– గుంట జాగాలో గుడిసెలు వేస్తే కేసులు.. ఎకరాలు కబ్జాలు పెడితే పట్టాలా..?
– ప్రభుత్వ ద్వంద్వ న్యాయం పనికిరాదు
– ప్రభుత్వ ఆక్రమణలపై సీఎం కేసీఆర్ శ్వేతపత్రం విడుదల చేయాలి
– ఈ పోరాటం ప్రారంభం మాత్రమే: సీపీఐ(ఎం) పొలిట్ బ్యూరో సభ్యులు బివి రాఘవులు
– తుర్కయంజాల్‌లో ప్రజాసంఘాల ఐక్యపోరాట వేదిక బస్సు యాత్ర ముగింపు బహిరంగసభ
ప్రభుత్వ స్థలాల్లో ఇండ్లు లేని నిరుపేదలు గుడిసెలు వేసుకుని.. ఆ జాగాలకు పట్టాలు ఇవ్వాలని చేస్తున్న పోరాటం న్యాయమైనదని సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో సభ్యులు బివి.రాఘవులు అన్నారు. ప్రభుత్వ భూమిలో గుంట జాగాలో గుడిసెలు వేసుకున్న పేదోడు ఆక్రమణదారుగా,, వందల ఎకరాల ప్రభుత్వ భూమి కబ్జాపెట్టిన పెట్టుబడిదారులు నీతిమంతులుగా చిత్రీకరిస్తూ ప్రభుత్వం ద్వంద్వ న్యాయం పాటిస్తోందని విమర్శించారు. రాష్ట్రం ప్రభుత్వం పేదల పక్షమా.. పెట్టుబడుదారుల పక్షామా తేల్చుకోవాలన్నారు. పేదలకు ఇండ్లు, జాగాలు ఇవ్వాలని తెలంగాణ ప్రజాసంఘాల ఐక్యపోరాట వేదిక ఆధ్వర్యంలో చేపట్టిన బస్సుయాత్ర రాష్ట్ర వ్యాప్తంగా 24 జిల్లాల్లో 66 భూపోరాట కేంద్రాలను సందర్శిస్తూ.. గుడిసె వాసుల్లో చైతన్యాన్ని నింపుతూ మంగళవారం రంగారెడ్డి జిల్లా తుర్కయాంజాల్‌కు చేరుకుంది. ఈ సందర్భంగా ప్రజా సంఘాల ఐక్యపోరాట వేదిక రంగారెడ్డి జిల్లా కన్వీనర్ పగడాల యాదయ్య అధ్యక్షతన జరిగిన ముగింపు బహిరంగ సభలో బివి.రాఘవులు ప్రసంగించారు.
నవతెలంగాణ -రంగారెడ్డి ప్రాంతీయ ప్రతినిధి
డబుల్ బెడ్ రూమ్‌లు ఇస్తానన్న సీఎం కేసీఆర్ తొమ్మిదేండ్లుగా ఇవ్వకపోగా.. పేదలు గుడిసెలు వేస్తే కూల్చే దౌర్భాగ్య స్థితిలో ఉన్నారని బివి.రాఘవులు విమర్శించారు. డబుల్ బెడ్ రూమ్‌లపై ఆశలేక.. ప్రభుత్వ స్థలాల్లో గుడిసెలు వేసుకుని నివాసం ఉంటున్నారని తెలిపారు. గుడిసె వాసులపై ప్రభుత్వం ఎన్ని నిర్భందాలు పెట్టినా వెనక్కి తగ్గకుండా జాగాలు ఇచ్చేదాక పోరాడుతున్న పేదలకు ఎర్రజెండా అండగా ఉంటుందని చెప్పారు. ప్రభుత్వ భూములపై పేదోడికే హక్కు ఉందని చాటి చెప్పుతూ ప్రజాసంఘాల ఐక్యపోరాట వేదిక గుడిసె వాసులను చైతన్యపర్చుతూ ఉద్యమాలకు ఊతమిచ్చేలా బస్సు యాత్ర చేసిందన్నారు.
