నవతెలంగాణ – హైదరాబాద్: చిరంజీవిని కేంద్ర ప్రభుత్వం దేశ రెండో అత్యున్నత పౌరపురస్కారం పద్మవిభూషణ్‌కు ఎంపిక చేసింది. ఈ సందర్భంగా చిరంజీవి తన సంతోషాన్ని సందేశం రూపంలో అందరితో షేర్ చేసుకున్నారు. పద్మవిభూషణ్ వచ్చిందని తెలిసిన క్షణం నుంచి ఏం మాట్లాడాలో, ఎలా స్పందించాలో తెలియని పరిస్థితి. మన దేశంలో రెండో అత్యున్నత పౌర పురస్కారం లభించినందుకు చాలా ఆనందంగా ఉంది. ఒక తల్లి కడుపున పుట్టకపోయినా నన్ను సొంతమనిషిగా, మీ అన్నయ్యగా, మీ బిడ్డగా భావించే కోట్లాదిమంది ప్రజల ఆశీస్సులు, నా సినీ కుటుంబం అండదండలు, నీడలా నాతో ప్రతీ నిమిషం నడిచే లక్షలాది మంది అభిమానుల ప్రేమ, ఆదరణ కారణంగానే ఈ రోజు నేను ఈ స్థితిలో ఉన్నా. నాకు దక్కిన ఈ గౌరవం మీది.. నన్ను ఈ ప్రతిష్టాత్మక పద్మవిభూషణ్ అవార్డుకు ఎంపిక చేసిన భారత ప్రభుత్వానికి, ప్రధాని నరేంద్రమోదీగారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు.. అంటూ సుదీర్థ సందేశాన్ని పంచుకున్నారు. ఇప్పుడీ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. సినిమాలతో కోట్లాదిమంది అభిమానులకు వినోదాన్ని పంచుతూనే.. మరోవైపు సామాజిక సేవలో తన వంతు పాత్ర పోషిస్తున్న చిరంజీవికి కేంద్రప్రభుత్వం (అప్పటి) 2006లో పద్మభూషణ్ ప్రదానం చేసిన విషయం తెలిసిందే.