేంద్రమాజీ మంత్రి రేణుకాచౌదరి కూడా తుమ్మల రాకను స్వాగతించారు. మరోవైపు బీజేపీ కూడా గాలం వేస్తోంది. తమ పార్టీలోకి రావాలని బీజేపీ నేతలు ఈటల రాజేందర్‌, పొంగులేటి సుధాకర్‌రెడ్డి వేర్వేరు చోట్ల ప్రెస్‌మీట్లలో తుమ్మలను ఆహ్వానించారు. అయితే తుమ్మల అభిమానులు మాత్రం ఎట్టిపరిస్థితుల్లో బీజేపీలో చేరేది లేదని తెగేసి చెబుతున్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న తుమ్మలకు బీఆర్‌ఎస్‌ చేసిన భంగపాటు మరింతగా కుంగదీసినా…ఆయన కార్యకర్తల్లో మనోధైర్యం నింపేందుకు జిల్లాకు వచ్చారని అనుచరులు తెలిపారు. 40 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ చరిత్ర ఉన్న తమ నేత ఈ ఎన్నికలతో రాజకీయాల నుంచి వైదొలగాలనే నిర్ణయాన్ని కేసీఆర్‌ దృష్టికి తీసుకెళ్లినా టిక్కెట్‌ కేటాయించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

Spread the love