దాహం.. దాహం.. నందికొండలో తాగునీటి కష్టాలు

– రోజులు గడుస్తున్న తీరని తాగునీటి కష్టాలు
– నీటి సమస్యను పరిష్కరించాలని వేడుకోలు
– ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా
– పట్టించుకోని అధికారులు, పాలకులు
నవతెలంగాణ- నాగార్జునసాగర్
వేసవి కాలం వచ్చిందంటే చాలు చాలా ప్రాంతాలలో మంచినీటి కోసం ఏకంగా యుద్దాలు చేయాల్సిన పరిస్థితి. బిందెడు నీటి కోసం గంటల తరబడి ట్యాంకర్ల కోసం ఎదురుచూసి, అడ్డొచ్చిన వారిని పక్కకు తోసి ఇలా మంచినీటి కోసం మహా నీటి యజ్ఞమే చేయాల్సి వస్తోంది. నందికొండ మున్సిపాలిటీ లోని కాలనీల్లో వేసవి వచ్చిందంటే చాలు తాగునీటి కష్టాలు వర్ణనాతీతం. నందికొండలోని కాలనీలకు మంచినీరు సరఫరా చేసే  మోటర్లు కాలిపోవడంతో వారం రోజులుగా మంచి నీరు రాక స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోజులు గడుస్తున్న తాగునీటి కష్టాలు రోజు రోజుకు మరింతగా పెరుగుతున్నాయి. సరైన నీటి సరఫరా లేక త్రాగేందుకు గుక్కెడు నీరు లేక కాలనీవాసులు విలవిల్లాడుతున్నారు. నాగార్జునసాగర్‌లో ఉన్న కాలనీలోని ఇళ్లకు కనీసం తాగునీరు సరఫరా చేయకుండా కిలో మీటర్ల దూరంలో ఉన్న హైదరాబాద్‌కు తాగునీటి కోసం కోట్లాది రూపాయలు వెచ్చించి నీటిని తరలిస్తున్నారని వాపోయారు. ఎన్నోసార్లు అధికారులకు విన్నవించుకున్న ఫలితం లేకుండా పోయిందని  ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల్లో ఏ కష్టాలు వచ్చినా ఎలాంటి ఇబ్బందులు కలిగిన వెంటనే తమ దృష్టికి తెస్తే పరిష్కారం చేస్తామని తప్పుడు సలహాలు ఇవ్వడం తప్ప చేసిందేమీలేదన్నారు. వారం రోజుల నుంచి మంచినీటి కష్టాలతో కన్నీరు కారుస్తున్న దయ తలిచే వారు లేరంటూ ఆవేద వ్యక్తం చేస్తున్నారు. పైలాన్ కాలనీలోని 8వ వార్డులోని ఎండి టైపులో త్రాగునీటి సమస్య అధికంగా ఉండటంతో వాటర్ ట్యాంకర్ ద్వారా స్థానిక కౌన్సిలర్ అన్నపూర్ణ ప్రజల కష్టాలను తిరుస్తున్నారు. నీటి సమస్య అధికంగా ఉండటం వలన స్థానికులు అందరూ ట్యాంక్ దగ్గరికి వచ్చి నీటిని పట్టుకోవాల్సి వస్తోంది. దీంతో తమ అవసరానికి సరిపోయేలా నీరు దొరుకుతుందో లేదోనని పోటీ పడి మరీ నీటిని సొంతం చేసుకుంటారు. ఈ నీటి కోసం వీరు పడే కష్టం ఓ యుద్ధమే తలపిస్తుంది. అరుపులు, కేకలతో ఆ ప్రాంతమంతా మార్మోగుతుంది. ఇప్పటికైనా అధికారులు పాలకులు స్పందించి నీటి కష్టాలను తీర్చాలని స్థానిక ప్రజలు కోరుకుంటున్నారు. ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేస్తున్నాం.. అన్నపూర్ణ, కౌన్సిలర్ నీటి సరఫరా చేసే మోటర్లు మరమ్మత్తులు గురికావడంతో 8,10వ వార్డులలో తాగునీటి సమస్యలు నెలకొన్నాయని వార్డు ప్రజల అవసరాలకు అనుగుణంగా మున్సిపాలిటీ ట్యాంకర్ ప్రయివేట్ ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నాం.
Spread the love