ప్రచారాలకు ఇచ్చిన సమయం ఇదే..

This is the time given for campaigns.– బీఆర్‌ఎస్‌కు 277 నిమిషాలు కేటాయింపు
– కాంగ్రెస్‌ 185, బీజేపీకి 79, టీడీపీ 62, ఎంఐఎంకి 58, బీఎస్పీకి 55 నిమిషాలు సీపీఐ(ఎం)కు 47 నిమిషాలు
– డీడీ, ఆలిండియా రేడియోల్లో సమయం కేటాయించిన ఈసీఐ
నవతెలంగాణ -న్యూఢిల్లీ బ్యూరో
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీజేపి, కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ లతో పాటు రాష్ట్రంలోని దాదాపు ఇతర పది పార్టీలకు ప్రసార భారతి ఆధీనంలోని దూరదర్శన్‌ (డీడీ), ఆలిండియా రేడియోల్లో ప్రచారానికి కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) సమయం కేటాయించింది. అలాగే తెలంగాణ తో పాటు ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో జాతీయ పార్టీలు, ప్రాంతీయ పార్టీలకు ప్రచార సమయాన్ని విడుదల చేసింది. ఈ మేరకు శుక్రవారం ఈసీఐ ప్రకటన రిలీజ్‌ చేసింది. తెలంగాణలో గుర్తింపు పొందిన నేషనల్‌, రీజినల్‌ పార్టీలకు కలిపి బ్రాడ్‌కాస్ట్‌కు 898 నిమిషాలు, టెలికాస్ట్‌కు 898 నిమిషాలను వేరు వేరుగా కేటాయించినట్టు అండర్‌ సెక్రటరీ రాజేశ్‌ కుమార్‌ సింగ్‌ వెల్లడించారు. రాష్ట్ర స్థాయిలోని ప్రసార భారతి కేంద్రంలో ఆయా పార్టీలకు కేటాయించిన సమయాన్ని వినియోగించుకోవచ్చని తెలిపారు. కాగా ప్రస్తుతం అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్‌ పార్టీకి ఈసీఐ ఎక్కువ సమయం కేటాయించింది. బీఆర్‌ఎస్‌ పార్టీకి 277 నిమిషాలు కేటాయించగా, ఆ సమయాన్ని 5 నిమిషాలకు ఒక స్లాట్‌ చొప్పున 55 స్లాట్లుగా విభజించింది. కాంగ్రెస్‌ పార్టీకి 185 నిమిషాలను 5 నిమిషాల చొప్పున 37 స్లాట్లు, బీజేపీకి 79 నిమిషాలను 5 నిమిషాల చొప్పున 15 స్లాట్లుగా డివైడ్‌ చేసింది. అలాగే టీడీపీకి 62 నిమిషాలను 12 స్లాట్లుగా, ఏఐఎంఐఎం పార్టీకి 58 నిమిషాలను 11 స్లాట్లుగా, బీఎస్పీకి 55 నిమిషాలను 11 స్లాట్లుగా, సీపీఎంకు 47 నిమిషాలను 9 స్లాట్లుగా విభజించింది. కాగా వైఎస్సార్‌ సీపీ, ఆమ్‌ ఆద్మీ పార్టీ, ఎన్‌ పీపీ (నేషనల్‌ పీపుల్స్‌ పార్టీ) లకు 45 నిమిషాల చొప్పున 9 స్లాట్లుగా బ్రాడ్‌ కాస్ట్‌, టెలికాస్ట్‌ కు విడివిడిగా సమయం నిర్ణయించింది. అయితే అన్ని పార్టీలు ఈ ప్రచారాన్ని ఎన్నికలకు 48 గంటల్లో ( 2 రోజుల) ముందు నిలిపివేయాల్సి ఉంటుందని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది.

Spread the love