నవతెలంగాణ – ఢిల్లీ: ఢిల్లీలోని రాజిందర్ నగర్‌లో ఉన్న ఓ కోచింగ్ సెంటర్‌లోకి వరద పోటెత్తి సివిల్స్‌కు సన్నద్ధమవుతున్న ముగ్గురు విద్యార్థులు మృతిచెందారు. ఈ నేపథ్యంలో లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ స్పందిస్తూ.. పేలవమైన భవన నిర్మాణ ప్రణాళిక, భద్రతలేని నిర్మాణం, ప్రభుత్వ సంస్థల బాధ్యతారాహిత్యానికి సామాన్య ప్రజలు మూల్యం చెల్లించాల్సి వస్తోందని అన్నారు. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని తెలిపారు. ఈ ఘటన వ్యవస్థల సంయుక్త వైఫల్యం. అసురక్షిత నిర్మాణం, పేలవమైన భవన నిర్మాణ ప్రణాళిక, సంస్థల బాధ్యతారాహిత్యం వల్ల సామాన్య పౌరులు తమ ప్రాణాలను పోగొట్టుకుంటున్నారు. సురక్షితమైన, సౌకర్యవంతమైన జీవితం ప్రతీ పౌరుడి హక్కు. దాన్ని అందించడం ప్రభుత్వాల బాధ్యత’’ అని రాహుల్ ‘ఎక్స్’ ఖాతాలో రాసుకొచ్చారు. కాగా ఢిల్లీ పోలీసులు ఆదివారం కోచింగ్ సెంటర్ యజమాని, సమన్వయకర్తను అదుపులోకి తీసుకున్నారు.