– దొడ్డిదారిన ఉపాధ్యాయుల డిప్యుటేషన్
– రంగారెడ్డి జిల్లా డీఈవో ఉత్తర్వులు జారీ
– ఆందోళనలో టీచర్లు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్రంలో పాఠశాలలు, కాలేజీల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు, అధ్యాపకులు బదిలీలు, డిప్యూటేషన్, ఆన్ డ్యూటీ (ఓడీ) వంటి వాటిని పారదర్శకంగా నిర్వహిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఇందుకోసం ప్రత్యేకంగా ఓ పోర్టల్‌ను అందుబాటులోకి తేవాలని నిర్ణయించింది. దరఖాస్తులను ఆన్‌లైన్‌లో ఆహ్వానించి వాటిని పరిశీలించడం కోసం ఉన్నతాధికారులతో కమిటీని కూడా నియమించింది. ఇందులో కళాశాల విద్యాశాఖ, సాంకేతిక విద్యాశాఖ కమిషనర్, ఉన్నత విద్యామండలి కార్యదర్శి, ఇంటర్ విద్యాశాఖ డైరెక్టర్ సభ్యులుగా ఉంటారనీ, పాఠశాల విద్యాశాఖ కమిషనర్ మెంబర్ కన్వీనర్‌గా వ్యవహరిస్తారని ప్రకటించింది. అయితే బదిలీలు, డిప్యూటేషన్, ఓడీ వంటివి పారదర్శకంగా జరుగుతాయని అందరూ ఆశించారు. కానీ దొడ్డిదారిన డిప్యూటేషన్ ఉత్తర్వులు వెలువడుతుండడం పట్ల ఉపాధ్యాయుల్లో ఆందోళన వ్యక్తమవుతున్నది. రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం చుక్కాపూర్ ఎంపీపీఎస్‌లో ఎస్జీటీగా పనిచేస్తున్న పి శ్రీదేవిని అదే జిల్లా సరూర్‌నగర్ మండలం బొమ్మనగండి ఎంపీయూపీఎస్‌కు డిప్యూటేషన్ మీద పంపిస్తూ రంగారెడ్డి జిల్లా డీఈవో పి సుశీందర్‌రావు ఈనెల 20న ఉత్తర్వులు జారీ చేశారు. ఆమె ఇక్కడ రెండేండ్ల వరకు కొనసాగుతారని స్పష్టం చేశారు. ప్రతినెలా హాజరు వివరాలను చుక్కాపూర్ ఎంపీపీఎస్ హెడ్మాస్టర్‌కు సరూర్‌నగర్ మండలం ఎంపీయూపీఎస్ హెడ్మాస్టర్ ఇవ్వాలని సూచించారు. ఈ ఉత్తర్వులు వెంటనే అమల్లోకి వస్తాయని వివరించారు. పారదర్శకత అంటే ఇదేనా?అని ఉపాధ్యాయులు విద్యాశాఖ అధికారులను ప్రశ్నిస్తున్నారు. దొడ్డిదారిన ఉపాధ్యాయుల డిప్యూటేషన్ ఉత్తర్వులను జారీ చేయడం పట్ల ఉపాధ్యాయ సంఘాలు విమర్శిస్తున్నాయి. అందరి ఉపాధ్యాయులకు ఒకే విధానాన్ని పాటించాలనీ, దొడ్డిదారిన జారీ చేసిన ఉత్తర్వులను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి.