ఇదేం తద్దినం!

వాడెవడో ఫేస్‌బుక్‌లో తల్లి తద్దినం ఫొటోలు పెడితే, అది చూసిన వ్యూవర్స్‌ ‘తద్దినం శుభాకాంక్షలు…మీ ఇల్లు ఎప్పుడూ ఇలా తద్దినాలతో కళకళలాడుతూ ఉండాలి…ఈ కార్యక్రమం వెరైటీగా ఉంది..మా ఇంట్లో మేమూ, మా పిల్లలం కలిసి ఇలాగే తద్దినం ఫంక్షన్‌ చేసుకుంటాం. ఏమేం కావాలో…ఎలా పెట్టాలో కాస్త చెప్పండి” అంటూ కామెంట్స్‌ పెట్టారట! వాళ్లేం మంత్రుల పీఆర్వోలో… శుభానికి, అశుభానికి తేడా లేకుండా రెంటినీ సమంగానే చూస్తున్నారు. తెలంగాణ అమరవీరుల జ్యోతిని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆవిష్కరించిన విషయం తెలిసిందే. ఇక ఆరోజు ఆ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రుల పీఆర్వోలు తమ సారు దగ్గర మార్కులు కొట్టేయాలనే అత్యుత్సాహంతో అమరవీరుల జ్యోతి ప్రారంభోత్సవ కార్యక్రమంలో మా మంత్రి పాల్గొని ఇట్టన్నాడు…అట్టన్నాడు… అంటూ పెద్దాయన దృష్టిలో పడేంతగా తమ కలాలకు పనిచెప్పారు. తప్పులేదు…వాళ్ల పని వాళ్లు చేశారు. చిక్కంతా ‘ప్రారంభోత్సవం’ తోనే వచ్చింది. అమరులంటే మరణించిన వాళ్లు…వాళ్ల జ్ఞాపకార్థం జ్యోతిని వెలిగిస్తే అది ‘ఉత్సవం’ ఎలా అవుతుందిరా సామీ? వాట్సాప్పుల్లో ఆ మెసేజ్‌లు చూసిన జర్నలిస్టులకు మతిపోయింది. తెలిసీ తెలీక కొన్ని పత్రికల్లో దాన్ని ఉత్సవం అనే రాసేశారు. బహుశా ‘చావు కూడా పెండ్లిలాంటిదే బ్రదరూ…’అని గట్టిగానే నమ్మించేసి నట్టున్నారు మహానుభావులు!!
-ఎస్‌ఎస్‌ఆర్‌ శాస్త్రి

 

Spread the love