నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
బీఆర్‌ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి, ఆయన కోడలు రంగారెడ్డి జిల్లా జెడ్పీ చైర్ పర్సన్ అనితారెడ్డి కారు దిగనున్నారు. బీఆర్‌ఎస్‌పై తీవ్ర అసంతృప్తితో ఉన్న తీగల కాంగ్రెస్‌లో చేరుతారనే ప్రచారం కొద్దికాలంగా జరుగుతున్నది. మంగళవారం హైదరాబాద్ కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి మాణిక్‌రావు ఠాక్రే, టీపీసీసీ అధ్యక్షులు ఎనుముల రేవంత్‌రెడ్డితో తీగల భేటీ అయినట్టు సమాచారం. త్వరలో ఆయన, తమ కుటుంబ సభ్యులతో కలిసి కాంగ్రెస్ గూటికి చేరనున్నారని తెలిసింది. గత స్థానిక సంస్థల ఎన్నికల్లో తీగల కష్ణారెడ్డి కోడలు అనితారెడ్డి మహేశ్వరం జడ్పీటీసీగా గెలిచి రంగారెడ్డి జిల్లా పరిషత్ ఛైర్‌పర్సన్ అయ్యారు. మంత్రి సబితా ఇంద్రారెడ్డి, తీగల కష్ణారెడ్డి ఇద్దరూ బీఆర్‌ఎస్ తరుపున మహేశ్వరం నియోజకవర్గం నుంచే ఉండటంతో వీరి మధ్య ఆధిపత్య పోరు నెలకొంది. ఈ క్రమంలో పార్టీలో తనకు ప్రాధాన్యత తగ్గుతూ వస్తోందని తీగల అసంతృప్తి వ్యక్తం చేశారు. రానున్న ఎన్నికల్లో బీఆర్‌ఎస్ నుంచి టికెట్ వస్తుందో, లేదో అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.