– ముందున్నది ముసళ్ల పండగ !
– మోడీ ప్రభుత్వానికి ప్రతిపక్షం వార్నింగ్
– ఓటమి తప్పదని తెలిసీ స్పీకర్ పదవికి పోటీ
– ఏకపక్ష నిర్ణయాలకు కాలం చెల్లిందని సందేశం
18వ లోక్‌సభ స్పీకర్‌గా ఓం బిర్లా మరోసారి ఎన్నిక య్యారు. ఈ నేపథ్యంలో ఓటమి తప్పదని తెలిసి కూడా స్పీకర్ పదవికి పోటీ పెట్టి ప్రతిపక్షాలు ఏం సాధించాయన్న ప్రశ్న తలెత్తుతోంది. ప్రతిపక్ష కూటమి తరఫున స్పీకర్ పదవికి పోటీ చేసిన కాంగ్రెస్ సీనియర్ సభ్యుడు కె.సురేష్ ఓడిపోయారు. మూజువాణీ ఓటుతో ఓం బిర్లా ఎన్నికయ్యారని ప్రొటెం స్పీకర్ భర్తృహరి మహతాబ్ ప్రకటించారు. ప్రతిపక్ష పార్టీలు కూడా ఓటింగ్‌కు పట్టుబట్టలేదు. సభలో తగిన సంఖ్యాబలం లేకపోవడంతో ఇండియా కూటమి ఓడిపోయినప్పటికీ…2014-24 కాలం మాదిరిగా 2024-29 ఉండబోదన్న సంకేతాన్ని పంపడంలో విజయం సాధించింది. రాబోయే రోజుల్లో ప్రభుత్వం ఏకపక్ష నిర్ణయాలు తీసుకోలేదని, ప్రతి దశలోనూ ప్రతిపక్షాల నుంచి రాజ్యాంగ సవాళ్లు ఎదుర్కోవాల్సి ఉంటుందన్న అభిప్రాయాన్ని కలిగించగలిగింది. స్పీకర్ ఎన్నికలో పరాజయం తప్పదని తెలిసి కూడా పోటీ చేసిన ఇండియా బ్లాక్ ఏం సాధించిందో అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది.
న్యూఢిల్లీ : లోక్‌సభ ఎన్నికల ప్రచారం సందర్భంగా దళితుల సంక్షేమ ఎజెండా తెరపైకి వచ్చింది. ఈ అంశాన్ని ప్రతిపక్షాలు పూర్తి స్థాయిలో ఉపయోగిం చుకున్నాయి. స్పీకర్ ఎన్నిక సమయంలోనూ కాంగ్రెస్, ఇండియా బ్లాక్‌లోని ఇతర భాగస్వామ్య పక్షాలు తాము దళితుల బాగోగులకే కట్టుబడి ఉన్నామన్న సంకేతాన్ని పంపాయి. దళితుడైన సీనియర్ ఎంపీ కొడికున్నిల్ సురేష్‌ను స్పీకర్ పదవికి నిలబెట్టాయి. ఆయన ఎస్సీ కులానికి చెందిన ‘చెరమార్’ తెగకు చెందిన వారు. వాస్తవానికి సురేష్‌ను ప్రొటెం స్పీకర్‌గా నియమించాలని కాంగ్రెస్ పట్టుబట్టింది. అయితే ప్రభుత్వం అందుకు అంగీకరించలేదు. దళిత అభ్యర్థిని ప్రొటెం స్పీకర్ కానీయకుండా ఎన్డీఏ అడ్డుకుందన్న సందేశాన్ని ఇండియా బ్లాక్ జనంలోకి పంపింది.
స్పీకర్ ఎన్నిక విషయంలో ఇండియా బ్లాక్ ప్రజలకు మరో సందేశాన్ని కూడా పంపేందుకు ప్రయత్నించింది. అది రాజ్యాంగ సంప్రదాయాల పరిరక్షణకు సంబంధించిన సందేశం. అధికార పక్షానికి చెందిన వారిని స్పీకర్‌గా, ప్రతిపక్ష సభ్యుడిని డిప్యూటీ స్పీకర్‌గా ఎన్నుకోవడం సంప్రదా యంగా వస్తోంది. అయితే అందుకు అంగీకరించేందుకు అధికారపక్షం సంసిద్ధత చూపలేదు. అందుకే స్పీకర్ పదవికి పోటీ పడటం ద్వారా సభా సాంప్రదాయాలను ఉల్లంఘిస్తున్న అధికార పక్ష తీరును ఎండగట్టింది. ప్రభుత్వ తీరును ప్రజల ముందుంచింది. అదే సమయంలో ఏకపక్ష నిర్ణయాలు ఇకపై సాగబోవని ప్రభుత్వానికి సవాలు విసిరింది.
