రూ. 25 కోట్ల విలువైన ఆభరణాలు ఎత్తుకెళ్లిన దొంగలు..

నవతెలంగాణ-హైదరాబాద్ : దేశ రాజధాని ఢిల్లీలో భారీ చోరీ జరిగింది. ఓ నగల దుకాణం నుంచి సుమారు రూ. 25 కోట్ల విలువైన ఆభరణాలను దొంగిలించారు. పక్కాప్రణాళికతో దొంగలు దోపిడీకి పాల్పడ్డారు. ఢిల్లీలోని భోగాల్‌ ప్రాంతంలో ఉమ్రావ్‌ జ్యూయలరీ దుకాణం ఉంది. ఎప్పటిలానే ఆదివారం పనివేళలు ముగిసిన తర్వాత సిబ్బంది దుకాణానికి తాళాలు వేశారు. ప్రతి సోమవారం సెలవు కావడంతో మంగళవారం ఉదయం షాపు తెరిచిన సిబ్బంది, చోరీ జరిగినట్లు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. నాలుగు అంతస్థుల భవనంలో ఈ దుకాణం నిర్వహిస్తున్నారు. దోపిడీకి పాల్పడే సమయంలో సీసీటీవీ కెమెరాలను డిస్‌కనెక్ట్ చేసిన దొంగలు.. భవనంపై భాగం నుంచి షాపులోకి ప్రవేశించి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. అనంతరం గ్రౌండ్‌ ఫ్లోర్‌లో ఉన్న స్ట్రాంగ్‌ రూమ్‌కు డ్రిల్లింగ్‌ మెషిన్‌తో రంధ్రం చేసి నగలు చోరీ చేసి ఉంటారని ప్రాథమిక నిర్థారణకు వచ్చినట్లు పోలీసు అధికారి ఒకరు తెలిపారు. స్ట్రాంగ్‌రూమ్‌లో ఉన్న నగలతోపాటు, షోరూమ్‌లో ప్రదర్శనకు ఉంచిన ఆభరణాలను కూడా చోరీ చేసినట్లు గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Spread the love