ఇది యుద్ధ నేరమే!

– ఉక్రెయిన్‌కు అమెరికా క్లస్టర్‌ బాంబుల సరఫరాపై పుతిన్‌
మాస్కో: ఉక్రెయిన్‌కు అమెరికా క్లస్టర్‌ బాంబులను సరఫరా చేయడం యుద్ధ నేరమేనని రష్యా అధ్యక్షుడు వ్లదిమిర్‌ పుతిన్‌ అన్నారు. ఇందుకు ప్రతీకారం తీర్చుకునే హక్కు రష్యాకు ఉంటుందని హెచ్చరించారు. ఆదివారం ఆయన జర్నలిస్టు జరుబిన్‌తో మాట్లాడుతూ, క్లస్టర్‌ బాంబులు ఎంతో మంది అమాయకుల ప్రాణాలను బలిగొన్నాయి. ఇప్పటికీ బలిగొంటున్నాయి. అందువల్లే ఈ ఆయుధాల వినియోగాన్ని, సరఫరాను నిషేధిస్తూ తెచ్చిన ఒడంబడికను వందకుపైగా దేశాలు ఆమోదించాయి. అమెరికా ఇప్పుడు వీటిని ఉక్రెయిన్‌కు అందించడాన్ని యుద్ధ నేరంగానే పరిగణిస్తున్నామని ఆయన అన్నారు. మా దగ్గర కూడా క్లస్టర్‌ ఆయుధాలు ఉన్నాయి. ఇప్పటివరకు మేము వాటిని వినియోగించలేదు. ఉక్రెయిన్‌ గనుక ఈ ఆయుధాలను ప్రయోగిస్తే అందుకు ప్రతీకారం తప్పదని పుతిన్‌ హెచ్చరించారు.
అమెరికా తనను తాను దిగజార్చుకుంటోంది: ఎలాన్‌ మస్క్‌
విస్తృతంగా నిషేధించిన క్లస్టర్‌ బాంబులను ఉక్రెయిన్‌కు సరఫరా చేయడం ద్వారా అమెరికా తనను తాను దిగజార్చుకుంటోందని టెస్లా, స్పేస్‌ ఎక్స్‌ సిఇవో ఎలాన్‌ మస్క్‌ పేర్కొన్నారు. ఆయన ట్విట్టర్‌లో ట్వీట్‌ చేస్తూ, ‘ఉక్రెయిన్‌కు పంపడానికి మా దగ్గర మందుగుండు సామగ్రి అయిపోయింది.కాబట్టి నిరాశతో క్లస్టర్‌ బాంబులను వారికి పంపుతున్నాము’ అని అమెరికా ఈ చర్య ద్వారా తెలిపినట్లైందని అన్నారు. క్లస్టర్‌ ఆయుధాల సరఫరా చేయాలన్న బైడెన్‌ ప్రభుత్వ నిర్ణయాన్నిఅమెరికన్‌ కాంగ్రెస్‌లోని 98 మంది రిపబ్లికన్లు, 49 మంది డెమొక్రాట్లు వ్యతిరేకించడాన్ని మస్క్‌ ప్రశంసించారు. అయినా, ప్రభుత్వం తన వైఖరిని మార్చుకోకపోవడం అమెరికాకే అవమానం అని ఆయన వ్యాఖ్యానించారు. అమెరికా చర్యను బ్రిటన్‌, జర్మనీతో సహా దాని మిత్రదేశాలు తీవ్రంగా వ్యతిరేకించాయి.

Spread the love