ఇది శిక్షా కాలం కాదు శిక్షణా కాలం

This is not a punishment period but a training period– మంచి లక్షణాలతో బయటకు వెళ్ళాలి
– జ్యువైనల్‌ హోమ్‌లో విద్యార్థులతో సీతక్క మాటాముచ్చట
– వారితో కలిసి భోజనం
– విలువిద్యను చూసి ఆశ్చర్యపోయిన మంత్రి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
జ్యువైనల్‌ హోమ్‌ అంటేనే పరివర్తన కేంద్రమని స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ(సీతక్క) అన్నారు. తెలిసీతెలియని వయస్సులో చేసిన తప్పులతో వచ్చిన 72 మంది చిన్నారులు ఇక్కడ బాలనేరస్తులుగా ఉన్నారనీ, ఇది శిక్షా కాలంగా కాకుండా శిక్షణా కాలంగా భావించి జీవితంలో ఎదగడానికి తమను తాము తీర్చుదిద్దుకోవాలని పిల్లలకు సూచించారు. మంగళవారం హైదరాబాద్‌లోని స్టేట్‌ జ్యువైనల్‌ హోమ్‌ను మంత్రి సీతక్క సందర్శించారు. పిల్లలు ప్రదర్శించిన విలువిద్యను చూసి మంత్రముగ్ధులయ్యారు. వారితో కలిసిపోయి తానూ బాణాలు సంధించారు. వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. వారితో కలిసి భోజనం చేశారు. నూతన వస్త్రాలను అందజేశారు. హోమ్‌లోని బాలనేరస్తులు తాము తయారు చేసిన బెడ్‌షీట్లు, కార్పెట్లు, ఇతర వస్తువులను సీతక్కకు బహుకరించారు. ఈ కార్యక్రమంలో మంత్రితో పాటు మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి వాకాటి కరుణ, డైరెక్టర్‌ కాంతి వెస్లీ, మహిళా శిశు సంక్షేమ శాఖ కార్పొరేషన్‌ చైర్‌పర్సన్‌ బండారు శోభారాణి, తదితరులు పాల్గొన్నారు. పిల్లలనుద్దేశించి సీతక్క మాట్లాడుతూ..ఇక్కడ నుంచి మంచి లక్షణాలు అలవర్చుకుని బయటకు వెళ్లాలని సూచించారు. అందరూ త్వరగా అమ్మానాన్నల చెంతకు చేరుకోవాలని ఆకాంక్షిం చారు. ఈ హోమ్‌లో మానసికంగా బలోపేతమవుతూ మంచి పౌరులుగా ఎదిగి పేరుతెచ్చుకోవాలని దీవించారు. పిల్లలు తమ సృజనాత్మక ఆలోచనలకు పదును పెట్టాలని సూచించారు. మానవతా దృక్పథంతో హోమ్‌ సిబ్బంది పనిచేయాలని ఆదేశించారు. సొంతపిల్లల్లాగా భావించి వారి ఎదుగుదలకు సహకరించాలని కోరారు. త్వరలో ఇక్కడ గ్రంథాలయం, యోగ కేంద్రాలను ఏర్పాటు చేస్తామన్నారు. హోమ్‌లో పిల్లలకు కావాల్సిన విద్యను అందిస్తున్నామనీ, వృత్తిపరమైన కోర్సుల్లో శిక్షణ అందిస్తున్నామని తెలిపారు. టాటా టెక్నికల్‌ సపోర్ట్‌తో సాంకేతిక పరిజ్ఞానం నేర్పిస్తున్నామని చెప్పారు. విలువిద్యలో నేషనల్‌ గేమ్స్‌ వరకు విద్యార్థులు వెళ్లడం అభినందించాల్సిన విషయమన్నారు. బాలనేరస్తుల్లో సత్పప్రవర్తన తీసుకొచ్చి త్వరలోనే ఇంటికి పంపిస్తామన్నారు.

Spread the love