పసుపు లోడ్ లారీని ఎత్తుకెళ్లిన దొంగలు 

– జన్నేపల్లి వద్ద పట్టుకున్న పోలీసులు 
నవతెలంగాణ – కంఠేశ్వర్ 

రూ.50 లక్షల విలువైన పసుపు లోడ్ తీసుకెళ్తున్న లారీని గుర్తుతెలియని దుండగులు ఆర్టిఏ అధికారులు అని చెప్పి ఎత్తుకెళ్లారు. నవీపేట మండలం జన్నేపల్లి వద్ద గురువారం రాత్రి పోలీసులు పట్టుకున్నారు. ఒకటవ పోలీస్ స్టేషన్ ఎస్ హెచ్ ఓ విజయ్ బాబు తెలిపిన వివరాల ప్రకారం.. నిజామాబాద్ నగరం నుంచి రెండు రోజుల కిందట పసుపు లోడ్ తో లారీ గుంటూరు వెళ్లాల్సి ఉంది. అయితే ఈ క్రమంలో ఇందల్వాయి టోల్ ప్లాజా సమీపంలో కారులో వచ్చిన దుండగులు తాము ఆర్టీఏ అధికారులమని లారీని రోడ్డుపై ఆపవేశారు. డ్రైవర్ కు ఆనుమానం రాకుండా మత్తు ఇచ్చిట్లు తెలుస్తోంది. డ్రైవరు స్పృహ కోల్పోవడంతో అతడిని కిందకు దించారు. ఆ తర్వాత లారీని  నిజామాబాద్ కు తీసుకువచ్చి పలు చోట్ల గురువారం పసుపు విక్రయించారు. తర్వాత జన్నేపల్లికి లారీని తీసుకొని వెళ్లారు. ఎప్పుడైతే టోల్ ప్లాజా దగ్గర లారీని దొంగలు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. అప్పటినుండి జిపిఎస్ ట్రాకింగ్ ఆధారంగా ఎటు వెళ్తుందో పోలీసులు తెలుసుకున్నారు. లారీలోని సంచులను ఇతర వాహనాల్లోకి మార్చి అమ్ముకోవాలని నిర్ణయించుకున్నారు. నవీపేటకు చెందిన ఓ వ్యక్తి మూడు వాహనాలను తీసుకుని జన్నేపల్లి వెళ్లాడు. అక్కడ లోడ్ నింపుతుండగా చూసి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో నిజామాబాద్ వన్ టౌన్ పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. పోలీసులు రావడంతో డ్రైవర్ లారీని అక్కడే వదిలేసి పారిపోయారు. కిరాయి కోసం వెళ్లిన వాహన డ్రైవర్లను పోలీసులు పట్టుకుని విచారణ చేస్తున్నారు. పంట విలువ రూ.50 లక్షలు ఉంటుందని అంచనా వేశారు. నిజామాబాద్ ఒకటో ఠాణాలో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Spread the love