ఇక రాజీ అనే మాటే లేదు
2019లో ప్రభుత్వం ఎవరినీ ఉప సభాపతిగా నియమించలేదు. ప్రతిపక్షాలకు డిప్యూటీ స్పీకర్ పదవిని ఇచ్చేందుకు ఇప్పుడూ సిద్ధపడడం లేదు. దీనిపై ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. సంవత్సరాల తరబడి కొనసాగుతున్న సంప్రదాయాలను పాలక పక్షం ఉల్లంఘిస్తోందని ప్రజలకు గుర్తు చేస్తున్నాయి. రాజ్యాంగ విలువలను కాపాడేందుకే స్పీకర్ పదవికి పోటీ చేశామని చెబుతున్నాయి. గెలుస్తానా ఓడతానా అనేది తనకు తెలియదని, అయినా పోటీ చేస్తున్నానని సురేష్ మంగళవారం నాడే చెప్పారు. ‘ఏకాభిప్రాయం గురించి ప్రధాని మాట్లాడుతుంటారు. కానీ మమ్మల్ని స్పీకర్ పదవికి పోటీ చేసేలా చేశారు. సంప్రదాయాలను తుంగలో తొక్కారు. 17వ లోక్‌సభలో డిప్యూటీ స్పీకర్ లేకుండా చేశారు. ఇప్పుడేమో స్వాతంత్య్రం వచ్చిన తర్వాత తొలిసారిగా స్పీకర్ పదవికి పోటీ అనివార్యం చేశారు’ అని కాంగ్రెస్ నేత పవన్ ఖేరా ట్వీట్ చేశారు. ఏదేమైనా ప్రతిపక్ష కూటమి తన వైఖరికి సంబంధించి ప్రస్తుతానికి ట్రైలర్ మాత్రమే చూపించింది. అధికార పక్షంతో ఏ విషయంలోనూ రాజీ పడబోనని స్పష్టం చేసింది.
రాహుల్ నాయకత్వ సామర్ధ్యం
స్పీకర్ ఎన్నిక విషయంలో రాహుల్ గాంధీ తన నాయకత్వ సామర్ధ్యాన్ని నిరూపించుకు న్నారు. స్పీకర్ ఎన్నికపై ఆయన తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీతో 20 నిమిషాల పాటు ఫోన్లో సంప్రదించారు. సురేష్‌ను అభ్యర్థిగా నిలిపేముందు ఇండియా బ్లాక్ తనను సంప్రదించ లేదని మమత కినుక వహించారు. ఆమెను శాంతపరిచేందుకు రాహుల్ చేసిన ప్రయత్నం ఫలించింది.
మా గొంతుకను అణచివేయొద్దు
”లోక్‌సభలో విపక్షాల గొంతుకను అణచివేయకుండా వ్యవహరించాలి. సభలో ప్రతి ఒక్క సభ్యుడిని, పార్టీని గౌరవిస్తూ ఎవరి పట్లా వివక్ష చూపకుండా ఉంటారని మేం విశ్వసిస్తున్నాం. స్పీకర్‌గా మీకున్న అనుభవంతో సభను సజావుగా నడిపిస్తారనే నమ్మకం మాకు ఉంది. ఏ ప్రజా ప్రతినిధి గొంతు నొక్కకుండా నిష్పాక్షికం గా వ్యవహరిస్తూ బహిష్కరణల పర్వం పునరావతం కానీయరాదని ఆశిస్తున్నాం. విపక్షంతో పాటు పాలక పక్షాన్నీ మీ నియంత్రణలో ఉంచాలి. అధికార పక్షంతో పాటు విపక్షాన్నీ మీరు సమదష్టితో చూస్తూ సమాన అవకాశాలు ఇవ్వాలి”
– ఎస్పీ చీఫ్, ఆ పార్టీ ఎంపీ అఖిలేశ్‌యాదవ్
రాజ్యాంగాన్ని పరిరక్షించాలి
”ప్రజల గొంతుకను వినిపించేందుకు అనుమతించాలి. భారత రాజ్యాంగాన్ని పరిరక్షించేందుకు చొరవ చూపాలి. గతంతో పోలిస్తే ప్రస్తుత సభలో విపక్షం జన గళాన్ని మరింత బలంగా వినిపిస్తుంది. సభా నిర్వహణలో పూర్తిగా సహకరిస్తాం. విపక్షం మాట్లాడేందుకు అనుమతించడంతో పాటు భారత ప్రజల పక్షాన తమ ప్రాతినిధ్యాన్ని అనుమతిస్తారనే విశ్వాసం మాకుంది.”
-విపక్షనేత రాహుల్ గాంధీ