హయత్‌నగర్ రాజేశ్ మృతి కేసులో వెలుగులోకి విస్తుపోయే విషయాలు

నవతెలంగాణ – హైదరాబాద్
హయత్‌నగర్ సమీపంలోని కుంట్లూరులో ఇటీవల కుళ్లిన స్థితిలో కనిపించిన రాజేశ్ మృతి కేసులో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఒకే ఒక్క మిస్డ్‌కాల్ రెండు నిండు ప్రాణాలను బలితీసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. హయత్‌నగర్‌కు చెందిన ఓ ప్రభుత్వ ఉపాధ్యాయురాలు (45)కి, బీటెక్ పూర్తిచేసి దిల్‌సుఖ్‌నగర్ చైతన్యపురి కాలనీలోని ఓ హాస్టల్‌లో ఉంటున్న ములుగు జిల్లా పంచోత్కులపల్లికి చెందిన రాజేశ్ (25)కు ఏడాదిన్నర క్రితం మిస్డ్‌కాల్ ద్వారా పరిచయం ఏర్పడింది.
వివాహం కాలేదని నమ్మిస్తూ..
ఆ స్నేహం క్రమంగా పెరిగి ఇద్దరి మధ్య చాటింగుల వరకు వెళ్లింది. అది కాస్తా ఇద్దరి మధ్య ప్రేమకు దారితీసింది. ఉపాధ్యాయురాలికి అప్పటికే వివాహమై ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయితే, తనకు వివాహం కాలేదని చెబుతూ అతడిని నమ్మించింది. ఇద్దరూ కలిసి ఉమ్మడి నల్గొండ జిల్లాలోని పలు ప్రాంతాల్లో కారులో తిరిగారు. దీంతో ఆమెను పెండ్లి చేసుకోవాలని రాజేశ్ నిర్ణయించుకున్నాడు. అయితే, ఆమెకు వివాహమై ఇద్దరు పిల్లలు కూడా ఉన్నట్టు తెలియడంతో రాజేశ్ ఆమెను రెండు నెలలుగా దూరం పెడుతూ వచ్చాడు. దీంతో మనస్తాపానికి గురైన ఆమె నువ్వు లేకుండా తాను బతకలేనంటూ రాజేశ్‌కు పలుమార్లు వాట్సాప్ మెసేజీలు పంపింది. ఈ క్రమంలో ఈ నెల 24న పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించింది. గమనించిన కుటుంబ సభ్యులు ఆమెను ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ సోమవారం ప్రాణాలు విడిచింది. ఈ క్రమంలో తన తల్లి ఫోన్‌ను తీసుకుని పరిశీలించిన ఉపాధ్యాయురాలి కొడుకు రాజేశ్‌తో తన తల్లి జరిపిన చాటింగులను చూసి ఆమె ఆత్మహత్యకు అతడే కారణమని నిర్ధారణకు వచ్చాడు. తన తల్లిలానే అతడికి మెసేజ్‌లు చేస్తూ కుంట్లూరులోని పలానా టీస్టాల్ వద్ద కలుద్దామని కోరాడు. నిజమేనని నమ్మిన రాజేశ్ అక్కడకు వచ్చాడు. ఈలోపు తన ఇద్దరి స్నేహితులతో కలిసి వచ్చిన ఉపాధ్యాయురాలి కుమారుడు రాజేశ్‌ను పట్టుకుని డాక్టర్స్ కాలనీలోని నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లాడు.
తన తల్లి ఆత్మహత్యాయత్నానికి నువ్వే కారణమంటూ దాడి చేసి, ఇకపై దూరంగా ఉండాలని హెచ్చరించి వదిలేశాడు. దీంతో మనస్తాపానికి గురైన రాజేశ్ పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. ఆ తర్వాత అక్కడే కాలకృత్యాలు తీర్చుకుంటూ మృతి చెందాడు. శరీరంలోని లోపలి భాగాల్లో ఎక్కడా గాయాలైనట్టు, రక్తస్రావమైనట్టు ఆనవాళ్లు కనిపించలేదని పోస్టుమార్టం రిపోర్టులో తేలినట్టు సమాచారం. పొట్టలోని స్రావాలను ఫోరెన్సిక్ ల్యబ్‌కు పంపినట్టు పోలీసులు తెలిపారు. పోస్టుమార్టం అనంతరం నిన్న మధ్యాహ్నమే రాజేశ్ మృతదేహాన్ని అతడి కుటుంబ సభ్యులకు అప్పగించారు.

Spread the love