అభివృద్ధిలో భాగస్వామ్యమైన పేద ప్రజలకు గూడు కోసం గుంట జాగా ఇవ్వాలన్న సోయి సర్కారుకు లేకపోయిందన్నారు. నగరంలో భవనాలు నిర్మించేది, రోడ్లు ఊడ్చేది, డ్రైనేజీలు తీసి పరిపాలన సౌలభ్యంలో ఎలాంటి ఆటంకాలూ కలుగ కుండా చేసేది పేదలైతే.. రాజ భోగాలు మాత్రం పెట్టుబడి దారులకా అని ప్రశ్నించారు. పేద ప్రజలతో పెట్టుకున్న ఏ ప్రభుత్వం బతికి బయటపడలేదన్నారు. నగరంలో రూ.లక్ష వేతనం ఉన్న వారు కూడా సొంత ఇల్లు నిర్మించుకునే పరిస్థితి లేదు.. ఇక కూలీనాలి చేసుకునే సామాన్యులు ఇల్లు కొనుగోలు చేసే పరిస్థితి ఎక్కడిదన్నారు. రాష్ట్రంలో వందల ఎకరాల ప్రభుత్వ భూములను కబ్జా పెట్టిన పెట్టుబడిదారులపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. పేదల గుడిసెలపై ఎందుకు దాడులు చేస్తున్నారని నిలదీశారు. రియల్టర్లు కబ్జాలు పెట్టిన భూములపై కేసులు పెడితే అది సివిల్ కేసు అవుతుంది దాంట్లో పోలీసులు తలదుర్చ బోమంటారు.. అదే ప్రభుత్వ భూమిలో గుడి సెలు వేసిన పేదలపై కేసులు పెడితే అది క్రిమినల్ కేసు ఎట్టా అవుతుందని ప్రశ్నించారు. వ్యాపారుల నుంచి వచ్చే వాటాలకు కక్కుర్తిపడి ద్వంద్వ న్యాయం ప్రదర్శిస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో వేల ఎకరాల ప్రభుత్వ భూములు ఆక్రమణకు గురయ్యాయని.. వాటిని సర్వే చేసి ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే ఆ లెక్కలు తమ పార్టీ ఆధ్వర్యంలో ఇస్తాం.. వారిపై చర్యలు తీసుకుంటారా అని సవాల్ విసిరారు. తక్షణమే రాష్ట్రంలో ఇల్లు లేని పేదలందరికీ ప్రభుత్వ భూముల్లో స్థలాలు ఇవ్వాలని, లేకపోతే ప్రభుత్వ భూముల్లో రియల్ వ్యాపారులు చేపట్టిన భవనాల్లో పేదలు నివాసం ఉంటారని హెచ్చరించారు.
ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి మాట్లాడుతూ.. ఇంటి సమస్య మగవారికంటే మహిళలకే ఎక్కువ ఉంటుందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మహిళలకు ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వాలపై నమ్మకం లేక మహిళలు ఈ రోజు రోడ్ల మీదికి వచ్చి తమ హక్కుల కోసం పోరాటం చేస్తున్నారని తెలిపారు. గుడిసెల పోరాటంలో అగ్రగామి మహిళలు నిల్చారని చెప్పారు. ప్రభుత్వ భూముల్లో గుడిసెలు వేసుకున్న మహిళలపై పోలీసులు దాడులకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళా దినోత్సవం పేరుతో ఒక పక్కన ఉత్సవాలు నిర్వహిస్తూ.. మరో పక్కన మహిళలపై దాడులు చేయిస్తున్నారన్నారు. ఈ సభలో బస్సుయాత్ర నాయకులతోపాటు సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జాన్‌వెస్లీ, జిల్లా కార్యదర్శి భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.
బీజేపీకి పేదల సమస్యల సోయేలేదు– ప్రజా సంఘాల ఐక్యపోరాట వేదిక రాష్ట్ర కన్వీనర్ ఎస్.వీరయ్య
రాష్ట్రంలో అధికారంలోకి వస్తామం టున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజరుకి పేదల ఇంటి జాగాల గురించి పట్టించుకునే సోయి లేదని ప్రజా సంఘాల ఐక్యపోరాట వేదిక రాష్ట్ర కన్వీనర్ ఎస్.వీరయ్య అన్నారు. కేంద్రంలో అధి కారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ప్రధాన మంత్రి ఆవాస్ యోజన్ కింద 2022 డిసెంబర్ 31 నాటికి ఇల్లు లేని పేదలందరికీ ఇల్లు కట్టిస్తామని.. ఎక్కడ ఇచ్చిందో బండి సంజరు, కిషన్ రెడ్డి కేంద్రాన్ని అడగాలని సూచించారు.
రాష్ట్ర ప్రభుత్వం డబుల్ బెడ్ రూమ్ ప్రస్తావన పక్కపెట్టి, గృహ లక్ష్మి పథకాన్ని తీసుకొచ్చిందని చెప్పారు. దీనితో పేదల ఇండ్ల సమస్యలు తీరవన్నారు. గృహలక్ష్మి నియమ నిబంధనలు మార్చాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఇండ్లు లేని నిరుపేదలు ప్రభుత్వం లెక్కల ప్రకారం 30 లక్షల మంది ఉన్నారని చెప్పారు. ఇందుల్లో లక్ష మంది ప్రభుత్వ భూముల్లో గుడిసెలు వేసుకుని నివాసం ఉంటున్నారన్నారు. వారికి ఇంటి జాగాల పట్టాలు ఇవ్వాలని కోరారు. మిగిలిన 28 లక్షల మందికి కూడా ప్రభుత్వ భూముల్లో స్థలాలు ఇవ్వాలన్నారు.