ఇది… ముమ్మాటికీ వివక్షే…

రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక పథకాల్లో ఒకటి దళిత బంధు. దాంతోపాటు ఇటీవల ప్రవేశపెట్టిన ‘బీసీలకు ఆర్థిక సాయం’ కూడా అంతే ప్రతిష్టాత్మకమైందంటూ ప్రభుత్వ పెద్దలు చెబుతున్నారు. ఇవి రెండూ ఎస్సీలు, బీసీల ఆర్థిక ఎదుగుదలకు ఉపయోగపడతాయంటూ బీఆర్‌ఎస్‌ సర్కార్‌ చెబుతూ వస్తున్నది. తద్వారా సామాజికంగానూ వారిని సమ్మున్నత స్థాయిలో నిలబెడతామంటూ అది ప్రకటించింది. ఇక్కడ సామాజిక ఎదుగుదల అంటే ఏమిటనే ప్రశ్న ఉత్పన్నంగాక మానదు. ఇతర కులాలు, వర్గాలతో వారిని సమానంగా చూడటం, మెరుగైన జీవన ప్రమాణాలతో వారిని, వారి పిల్లలను విద్య, ఉపాధి, ఉద్యోగ రంగాల్లో పైకి తీసుకు రావటమే సామాజిక ఎదుగుదల.
నిశితంగా పరిశీలిస్తే అలాంటి ఎదుగుదలకు అవసరమైన చర్యలను చేపట్టే చిత్తశుద్ధి ప్రభుత్వానికి లేదని నిర్మొహమాటంగా చెప్పొచ్చు. రాష్ట్రంలోని గ్రామ పంచాయతీ కార్మికుల జీవన స్థితిగతులే ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ. వారి సమస్యల పట్ల సర్కారుకు చీమకుట్టినట్టయినా లేదు. వీటిపై అనేకసార్లు విజ్ఞాపన పత్రాలు సమర్పించినా, పాదయాత్రలు చేసినా… ఆఖరుకు సమ్మె నోటీసును అందజేసినా… ‘ఏం చేసుకుంటారో చేసుకోపోండి…’ అన్నట్టుగానే ప్రభుత్వం వ్యవహరించింది తప్ప వారి గోడును పట్టించుకున్న పాపాన పోలేదు. ఇది ఉద్దేశపూర్వక నిర్లక్ష్యమే కాదు… ముమ్మాటికీ వివక్ష అని కూడా చెప్పక తప్పదు. ఎందుకంటే పంచాయతీ కార్మికుల్లో అత్యధిక మంది దళితులే. కొన్నిచోట్ల బీసీలు, ఇతర కులాల వారు కూడా ఉండొచ్చు. ఈ క్రమంలో తెలంగాణలో అత్యధికంగా ఉన్న వీరి పట్ల పాలకవర్గాల స్వభావానికి ఈ వివక్షే దృష్టాంతమని చెప్పక తప్పదు.
అయినా పంచాయతీ కార్మికులు అడుగుతున్నది సాధారణ అంశాలే తప్ప గొంతెమ్మ కోర్కెలు కానే కాదు. మల్టీ పర్సస్‌ విధానాన్ని తీసుకురావటం ద్వారా తమ ఉద్యోగ భద్రతకు సంబంధించి ఒక ప్రమాదకరమైన అంశాన్ని జీఓ నెం.51 రూపంలో తీసుకురావటాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారు. పంచాయతీ పరిధిలో గతంలో తమకు కేటాయించిన ఒక పనికాకుండా నాలుగైదు రకాల పనులు చేయాల్సి రావటం వారికి కత్తి మీద సాముగా మారింది. దాంతో మోరీలు తీసేవాడు.. కరెంటు పోలెక్కి ప్రాణాలు కోల్పోతున్న దుస్థితి అనేక ఊర్లలో కనబడుతున్నది. మరోవైపు వారి వేతనాల విషయంలో దుర్మార్గమైన చర్యకు సర్కారు పాల్పడటం అత్యంత శోచనీయం. 2011 జనాభా లెక్కల ప్రకారం ప్రతీ ఐదొందల మందికి ఒక కార్మికుణ్ని నియమించిన సర్కారు 14 ఏండ్ల తర్వాత ఇప్పుడు పెరిగిన జనాభాకు అనుగుణంగా ఆ కార్మికుల సంఖ్యను పెంచింది. అదే సమయంలో పెరిగిన కార్మికుల సంఖ్యకు అనుగుణంగా వేతనాలు ఇవ్వకుండా చోద్యం చూస్తోంది. ‘చాటలో తవుడు పోశాం.. తన్నుకు చావండి…’ అన్నట్టు ఒక్కరికి చెల్లించే వేతనాన్నే ఇద్దరు, ముగ్గురు పంచుకోవాలంటూ వెకిలి వేషాలేస్తోంది. ఇది అత్యంత బాధ్యతారాహిత్యం. వీటితోపాటు సర్కారు వారు తలచుకుంటే ఇట్టే పరిష్కరించగలిగే పలు చిన్న చిన్న సమస్యలపైన పంచాయతీ కార్మికులు సర్కారు ముందు ‘పంచాయితీ’ పెట్టారు. అయినా ఏలినవారు కనికరించలేదు.. సమస్యలను పరిష్కరించలేదు. అందుకే విసిగిపోయిన వారు గురువారం నుంచి సమ్మె శంఖారావాన్ని పూరించనున్నారు.
ఇప్పుడు అసలే వర్షాకాలం. ఇప్పటికే డెంగీ, మలేరియా, టైఫాయిడ్‌ జ్వర పీడితులతో ఆస్పత్రులు కిటకిటలాడుతున్నాయి. ఈ క్రమంలో ‘ఆరోగ్య రంగంలో తెలంగాణ నెంబర్‌ వన్‌, పల్లె దవాఖానాలు, బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేశాం.. సీజనల్‌ వ్యాధులు తగ్గాయి…’ అని గొప్పలు చెప్పుకుంటున్న ప్రభుత్వాధీశులు… పంచాయతీ కార్మికులు ఒక్కసారి సమ్మెలోకి వెళితే ఏమవుతుందో ఆలోచించుకోవాలి. సమ్మెను నివారించలేకపోతే పంచాయతీల్లోని వీధులు, గల్లీలూ, రోడ్లు ఊర్చేవారు లేక.. చెత్త ఎత్తేసేవాడు లేక.. మురికి కాల్వలు, నాలాలు శుభ్రం చేసే నాథుడే లేక కంపు కొట్టటం ఖాయం. అప్పుడు సీజనల్‌ వ్యాధులు మరింత ప్రబలటం తథ్యం. ఆ పరిస్థితి తలెత్తితే దానికి ఎవరు బాధ్యులు..? అప్పుడు ‘నిమ్స్‌లో కొత్త బిల్డింగ్‌, ఎంజీఎంలో 28 అంతస్తుల భవనం, జిల్లాలో మెడికల్‌ కాలేజీ…’లు కూడా ప్రాణాంతక వ్యాధులను నివారించలేవు. అందుకే పంచాయతీ కార్మికుల సమస్యలను గుర్తించి, పరిష్కరించటమనేది సర్కారు తక్షణ కర్తవ్యంగా ఉండాలి. అందుకోసం వారి పట్ల ఉన్న ఉద్దేశపూర్వక నిర్లక్ష్యాన్ని, వివక్షాపూరిత చర్యలను విడనాడి కార్యాచరణ ప్రకటించాలి.

Spread the love